Take a fresh look at your lifestyle.

గ్రేటర్‌లో ఘాటైన ప్రచారం..ఆలోచించి ఓటేద్దాం

“భావోద్వేగాలు, విద్వేషాలు, అమలుకు నోచుకోని హామీలు ఓటరు విచక్షణకు పరీక్షగా మారాయి. పార్టీ(నాయకు)లు ప్రజాస్వామ్యానికి, నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వడమేమిటని హైదరాబాద్‌ ఓటరు వాపోతున్నాడు. ఇదే సమయంలో గుజరాత్‌లో ఎనభయవ అఖిల భారత స్పీకర్ల సదస్సులో ప్రజాస్వామ్య విలువలు, ప్రజా ప్రతినిధుల ప్రవర్తనపై ఉపదేశాలు ఒక వైపు చేస్తూనే ఆ పార్టీ నాయకులు ఎన్నికల వేళ ఎన్నికల సంఘ నియమావళిని ఉల్లంఘిస్తూ భావోద్వేగాలతో విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రసంగాలు చేస్తున్న తీరును ఎలా చూడాలి. కోడ్‌ ఉల్లంఘన ప్రజా కలాలకు, గళాలకేనా! పార్టీ(నాయకు)లకు వర్తించవా!.”

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ‌నగరపాలక సంస్థ స్థానిక ఎన్నికల వేళ పార్టీలన్నీ భాగ్యనగరాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ అభివృద్ధి చేస్తామని ఓటరును ప్రభావితం చేస్తూ ఓటును వారి ఖాతాలో వేసుకోవడానికి పడరాని పాట్లే పడుతున్నారు. హామీల జడివానలో నగరం తడిసి ముద్దవుతుంది. ఈ పార్టీ, ఆ పార్టీ అనే తేడా లేదు. నగరపాలక సంస్థ ఆదాయంతో సంబంధమే లేదు. అధికారం చేజిక్కించుకోవడమే పరమావధిగా ఎన్నికల కదన కుతూహలాన్ని చాటుతున్న తీరు చూస్తుంటే ఓటరుపై ప్రేమ కన్నా అధికార యావేనని అనుభవాలు తెలుపుతున్నాయి. ఈ ప్రచార హోరులో గల్లీ లీడర్ల నుండి ఢిల్లీ పెద్ద లీడర్ల వరకు ఎవరికి తోచిన విధంగా వారు వారివారి పార్టీల నాయకులకు చేయూతనిస్తున్నారు. ఈ తీరును చూస్తుంటే.. సాధారణ ఎన్నికల పోరును మరిపిస్తుంది. గత కొద్ది రోజుల క్రితం అభాగ్య నగరమై వరదలు, బురదలతో నీట మునిగిన వేళ ఈ పార్టీలకు, నాయకులకు హైదరాబాద్‌ ‌ప్రజలు ఓటర్లే అని గుర్తు లేదా లేక మరిచిపోయినారా! విధానాలు చర్చకు రానివ్వకుండా విద్వేషాలు, భావోద్వేగాలు సృష్టించడమేమిటని తమలో తాము మదనపడుచున్నారు. నేడేమో ఓటు బ్యాంకు రాజకీయాలతో హైదరాబాద్‌ ‌నగరం మునిగిపోతుంది.

ఈ పల్లకి సేవలు, హామీల మోతలు మేమెరుగనివా! ‘‘ఏరు దాటాక తెప్ప తగలేసిన గతాలు ఓటరు మరిచేలా నయా ప్రలోభాలకు తెర లేపుతున్నారు. ఈ ప్రలోభాలు ఈనాటివి కావు. అన్ని పార్టీ(నాయకు)లు ఆ తాను ముక్కలే, అందరివి ఎర్ర గురిగింజ నీతులే. భావోద్వేగాలు, విద్వేషాలు, అమలుకు నోచుకోని హామీలు ఓటరు విచక్షణకు పరీక్షగా మారాయి. పార్టీ(నాయకు)లు ప్రజాస్వామ్యానికి, నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వడమేమిటని హైదరాబాద్‌ ఓటరు వాపోతున్నాడు. ఇదే సమయంలో గుజరాత్‌లో ఎనభయవ అఖిల భారత స్పీకర్ల సదస్సులో ప్రజాస్వామ్య విలువలు, ప్రజా ప్రతినిధుల ప్రవర్తనపై ఉపదేశాలు ఒక వైపు చేస్తూనే ఆ పార్టీ నాయకులు ఎన్నికల వేళ ఎన్నికల సంఘ నియమావళిని ఉల్లంఘిస్తూ భావోద్వేగాలతో విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రసంగాలు చేస్తున్న తీరును ఎలా చూడాలి. కోడ్‌ ఉల్లంఘన ప్రజా కలాలకు, గళాలకేనా! పార్టీ(నాయకు)లకు వర్తించవా! ఇందుకు తాజా పరిస్థితులే నిదర్శనం. ఒక వైపు రాజ్యాంగ ఆమోద దినోత్సవం నవంబర్‌ 26‌న జరుపుకుంటూనే రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలివ్వడం భావ్యమా! ప్రజా ప్రతినిధుల భాష హుందాగా ఉండాలి.

