Take a fresh look at your lifestyle.

లైఫ్‌ ‌చేంజింగ్‌ ‌జర్నీ ‘ఢిల్లీ టు లండన్‌’ ‌బస్‌ ‌ప్రయాణం…!

‘అడ్వెంచర్స్ ఓవర్‌లాండ్‌’ ‌కంపెనీ త్వరలో నిర్వహించనున్న ‘ఢిల్లీ టు లండన్‌’ ‌బస్సు ప్రయాణం ఆసక్తిగల సాహసవీరులకు, పర్యాటకులకు అపూర్వ అనుభూతులను ఇవ్వనున్నది. అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక దూరం కవర్‌ ‌చేయనున్న ‘బస్‌ ‌టు లండన్‌’ ‌యాత్రలో 20 మంది యాత్రికులు, 20,000 కిమీ (12,427 మైళ్లు) దూరాన్ని 70 రోజుల్లో ఖండాలు దాటుతూ, 8-టైమ్‌ ‌జోన్లు తాకుతూ, 18 దేశాలను మీదుగా పరుగిడుతూ మరుపురాని గుర్తులను ప్రదానం చేయనుందనే విషయం సాహసయాత్రలను ఇష్టపడే వారికి పర్యాటక విందు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నది. ‘ఢిల్లీ టు లండన్‌’ ‌ప్రయాణానికి దాదాపు ? 15 లక్షల ఖర్చు కాగల ప్రయాణంలో ఒక్కో భాగానికి 3.5 – 4.95 లక్షల ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయాణాన్ని ఒకటి లేదా కొన్ని భాగాలుగా కూడా చేసుకునే వెసులుబాటు కల్పించడం విశేషం. ప్రయాణంలో భాగంగా హోటల్‌ ‌రూమ్‌లు, భోజన వసతులను నిర్వహకులే కల్పించనున్నారు.

ఈ బస్సు ప్రయాణానికి ఇప్పటి వరకు 40,000 మంది ప్రయాణీకులు తమ పేర్లను నమోదు చేసుకోవడం జరిగింది. ఈ ప్రయాణంలో చూడదగిన ప్రదేశాలలో కొన్నింటికి విమాన లేదా రైలు వసతులు కూడా లేవని గమనించాలి. బస్సు యాత్రలో ప్రకృతి అందాలు, పర్యాటక సోయగాలు, మారుమూల ప్రాంతాలు, చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపదలు, వైవిధ్యభరిత సంస్కృతులు, విలక్షణ జనజాతులను చూసే భాగ్యం కూడా కలుగనుంది. ‘బస్‌ ‌టు లండన్‌’ ‌ప్రయాణం చేసే యాత్రీకులకు అపూర్వ అనుభవాలు, జీవితంలో మరిచి పోలేని జ్ఞాపకాలు, చారిత్రక ప్రయోగాలు, ఉల్లాసభరిత, స్వేచ్ఛ విహంగ రీతులు మరియు సాహసక్రియలు అనుభవంలోకి రానున్నాయని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. మే 2021 తరువాత ప్రారంభం కానున్న బస్సు యాత్ర కరోనా కల్లోల నేపథ్యంలో ఏప్రిల్‌ 2022‌కి వాయిదా వేయడం జరిగిందని గమనించాలి.

