Take a fresh look at your lifestyle.

ఆకలిని అదృశ్యం చేద్దాము

“ఇటీవల నేషనల్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లయిడ్‌ ఎకనామిక్‌ ‌రీసెర్చ్ ‌నిర్వహించిన టెలిఫోన్‌ ‌సర్వే ప్రకారం 84 శాతం ప్రజలు తమకు ఆదాయాన్ని సమకూర్చే ఉపాధిని కోల్పోయారు. 40 శాతం ప్రజలు ఆహార, ఔషధాల కొరతతో బాధ పడుతున్నారని సమాచారాన్ని తెలియజేసింది. వరల్డ్ ‌ఫుడ్‌ ‌పోగ్రాం డైరెక్టర్‌ ‌డేవిడ్‌ ‌బేస్లీ ఒక నివేదికను విడుదల చేస్తూ కరోనా విలయం ఇలానే కొనసాగితే రాబోయే మూడు నెలల్లో రోజుకు 3 లక్షల చొప్పున మూడు కోట్ల పేదలు ఆకలి మహమ్మారికి బలి అవుతారని ప్రస్తావించాడు.”

అదృశ్యం చేద్దాముప్రపంచమంతా అకస్మాత్తుగా విస్ఫోటనం చెందిన కరోనా మహమ్మారితో అనేక కుదుపులకు లోనయింది. ఈ విపత్తు ప్రజలపై చూపుతున్న సామాజిక ఆర్థిక మానసిక ప్రభావం అత్యంత వేదనకు గురి చేస్తున్నది. ఎలాంటి వివక్షతలు పాటించకుండా అన్ని వర్గాల ప్రజలను బీభత్సానికి గురి చేస్తున్నది. ప్రధానంగా సంపద సృష్టికర్తలుగా పరిగణించే ఆదాయంలో అత్యంత దిగువన ఉండే సామాజిక వర్గాల మహిళలు, పిల్లలు మరియు ఆరోగ్య కార్యకర్తల మీద విపత్తు నివారణ పడి విలవిలలాడుతున్నారు. 1918లో విజృంభించిన స్పానిష్‌ ‌ఫ్లూలో అలాగే వరదలు తుఫానులు సునామీలు యుద్ధాలు సంభవించినప్పుడు భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నది కష్టాలను అనుభవిస్తున్నది కష్టజీవుల వర్గమే. కరోనా మహమ్మారి సంక్రమణ కాలంలో కూడా జీవనోపాధి కోల్పోతున్న వర్గాల ప్రజలు, పిల్లలు, అలాగే ఆరోగ్య కార్యకర్తలు ఎక్కువగా నష్టపోయే సమూహాలుగా కనిపిస్తున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ఆరోగ్య కార్యకర్తలలో 70 శాతం నర్సులలో 80 శాతం మహిళలు ఉన్నారని తెలియజేసింది. భారత్‌లో 10 లక్షల ఆశా కార్యకర్తలు ప్రజారోగ్య వ్యవస్థలో భాగస్వాములై పనిచేస్తున్నారు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నా వీరికి ప్రజలలో ఉండే అజ్ఞానం, మూఢత్వం, కళంకిత భావనల కారణంగా భౌతిక దాడులకు లోనవుతున్నారు. మహమ్మారి నుండి మనల్ని రక్షించే రక్షకులకే రక్షణ కరువవుతున్నది. భార్యాభర్తలు పనిచేసుకునే దిగువ మధ్యమ తరగతి వర్గాల ప్రజలు ఇప్పుడు ఇంటి నుండే పని చేసుకుంటున్నారు. తరతరాలుగా వ్యవస్థీకృతమైన సాంప్రదాయంలో స్త్రీలు ఆదాయం కోసం శ్రమిస్తూ ఆదనంగా గృహ సంబంధ పనులు చేసే బాధ్యతను కొనసాగిస్తున్నారు. ఉద్యోగ భద్రత, జీవన ఉపాధి కోల్పోతామనే ఆలోచనలతో వారి మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతున్నది. అసంఘటిత రంగంలో తక్కువ ఆదాయంతో జీవనాన్ని నడుపుతున్న మగవారిలో ఈ మాత్రం ఉపాధిని కోల్పోతున్నామనే ఆందోళన నిర్వేద నైరాశ్యంలో, సమస్త నిర్మాణ రంగం స్థంభించి పోవడంతో ఉపాధి పూర్తిగా పోయిన దినసరి శ్రామికులలో కలుగుతున్న అలజడి కారణంగా మహిళలపై హింస, దాడులు వేగంగా పెరుగుతున్నాయి. వైన్‌ ‌షాపులు బంద్‌ ‌కావడంతో దానికి అలవాటయిన వారిలో కలిగే వ్యసనం చిరాకు ఒత్తిడిలతో హింసా ప్రవృత్తి పెరిగి స్త్రీలపై భౌతిక, మానసిక దాడులు జరుగుతున్నవి. ఇటీవల జాతీయ మహిళా కమిషన్‌ ‌కరోనా ముందు కాలం కంటే కరోనా కాలంలో గృహ హింస ఫిర్యాదులు అనూహ్య స్థాయిలో అందుతున్నాయని పేర్కొంది. ఏప్రిల్‌ ‌మొదటి వారంలో ఒక ఢిల్లీ నగరంలోనే ఐదు వందల ఫిర్యాదులు అందాయని చెప్పింది. లండన్‌లో ఐదువేల గృహ హింస కేసులు నమోదయ్యాయని నగర మేయర్‌ ‌ప్రకటించాడు. ఇవే ధోరణులు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నాయి.

