అది కడలిగా
వుప్పొంగినప్పుడు
జనజీవనతీరం
చైతన్యపుటలలతో
జాగృతమవుతుంటుంది…
అది కుసుమంగా
విప్పారినప్పుడు
మనసు పొరల్లో
సౌభ్రాతృత్వం
పరిమళిస్తుంటుంది…
అది దీపమై
ప్రజ్వరిల్లినప్పుడు
అజ్ఞానపుతిమిరంలో
ఆదర్శాల కిరణాలు
ఆవిష్కృతమవుతుంటాయి…
అది ఆమనియై
ఆవహించినప్పుడు
బ్రతుకుచెట్టు
ఆశయాల చిగుళ్లతో
దరహసిస్తుంటుంది…
తరతరాల
నాగరికతల వైభవాలను
మోసుకుంటూ
అది నదియై
మనమధ్య
ప్రవహిస్తూనే వుంటుంది…
మన ఆత్మీయతలకూ,
ఉద్వేగాలకూ
అది రెక్కలు
తొడుగుతూనే వుంటుంది…
మనలోని
కల్మషాల కాలుష్యాన్ని
అది జలపాత ఝరియై
కడుగుతూనే వుంటుంది…
– డాక్టర్ కొత్వాలు అమరేంద్ర
తిరుపతి (ఆ.ప్ర).
( సెల్: 9177732414 )