24-గంటల వైఫై వసతులు కల్పించబడిన ఈ బస్సులో అత్యాధునిక వసతులు, సౌకర్యవంతమైన సీట్‌ అమరికలు, వినోద వనరులు, లాకర్‌, ‌స్వయం పాంట్రీ, స్నాక్స్ ‌లాంటి విలాసవంతమైన సౌకర్యాలు కల్పించబడతాని నిర్వాహకులు సంజయ్‌ ‌మదన్‌, ‌తుషార్‌ అగర్వాల్‌లు తెలిపారు. గతంలో ఇలాంటి ‘రోడ్‌ ‌టు లండన్‌’ ‌ప్రయాణాలను 2017, 2018, 2019లలో కూడా చేపట్టామని తెలిపారు. ఈ బస్‌ ‌ప్రయాణీకులు 10 వీసాలు అవసరం అవుతాయని, ఆరు మాసాల ముందే ప్రణాళికలు చేపడతామని తెలిపారు. ‘ఢిల్లీ టు లండన్‌’ ‌బస్సు ప్రయాణంలో అనేక మియన్మార్‌ ‌పగోడాలు, చెంగ్డూలోని అరుదైన పాండాస్‌, ‌చైనా సిల్క్ ‌రూట్‌, ‌సెంట్రల్‌ ఏసియా, గ్రేట్‌ ‌వాల్‌ ఆఫ్‌ ‌చైనా, యూరోపియన్‌ ‌దేశాల అందాల విందులు యాత్రికులను పరమానందసాగరంలో ముంచనున్నాయి. లండన్‌ ‌చేరిన తరువాత ఒక నెల విరామంతో తిరిగి ‘లండన్‌ ‌టు ఢిల్లీ’ యాత్ర ప్రారంభం అవుతుంది. ఈ 70-రోజుల బస్‌ ‌ప్రయాణాన్ని నాలుగు భాగాలుగా వర్గీకరించారు.

భాగం-1 ఇండియా, మయన్మార్‌, ‌థాయ్‌లాండ్‌ (‌సౌత్‌ ఈస్ట్ ఏసియా – 11 రాత్రులు, 12 రోజులు):
న్యూఢిల్లీలో ప్రారంభమయ్యే అత్యంత దూరమైన బస్సు ప్రయాణంలో ఇండియా సరిహద్దులు దాటుతూ మయన్మార్‌లో అడుగు పెడుతూ అందాలను ఆరబోయనుంది. పురాతన ‘బగాన్‌’, ‌క్రియాశీల ‘యాంగాన్‌’, ‘‌గోల్డెన్‌ ‌రాక్‌ ‌పకోడ’, ‘మౌంట్‌ ‌కైక్టో’ లాంటి పర్యాటక స్థలాలను పరిచయం చేయనుంది. మయన్మార్‌ ‌దాటుతూ థాయ్‌లాండ్‌లోకి అడుగు పెడుతూ బ్యాంకాక్‌ ‌నగర వెలుగులను చూపుతూ ‘చియాంగ్‌ ‌కోణగ్‌’, ‘‌మెకాంగ్‌ ‌నది’, ‘లావోస్‌’‌లను చూపుతూ చైనాలోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రయాణానికి 12 రోజుల సమయం తీసుకోనుంది.

భాగం-2 చైనా (15 రాత్రులు, 16 రోజులు) :
‘కుమిన్గ్- ‌సిటీ ఆఫ్‌ ఎటర్నల్‌ ‌స్ప్రింగ్‌’ ‌వద్ద చైనా భూభాగంలోకి ప్రవేశించే బస్సు 16 రోజుల పాటు చైనా దేశ అందాలను యాత్రికులకు చూపనుంది. సిల్క్ ‌రోడ్డు దారిన ఉన్న ‘గ్రేట్‌ ‌వాల్‌ ఆఫ్‌ ‌చైనా’, ‘మోంగో గుహల’ను చూసే భాగ్యం కలుగనుంది. ‘గ్జిన్‌జియాంగ్‌’, ‘‌టర్పన్‌’, ‘‌కష్గర్‌’, ‘‌కాస్లపియన్‌ ‌సముద్రాల’ను పరిచయం చేసే ప్రయాణంలో రెండవ భాగం పూర్తి అవుతుంది.