మహిళలు ఈ రకమైన ఒత్తిడికి లోనైనప్పుడు శారీరక మానసిక ఆరోగ్యాన్ని నియంత్రించే రసాయనిక రాయబారులుగా పని చేసే హార్మోనుల విడుదలలో అపసవ్యతలు సంభవిస్తాయి. పునరుత్పత్తి సామర్థ్యం వయస్సు కలిగి ఉన్న మహిళల్లో రుతుస్రావ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇప్పటికీ అనేక భారతీయ కుటుంబాలలో మహిళలు రుతుస్రావం, ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. వారు ఒక నిశ్శబ్ద సంస్కృతికి అలవాటు పడి ఉన్నారు. లాక్‌ ‌డౌన్‌ ‌కొనసాగుతున్న ఈ సమయంలో ఆస్పత్రులను వెళ్లి చూపించుకోవడం ఒక సమస్య గానే ఉన్నది. రవాణా సౌకర్యం లేకపోవడం ఆంక్షలు, నగదు లేమితో సానిటరీ నాప్కిన్స్ అం‌దుబాటులో లేకపోవడం వారి ఆరోగ్యసమస్యలను మరింత తీవ్రం చేస్తున్నాయి. మరొక ఒక ప్రధాన అంశం ఏమిటంటే గర్భిణీ స్త్రీలకు, ఐదు సంవత్సరాల లోపు బాలలకు పోషక ఆహారం అందించడం అత్యవసరం పిల్లల యొక్క భౌతిక శారీరక వికాసానికి కావలసిన నిర్మాణం పునాదులు ఈ దశలోనే ఏర్పడతాయి. ఈ దశలోలో సరైన పోషకాహారం అందకపోతే దాని ప్రభావం విద్య అభ్యసన సామర్థ్యాలపై, నైపుణ్య కౌశలాలు నేర్చుకోవడంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అంతేకాదు వారిలో వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. ప్రపంచ విపత్తుల చరిత్రను పరిశీలించినట్లయితే మరణించిన ప్రజలలో 90 శాతం వీటి కొరతతో బాధపడిన కష్టజీవుల జనమే ఉన్నారు. సృజనాత్మక సమాజ నిర్మాణంలో 15 నుండి 49 సంవత్సరాల వయసు గల యువ సంపద కీలకం. విపత్తులో పోషకాల లేమితో ఎదిగే యువత భవిష్యత్‌ ‌నిర్మాణంలో ప్రభావవంతంగా పాల్గొనలేదు. లాక్‌ ‌డౌన్‌లో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు మూత పడటంతో పోషకాలతో కూడిన భోజనం అందకుండా పొయింది. ఇటీవల నేషనల్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లయిడ్‌ ఎకనామిక్‌ ‌రీసెర్చ్ ‌నిర్వహించిన టెలిఫోన్‌ ‌సర్వే ప్రకారం 84 శాతం ప్రజలు తమకు ఆదాయాన్ని సమకూర్చే ఉపాధిని కోల్పోయారు. 40 శాతం ప్రజలు ఆహార, ఔషధాల కొరతతో బాధ పడుతున్నారని సమాచారాన్ని తెలియజేసింది. వరల్డ్ ‌ఫుడ్‌ ‌పోగ్రాం డైరెక్టర్‌ ‌డేవిడ్‌ ‌బేస్లీ ఒక నివేదికను విడుదల చేస్తూ కరోనా విలయం ఇలానే కొనసాగితే రాబోయే మూడు నెలల్లో రోజుకు 3 లక్షల చొప్పున మూడు కోట్ల పేదలు ఆకలి మహమ్మారికి బలి అవుతారని ప్రస్తావించాడు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కష్టజీవులకు, నిరుపేదలకు ఎలాంటి ఆసరా లేని వారికి ఉపశమనము కలిగించే చర్యలు