Take a fresh look at your lifestyle.

అన్నదాతకు అండగా నిలువాలి

“పొలం దున్ని విత్తనాలు వేయడం దగ్గర నుండి పంట చేతికొచ్చే వరకు రైతులు, రైతు కూలీలు ఎంతో కష్టపడితే గాని ఆహార పదార్థాలు ఇంటికి రావు. రైతు ప్రతి ఏటా అనేక కష్టనష్టాలను ఓర్చుకొంటూ దేవుడిపై భారం వేసి నాలుగు నెలల కాలంలో దుక్కి దున్నడం, విత్తనాలు వేయడం, కలుపు తీయడం, ఎరువుల వేయడం, పురుగుల మందులు చల్లడం, పంట కోయడం వంటి అనేక పనులతో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ ఆరుగాలం అహర్నిశలు శ్రమిస్తూ పంటను కంటికి రెప్పలా కాపాడుతూ పంట తీస్తాడు. ఇంత చేశాక కూడా పంటకు సరియైన గిట్టుబాటు ధరలేక రైతు అప్పుల పాలు అవుతున్నాడు. కాబట్టి రైతు ఎప్పుడు పేదవాడిగానే ఉంటున్నాడు.”

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చింది. అవి ఉత్పత్తి వాణిజ్యం మరియు వ్యాపార చట్టం, రైతుల ధర హామీ మరియు వ్యవసాయ సేవల చట్టం, నిత్యావసర సరుకుల సవరణ చట్టం. అయితే ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో గత ఇరవై నాలుగు రోజులుగా రైతులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ చట్టాలు వర్తకులకు, బహుళజాతి కంపెనీలకు మేలు చేకూర్చే విధంగా ఉన్నాయని రైతులు అంటున్నారు. సన్నకారు రైతులను తీవ్ర కష్టాల్లోకి నెట్టే అవకాశం ఉందని రైతు సంఘాలతో పాటు కొన్ని విపక్షాలు కూడా పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం నూతన వ్యవసాయ చట్టాల వలన రైతులకు లాభం చేకూరుతుందని, దళారీ వ్యవస్థ తొలిగిపోతుందని అంటున్నది. రైతులకు, ప్రభుత్వానికి మధ్య పలుదఫాలు చర్చలు జరిగిన ఫలితం లేకుండా పోయింది. వ్యవసాయ చట్టాల అమలు వల్ల కలిగే ఇబ్బందుల గురించి, అందులోని లోపాల గురించి, ప్రభుత్వం రైతులతో, వ్యవసాయ రంగ నిపుణులతో విస్తృతంగా చర్చించి రైతులకు మేలు కలిగించే నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఆహారం లేకుంటే ఏ ప్రాణీ బతుకదు. ఒక్క రోజు ఆహారం లేకుంటే మనం తల్లడిల్లుతం. పిడికెడు మెతుకులు కోసం పడరాని పాట్లు పడేవాళ్లేందురో ఉన్నారు. మనం తినే ఆహారం వెనుక ఎంతో మంది శ్రమశక్తి ఉంది. అందులో వ్యవసాయదారుల, వ్యవసాయ కూలీల, శ్రామికుల కృషే అధికం. అన్నం, కూరగాయలు, పండ్లు వంటివి చెమటోడ్చి పనిచేసిన రైతుల కృషి ఫలం. ఎండనక, వాననక, రేయింబవళ్లు రెక్కలు ముక్కలు చేసుకొని రైతు శ్రమిస్తేనే మనం హాయిగా తినగలుగుతున్నాం. రైతు తాను పస్తులుండి సమాజానికి తిండి పెడుతున్నాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అంటే అన్నం దేవుడన్నట్టు. కడుపునిండా అన్నం పెట్టే రైతు అంతకన్నా గొప్పవాడు. మరీ అలాంటి అన్నాన్ని తినడానికి కారకుడైన రైతు కూడా మనకు తిండి పెట్టే నిజమైన దేవుడని చెప్పవచ్చు. భూమాతను నమ్ముకొని జీవించేవాడు రైతు. అందుకనే మనం మొదటి ముద్దను తినేటప్పుడు రైతును తల్చుకోవాలి.