ప్రజా ప్రతినిధులు క్రమశిక్షణతో మెలగాలని వారెన్నుకున్న ప్రజలు ఆశిస్తారని మరిచిపోయి ఒకరిపై ఒకరు రాజకీయంగా బురద చల్లుకునేలా మాట్లాడడం ఏ విలువలకు కట్టుబడ్డట్లు భావించాలి. హైదరాబాద్‌ ‌నగరపాలక ఎన్నికల్లో పార్టీ(నాయకు)ల ప్రచార సమయంలో సంయమనం కోల్పోతున్నప్పటికి ఓటరు మాత్రం బాధ్యతతో తన ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తున్నాడు. దీని ద్వారా అధికారం చేపట్టిన వారు ఓటర్ల సమస్యలను, ఓటరును మరిచిపోతున్న దరిమిలా ఓటు, వేసిన ఓటరు ఓడిపోతున్నాడు. సమస్యల వలయంలో మళ్లీ ఐదేళ్లు గిలగిలా కొట్టుకుచస్తున్నాడు. పార్టీ(నాయకు)లకు మాత్రం ఇది దండిగా పండుగే. మళ్లీ ఓట్ల పండుగ నాడు ఇదే తంతు కొనసాగిస్తున్నారు. ‘‘ఓటరుది గంతలు కట్టిన గానుగెద్దు బతుకు’’గా మారిందని ఓటరు ఆవేదన చెందుతున్నాడు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఏడు దశాబ్దాల ప్రాయంలో చేరినప్పటికి పార్టీ(నాయకు)లు మారకపోయిరి.

ఓటరు మహాశయుడినే పాలకులు ఆరాధ్యుడిగా భావించి అభివృద్ధి వైపు పాలన సాగాలి. మైండ్‌ ‌గేమ్‌ ‌రాజకీయాలతో ఎన్నాళ్ళో ఓటరును వంచించి అధికారాన్ని చేపట్టలేరని గమనించండి. నేడు జరుగుచున్న హైదరాబాద్‌ ‌నగరపాలక ఎన్నికల ప్రచారం ఘాటెక్కి పరిధులు దాటుతున్న వేళ ఓటరు విచక్షణతో తన బాధ్యతను డా.అంబేడ్కర్‌ ‌కల్పించిన ఓటును పార్టీలకతీతంగా సరైన తమకు సేవ చేసే అభ్యర్థిని ధన, మద్య, కండ బల ప్రదర్శనలకు లొంగిపోకుండా ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. హైదరాబాద్‌ ఓటరు తమ విలువైన ఓటును క్యూ లైన్‌లో నిలబడి ఓటింగ్‌ ‌శాతాన్ని పెంచి ప్రజాస్వామ్యానికి ప్రాణం పోయాలి. గతం నుండి మోస్తున్నఅప్రతిష్టను అధిగమించాలి. పాలకులెప్పుడు ఓటరుకు ఐదేళ్లకొకసారి ఎన్నుకున్న సేవకు(పాలేరు)లే, సుపీరియర్లు అంతకన్నా కాదని గ్రహించండి. ఓటు.. నేత(పార్టీ)ను నిలబెడుతుంది, గెలిపిస్తుంది, పగబడుతుంది, పడగొడుతుంది. కాదు కూడదంటే ఓటరు నోటా వైపు మళ్లుతాడు.. జాగ్రత్త.
– మేదాజీ

Leave a Reply