Take a fresh look at your lifestyle.

ఊబకాయం నిర్మూలనకై ఉద్యమిద్దాం

‘తిండి కలిగితే కండ కలదోయ్‌…  ‌కండ కలవాడేను మనిషోయ్‌… ‘ అన్న గురజాడ  మాటలు మనందరికీ సుపరిచితమే. మరి తిన్న తిండిని కండగా మార్చి మన ఆరోగ్యానికి అండగా నిలబడే మన జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయకపోతే ఎదురయ్యే అనర్ధాలు అన్నీ ఇన్నీ కావు. అమెరికాలోని విస్కాన్సిన్‌ ‌రాష్ట్ర నగరం మిల్వాకీ కేంద్రంగా పని చేస్తున్న ప్రపంచ గ్యాస్ట్రో ఎంటరాలజీ సంస్థ (డబ్ల్యు.జి.ఓ)  యొక్క 45 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినోత్సవం (వరల్డ్ ‌డైజెస్టివ్‌ ‌హెల్త్ ‌డే) ప్రతీ ఏడాదీ మే నెల 29 నాడు జరుపుకోవాలని 2004 సంవత్సరంలో ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 100 కు పైగా సొసైటీలు మరియు 50,000 లకు పైగా వ్యక్తులు సభ్యులుగా ఉన్నట్లు సమాచారం. మన దేశానికి చెందిన ‘ఇండియన్‌ ‌సొసైటీ ఆఫ్‌ ‌గ్యాస్ట్రో ఎంటరాలజీ’ అనే సంస్థ డబ్ల్యు.జి.ఓ లో సభ్యత్వం కలిగి ఉంది. ఈ సందర్భంగా ‘ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినోత్సవం’ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం.

ప్రతీ ఏటా మే నెల 29 నాడు ప్రపంచ గ్యాస్ట్రో ఎంటరాలజీ సంస్థ ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది మరియు ప్రతీ సంవత్సరం ఏదో ఒక నిర్దిష్ట జీర్ణ సంబంధిత వ్యాధి లేదా రుగ్మతకు సంబంధించిన నివారణ, చికిత్స తదితర అంశాలపై ఆ సంవత్సరమంతా సాధారణ ప్రజలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆ సంస్థ సభ్యుల ద్వారా వివిధ అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నది. 2021 సంవత్సరానికి సంబంధించిన ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినోత్సవాన్ని ‘‘ఒబేసిటీ : ఏన్‌ ఆన్‌ ‌గోయింగ్‌ ‌పాండెమిక్‌’’ (‌స్థూలకాయం : కొనసాగుతున్న ఒక మహమ్మారి) అనే ఇతివృత్తం ఆధారంగా ఇంటర్నేషనల్‌ ‌ఫెడరేషన్‌ ‌ఫర్‌ ‌ద సర్జరీ ఆఫ్‌ ఒబేసిటీ అండ్‌ ‌మెటబాలిక్‌ ‌డిజార్డర్స్ (ఐ.ఎఫ్‌.ఎస్‌.ఓ) అనే సంస్థ భాగస్వామ్యంతో వివిధ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఊబకాయం (ఒబేసిటీ), దాని వల్ల అనివార్యంగా ఎదురయ్యే సహరుగ్మతలు మరియు పర్యవసానంగా వ్యక్తుల ఆయుర్దాయంపై  మహమ్మారిని తలపించే దుష్ప్రభావం మొదలైన విషయాలపై డబ్ల్యు.జి.ఓ మరియు ఐ.ఎఫ్‌.ఎస్‌.ఓ ‌సంస్థల సభ్య దేశాల్లో సరైన అవగాహన పెంచే ధ్యేయంతో పలు కార్యక్రమాలను అంతర్జాల మాధ్యమం ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఊబకాయానికి సంబంధించిన విషయ పరిజ్ఞానం మరియు దాన్ని ఇతరులతో పంచుకోవాలనుకొనే ఆసక్తి కలిగిన వ్యక్తుల, సంస్థల భాగస్వామ్యాన్ని కూడా ఆహ్వానిస్తున్న విషయం అభినందించదగినది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం బాడీ మాస్‌ ఇం‌డెక్స్ (‌బి.ఎమ్‌.ఐ) 25 ‌నుండి 30 లోపు ఉంటే అధిక బరువు కలిగి యున్న వారు గానూ మరియు 30 గానీ అంతకు మించి గానీ బి.ఎమ్‌.ఐ ఉం‌టే ఊబకాయం లేదా స్థూలకాయం కలిగిన వారి గానూ వర్గీకరణ చేస్తారు. ఒక వ్యక్తి యొక్క బరువును (కిలోగ్రాముల్లో) ఆ వ్యక్తి ఎత్తు (మీటర్లలో) వర్గంతో భాగిస్తే వచ్చే విలువను బాడీ మాస్‌ ఇం‌డెక్స్ అని పేర్కొంటారు. ఉదాహరణకు 75 కేజీల బరువు మరియు 1.5 మీటర్ల ఎత్తున్న వ్యక్తి యొక్క బాడీ మాస్‌ ఇం‌డెక్స్ 33 (75 ‌ను 2.25 చే భావించిన వచ్చే విలువ) గా అనగా ఆ వ్యక్తి ఊబకాయం సమస్యతో బాధపడుతున్న వ్యక్తిగా అర్ధం చేసుకోవచ్చు. పై ఉదాహరణ ద్వారా ప్రతీ వ్యక్తి కూడా తన బి.ఎమ్‌.ఐ ‌విలువ ఎంతో సులభంగా తెలుసుకోవచ్చు మరియు తగిన జాగ్రత్తలు పాటించవచ్చు.