పొలం దున్ని విత్తనాలు వేయడం దగ్గర నుండి పంట చేతికొచ్చే వరకు రైతులు, రైతు కూలీలు ఎంతో కష్టపడితే గాని ఆహార పదార్థాలు ఇంటికి రావు. రైతు ప్రతి ఏటా అనేక కష్టనష్టాలను ఓర్చుకొంటూ దేవుడిపై భారం వేసి నాలుగు నెలల కాలంలో దుక్కి దున్నడం, విత్తనాలు వేయడం, కలుపు తీయడం, ఎరువుల వేయడం, పురుగుల మందులు చల్లడం, పంట కోయడం వంటి అనేక పనులతో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ ఆరుగాలం అహర్నిశలు శ్రమిస్తూ పంటను కంటికి రెప్పలా కాపాడుతూ పంట తీస్తాడు. ఇంత చేశాక కూడా పంటకు సరియైన గిట్టుబాటు ధరలేక రైతు అప్పుల పాలు అవుతున్నాడు. కాబట్టి రైతు ఎప్పుడు పేదవాడిగానే ఉంటున్నాడు. ఒక వస్తువును తయారుచేసే ఉత్పత్తిదారుడు తన వస్తువుకు తానే ధర నిర్ణయించి మార్కెట్లో అమ్ముతాడు. కానీ రైతు పండించిన పంటకు తాను ధరను నిర్ణయించుకొనే పరిస్థితి లేదు. ఎప్పుడైతే రైతు తన పంటకు తానే ధరను నిర్ణయిస్తాడే అప్పుడు రైతు నష్టపోవడం అంటూ ఉండదు.

- Advertisement -

దేశంలో సారవంతమైన భూములు, అనుభవజ్ఞులైన రైతులు దేశంలో చాలా మంది ఉన్నారు. కానీ కొన్ని లక్షల మంది రైతులు ఏటా వ్యవసాయ రంగం నుండి వైదొలుగుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్‌ ‌లో భూమిపై రైతు అనేవాడు ఉండడు. అప్పుడు మనకు ఆహారం విలువ, రైతు విలువ తెలుస్తుంది. మనము ఆహారానికి బదులు మందు బిళ్ళలు మింగే పరిస్థితి దాపురిస్తుంది. రైతు ఒక సంవత్సరం పంట పండిచకుండా ఉంటే ధరలు ఆకాశానికి అంటి సామాన్య జనం విలవిలలాడిపోతారు. రైతు బాగుండి పంట దిగుబడులు పెరిగినపుడే సామాన్యులకు ధరలు అందుబాటులో ఉండి దేశం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెరుగాలి. వ్యవసాయ రంగానికి ఇతర రంగాలతో సమాన ప్రాధాన్యత కల్పించి పటిష్టపరచాలి. రైతుల బలవన్మరణాలకు గల కారణాలు అన్వేషించాలి. వారికి అవసరమైన చేయుతను అందించాలి. ఫలసాయం చేతికందే దశలో ప్రకృతి విపత్తుల వలన పంట నష్టపోయినట్లయితే ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరించేలా తగు చర్యలు తీసుకోవాలి. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరను కల్పించి మార్కెట్‌ ‌హెచ్చుతగ్గుల నుంచి రైతుకు రక్షణ కల్పించాలి. రైతుల ఆదాయం పెరిగే మార్గాన్ని అన్వేషించాలి. వ్యవసాయ రంగంలో ఆధునిక యంత్రాల కొనుగోలుకు తగిన ఋణసౌకర్యాన్ని సులభ పద్దతిలో లభించే విధంగా తగు చర్యలు చేపట్టాలి.

నేడు కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. యజమానులకు కిస్తీలు కట్టలేక వారు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రభుత్వ పథకాలను వీరికి కూడా వర్తింప చేయాలి. రానురాను వ్యవసాయ రంగం కుదేలైపోతున్నది. కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువుల బారినుండి రైతులను రక్షించాలి. కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలు తయారు చేసేవారిపై, అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం మంచి విత్తనాలు, ఎరువులు, సాగునీరు, విద్యుత్‌ , ‌సులభ ఋణ సౌకర్యం, గిట్టుబాటు ధర కల్పించి అన్నదాత రైతన్నను ఆదుకోవాలి. చాల మంది రైతులు వరి, పత్తి, మొక్కజొన్న లాంటి కొన్ని పంటలు పండించడానికి పరిమితమవుతున్నారు. తద్వారా ఆ ఉత్పత్తులు అధికం కావడంతో వారు పండించే పంటకొరకు పెట్టిన పెట్టుబడి డబ్బులు కూడా రావడం లేదు. కాబట్టి రైతులకు పంట మార్పిడి గురించి వ్యవసాయ అధికారుల ద్వారా అవగాహన కలిగించాలి. వాణిజ్య పంటలు కూడా వేసే విధంగా రైతులను ప్రోత్సహించాలి. ప్రతి సంవత్సరం భూసార పరీక్షలు నిర్వహించి భూమికి తగిన పంటలు సూచించినట్లయితే రైతులకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. పంట బీమా గురించి ప్రతి రైతుకు అవగాహన కలిగించి పంట నష్టపోయినపుడు తక్షణ సాయం అందేలా కృషి చేయాలి. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి అధునాతన యంత్రాలను వినియోగించడానికి కృషి చేయాలి. అధునాతన వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై అందించాలి. ధాన్యం నిలువ చేయడానికి గిడ్డంగులను, ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌యూనిట్లను తగిన సంఖ్యలో ఏర్పాటు చేయాలి. బిందు తుంపర సేద్యమును వ్యవసాయ రంగంలో ఉపయోగించి తక్కువ నీటితో పంటలు పండించే విధంగా చూడాలి. వ్యవసాయ విద్యను ప్రోత్సహిస్తూ వ్యవసాయ కళాశాలల సంఖ్యను పెంచి నాణ్యమైన విద్యను అందించాలి.