భాగం-3 సెంట్రల్‌ ఏసియా (కర్గిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, ‌కజకిస్థాన్‌, ‌రష్యా – 21 రాత్రులు, 22 రోజులు):
చైనా భూభాగాన్ని దాటుతూ సిల్క్ ‌రూట్‌లో కిర్గిస్థాన్‌లోని ‘బిష్కెక్‌’‌లో అడుగిడుతూ ‘సెంట్రల్‌ ఏసియాలోని ‘క్రౌన్‌ ‌జువెల్‌’ ‌దేశం ఉజ్బెకిస్థాన్‌ ‌కాపిటల్‌ ‘‌తాష్కంట్‌’ ‌చేరుతుంది. ఈ దేశంలోని ‘సమర?ండ్‌’, ‘‌భుకారా’, ‘కివా’లను పరిచయం చేయనుంది. బస్సు ప్రయాణంలో తరువాత కజకిస్థాన్‌ ‌దాటుతూ రష్యాలోకి అడుగిడుతుంది. రష్యాలోని ‘అస్ట్రఖాన్‌’, ‘‌మాస్కో’ నగరాన్ని చూసే భాగ్యం కలుగుతుంది. ఈ ప్రయాణానికి 22 రోజుల సమయం తీసుకుంటుంది.

భాగం-4 యూరప్‌ (‌లాట్వియా, లితువానియా, పోలాండ్‌, ‌చెక్‌ ‌రిపబ్లిక్‌, ‌జర్మనీ, నెథర్లాండ్‌, ‌బెల్జియమ్‌, ‌ఫ్రాన్స్, ‌యూకె – 15 రాత్రులు, 16 రోజులు):
రష్యా దాటిన బస్సు ప్రయాణం యూరోప్‌లోకి ప్రవేశించి లాట్వియా, లితువానియా దేశాల అందాలను చూపుతుంది. లితువానియాలోని యునెస్కో గుర్తింపు పొందిన ‘బరోక్యూ పురాతన నగరం’ చూసే అవకాశం కలుగుతుంది. యూరప్‌లోని పోలాండ్‌ ‌రాజధాని ‘వార్షా’, చెక్‌ ‌రిపబ్లిక్‌ ‌రాజధాని ‘ప్రాగ్‌’, ‌జర్మనీలోని ‘ఫ్రాంక్‌ఫర్ట్’‌ను తాకుతూ, నెథర్లాండ్‌, ‌బెల్జియమ్‌, ‌ఫ్రాన్స్ ‌గుండా గమ్యస్థానం లండన్‌కు చేరుతుంది. ఈ చివరి భాగానికి 16 రోజుల సమయం పడుతుంది.

1957లో చారిత్రక ‘కోల్‌కతా టు టు లండన్‌’ ‌బస్సు యాత్ర:
15 ఏప్రిల్‌ 1957‌న లండన్‌ ‌నుంచి ప్రారంభమైన ‘ఇండియామాన్‌’ ‌పేరుతో జరిగిన చారిత్రక బస్సు ప్రయాణం జూన్‌ 05, 1957‌న కలకత్తా చేరడం జరిగింది. ఇదే బస్సు తిరిగి ‘కలకత్తా టు లండన్‌’ ‌ప్రయాణం 02 ఆగష్టు 1957న ముగిసింది. నాటి ప్రయాణీకులు సింగిల్‌ ‌జర్నీకి చేసిన ఖర్చు 85 ఫౌండ్లుగా ఉండేది. లండన్‌లో ప్రారంభమైన ఈ ‘మాజిక్‌ ‌బస్‌’ ‌ప్రయాణంలో ఫ్రాన్స్, ఇటలీ, యుగెస్లావియా, బర్గేరియా, టర్కీ, ఇరాన్‌, ‌పాకిస్థాన్‌ల గుండా కలకత్తా చేరింది. ఇలాంటి చారిత్రక అంతర్జాతీయ బస్సు ప్రయాణం యాత్రికులకు ‘లైఫ్‌ ‌చేంజింగ్‌ ‌జర్నీ’ అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఆసక్తి, వనరులు కలిగిన దేశ పౌరులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, అపూర్వ అనుభూతులను స్వంతం చేసుకోవచ్చు.

burra-madhusudhan-reddy
– డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ కళాశాల
కరీంనగరం – 9949700037

Leave a Reply