జీవన శైలిలో వచ్చే మార్పులు మరియు జన్యు పరంగా కూడా ఈ స్థూలకాయం సమస్య  ఉత్పన్నమౌతున్నట్లుగా తెలుస్తున్నది. శారీరక శ్రమ లేకపోవడం, పోషకాలు లేని ఆహారం మరియు ఆధునిక జీవన విధానం మొదలైన కారణాల వల్ల సమాజంలో నేడు ఈ ఊబకాయం సమస్య ఒక మహమ్మారిలా మారి ఎందరినో అనారోగ్యం పాలు చేయడం మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. స్థూలకాయం బారిన పడిన వారిలో అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్‌ ‌మరియు ట్రైగ్లిసరైడ్స్ అధిక మోతాదులో ఉండటం, టైప్‌ 2 ‌మధుమేహం, గుండె పోటు, హృదయ సంబంధిత వ్యాధులు, ఎన్నో రకాల క్యాన్సర్లు, మానసిక ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్‌ ‌మొదలైన సమస్యలు మరియు తీవ్రమైన సందర్భాల్లో  మృత్యువు కూడా సంభవించే ప్రమాదం పొంచి ఉండటం గమనార్హం.

ప్రపంచ ఆరోగ్య సంస్ధ వద్ద నున్న సమాచారం ప్రకారం 2016 సంవత్సరం నాటికి 1.9 బిలియన్లకు పైగా ప్రపంచంలోని 18 సంవత్సరాల కన్నా ఎక్కువ వయస్సు కలిగిన వయోజనులు అధిక బరువు సమస్యతో , అందులో దాదాపు 650 మిలియన్లకు పైగా స్థూలకాయం సమస్యతో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా 5-18 సంవత్సరాల వయస్సు కలిగిన వారిలో 340 మిలియన్లకు పైగా మరియు 5 సంవత్సరాల లోపు దాదాపు 38 మిలియన్ల మంది పిల్లలు అధిక బరువు లేదా ఊబకాయం సమస్యతో బాధపడుతున్న వారేననీ తెలియవచ్చుచున్నది. భారత దేశంలో వయస్సు, లింగం, భౌగోళిక పరిస్థితులు మరియు సామాజిక -ఆర్ధిక స్థితిని బట్టి అధిక బరువు లేదా స్థూలకాయం సమస్యతో బాధపడే వారు మొత్తం జనాభాలో 12 శాతం నుండి 31 శాతం వరకూ ఉండొచ్చని అంచనా.

నేడు కరోనా మహమ్మారికి బలవుతున్న వారిలో ఊబకాయులు కూడా ముందు వరుసలో నున్న విషయం విస్మరించరానిది. ఏది ఏమయినా ఇప్పుడిప్పుడే మన దేశంలో కూడా వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకొని, ఆరోగ్య కరమైన జీవన శైలిని అలవాటు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న విషయం ఒక శుభ పరిణామమే. కనుక మనమంతా వ్యక్తిగతంగా మన ఆరోగ్య సంరక్షణకై అత్యంత శ్రద్ధ తీసుకుని, ఊబకాయం లేదా స్థూలకాయం మరియు దాని వల్ల కలిగే సహ రుగ్మతలను నివారించడానికి నిరంతరం కృషి చేయాలని ఈ ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినోత్సవం (వరల్డ్ ‌డైజెస్టివ్‌ ‌హెల్త్ ‌డే) సందర్భంగా ఆశిద్దాం.
– మోహన్‌ ‌లింగబట్టుల, 9398522294

Leave a Reply