అభివృద్ధి పేరుతో వ్యవసాయ భూమిని నాశనం చేస్తూ మనిషి తనకు తానే నాశనమైపోతున్నాడనే విషయాన్ని విస్మరిస్తున్నాడు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఋణామాఫీలు, రైతుని రాజుని చేస్తాం అనే ప్రకటనలు ఆ తర్వాత రైతు కన్నీరును తుడువలేకపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగం తగినంత ఆశాజనకంగా లేకపోవడం వలన ఇప్పటికే చాలా మంది రైతులు ఉపాధి నిమిత్తం పట్టణాలకు, ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. క్షేత్ర స్థాయిలో రైతు సమస్యలను పరిష్కరించదానికి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి, వ్యవసాయ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పుల గురించి, రైతుబీమా, పంట బీమా మొదలగు వాటి గురించి తెలియజేసి రైతులు బలవన్మరణాలకు పాల్పడకుండా వారిలో ఆత్మవిశ్వాసం నెలకొల్పే విధంగా తగిన శిక్షణా తరగతులు నిర్వహించాలి. మార్కెటింగ్‌ ‌పరిధిని విస్తృత పరిచి ఉత్పత్తుల ఎగుమతులకు ప్రోత్సాహం కల్పించాలి. అధిక దిగుబడినిచ్చే నూతన వంగడాలను కనుగొనేలా వ్యవసాయ శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం కల్పించాలి. రైతు సమన్వయ సమితులు వ్యవసాయ రంగాన్ని అగ్రభాగాన నిలిపేందుకు కృషి చేయాలి. రైతు బంధు, రైతు భరోసా, కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌లాంటి పథకాలు కొంతమేర లబ్ధి చేకూరుస్తున్నాయి. కానీ పూర్తి స్థాయిలో రైతుకు భరోసా కల్పించలేక పోతున్నాయి. ప్రభుత్వాలు చేపట్టే పథకాలు కేవలం భూస్వాములకు మాత్రమే లాభం చేకూర్చకుండా చిన్న, సన్నకారు, కౌలు రైతులకు కూడా ఉపయోగపడే విధంగా రూపకల్పన జరగాలి. దేశంలో ఎక్కువ భాగం కౌలు రైతులే ఉన్నారు. కాబట్టి వారి సంక్షేమాన్ని కూడా ప్రభుత్వాలు దృష్టియందుంచుకోవాలి..

ఒక ఉద్యోగికి, ఒక నాయకుడికి, ఒక అధికారికి, ఒక పారిశ్రామిక వేత్తకు, ఒక నటుడికి, ఒక క్రీడాకారునికి ఇచ్చే గౌరవం సమాజంలో రైతుకు ఇవ్వడం లేదు. వ్యవసాయం చేస్తున్న అంటే కనీసం పెళ్లికూడా అయ్యే పరిస్థితి నేటి యువ రైతులకు లేదు. రైతు ఏదైనా పని పడినప్పుడు ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే పరిస్థితి ఉన్నది. ఆయా కార్యాలయాలలో రైతును చాల చులకనగా చూసే విధానం మారాలి. కార్యాలయాలకు పని నిమిత్తం వెళ్లే వ్యాపారులను, నాయకులను, ఉద్యోగులను మొదలగు వారిని గౌరవించినట్టుగానే రైతును కూడా గౌరవించి పనిని తొందరగా పూర్తి చేయాలి. వ్యవసాయరంగాభివృద్ధికి వివిధ కమిషన్లు, రైతు సంఘాలు సిఫార్సు చేసిన పలు సంస్కరణలు అమలు చేసి వ్యవసాయ రంగాన్ని లాభసాటి ఉపాధి మార్గంగా మార్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆధునిక యువతను వ్యవసాయ రంగం వైపుకు వచ్చేలా ప్రోత్సహించాలి. నేను రైతును అని గర్వంగా చెప్పుకునే రోజులు భవిష్యత్తులో రావాలి. ఎన్ని సమస్యలు ఎదురైనా సడలని ధైర్యంతో జాతికి సేవలు అందిస్తున్న పునీతుడు రైతు. అలాంటి రైతుకు ప్రజలు, ప్రభుత్వాలు అండగా నిలబడాలి.
కందుకూరి భాస్కర్‌, 9703487088

Leave a Reply