తీసుకుంటున్నాయి. వృద్ధులకు, రైతులకు, వితంతువులకు, నిర్మాణ రంగ కార్మికులకు, ఆహార దినుసుల పంపిణీ, నగదు బదిలిని చేస్తున్నాయి. పంపిణీ వ్యవస్థలో సమన్వయం లేక ఈ విభాగంలో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండడం వలన ఆయా వర్గాలకు పాక్షికంగానే ఉపశమన సహాయక చర్యలు చర్యలు అందుతున్నాయని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఆహార ధాన్యాలు గిడ్డంగులలో భారీ మోతాదులలో నిల్వ ఉన్నాయి. బాధిత వర్గ ప్రజలకు పంపిణీ చేయడానికి లక్షల సంఖ్యలో ఉన్న ప్రభుత్వ, ప్రవేట్‌ ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకోవాలి. ఐరోపా, అమెరికా, మన తోటి ఆసియా దేశాలతో పోల్చుకుంటే వ్యాధి సంక్రమణ తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ అది భారత్‌లో కలిగిస్తున్న మానవ జీవన సంక్షోభం, ఆర్థిక వ్యవస్థ పతనం హృదయ విదారకంగా ఉన్నది. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ సానిటైజర్‌ల ఉత్పత్తికి తోడ్పడే ఇథనాల్‌ ‌తయారీకి ఆహారధాన్యాలను ఉపయోగించుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆకలి మరణమృదంగం మోగుతున్న వేళలో ఇది ఏమాత్రం వాంఛనీయం కాదు. తక్షణమే ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి. యుద్ధ ప్రాతిపదికగా స్పందించి చర్యలను తీసుకోవలసిన మరొక మానవీయ అంశము ఏమిటంటే వలసజీవులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన తాత్కాలిక సెంటర్లలో ఉండటానికి ఇష్టపడటం లేదు. చాలినంత సౌకర్యాల కొరత, సుదూర ప్రాంతంలో ఉన్న తమ ఇతర కుటుంబ సభ్యులపై ఉన్న బెంగ కారణంగా షెల్టర్‌లను వీడి రహదారుల వెంట, రైలు పట్టాల వెంట తమ స్వగ్రామాలకు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ పౌరులను సురక్షితమైన పద్ధతులలో రప్పించుకునే ప్రయత్నం చేయాలి. ఆరోగ్య రంగంలో మహిళా ఉద్యోగులను, గృహహింస బాధిత మహిళలను రక్షించుకోవడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. స్వచ్ఛంద సంస్థలను, సామాజిక కార్యకర్తలను, సైకాలజీ విద్యార్థుల సేవలను పెద్ద మొత్తంలో ఉపయోగించు కోవాలి. సామాజిక ఆహార భద్రతలో అలసత్వం వీడకపోతే, యుద్ధకాంక్షలను, ఆయుధ పోటీలను శాశ్వతంగా వదిలి అప్రమత్తతతో ప నిచేయకపోతే తరతరాలుగా శారీరక కష్టంతో మేథో మధనంతో రూపు దిద్దుకున్న నాగరికత సౌధాలకి మానవ పెట్టుబడికి పెను ప్రమాద ఘంటికలు మ్రోగ డానికి ఎంతోకాలం పట్టదు.

asnala srinivas
అస్నాల శ్రీనివాస్‌,
‌తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం
9652275560

Leave a Reply