Take a fresh look at your lifestyle.

మహిళా క్రీడాకారులకు అండగా నిలబడదాం…

మాట మాట్లాడితే ‘బేటీ బచావో, బేటీ పడావో’ అంటూ వూకదంపుడే కానీ, మహిళలపై జరిగే లైంగిక వేధింపులపై, అత్యాచారాలపై, హింసలపై నోరు పెగలటం లేదు వీరెవరికీ! క్రీడాకారులు ఇప్పటికీ వందల సార్లు మీడియా సాక్షిగా, తమ మీద అధికార బలంతో బ్రిజ్‌ ‌భూషణ్‌ ‌శరణ్‌ ‌సింగ్‌ ఏ ‌విధంగా లైంగిక వేధింపులు చేశాడో చెప్పారు. అలాగే రాతపూర్వకంగా పోలీస్‌ ‌స్టేషన్లో ఇచ్చిన రిపోర్ట్ ‌లో ఎనిమిది సంఘటనలను కూడా వివరించారు. ఇవేవీ దేశం, ధర్మం అంటూ వూగిపోయేవాళ్ల మెదళ్లకు చేరటం లేదు.

వినేష్‌ ‌ఫోగట్‌, ‌సాక్షి మల్లిక్‌… అం‌తర్జాతీయ ఒలంపిక్‌  ‌వేదికల మీద చిన్న వయసులోనే తమ గెలుపుతో భారతదేశపతాకాన్ని సగౌరవంగా ఎగరేసిన అత్యున్నత మల్లయుద్ధ మహిళా క్రీడాకారులు. అంతర్జాతీయ పోటీలకు సిద్ధం కావాల్సిన వారు, తమ మీద జరిగిన లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ప్రజా క్షేత్రంలో మరో యుద్ధం చేస్తున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడిన, సాక్షాత్తూ రెస్లింగ్‌ ‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా అధ్యక్షుడు, అధికార పార్టీ ఎంపీ  కూడా అయిన బ్రిజ్‌ ‌భూషణ్‌ ‌శరణ్‌ ‌సింగ్‌ (ఈయన నేర చరిత్ర మామూలుగా లేదు!) మీద చర్యలు తీసుకోవాలని తమ క్రీడా భవిష్యత్తుని కూడా పణంగా పెట్టి ఇరవైమూడు రోజులుగా దేశ రాజధాని జంతర్‌ ‌మంతర్‌ ‌లో న్యాయం కోసం పోరాడుతున్నారు. వారికి మద్ధతుగా మరికొంతమంది రెస్లర్లు ఈ పోరాటంలో భాగమయ్యారు. ఈ సంవత్సరం జనవరి 18న  సమస్య తీవ్రతను బహిరంగపరుస్తూ జంతర్‌ ‌మంతర్‌ ‌లో ముప్ఫై మంది క్రీడాకారులు ధర్నాకు కూర్చున్నారు. లైంగిక వేధింపులకు గురయిన వాళ్ళలో ఒక మైనర్‌ ‌బాలిక కూడా వుంది. న్యాయం చేస్తామని సీనియర్‌ ‌రెస్లర్‌ ‌మేరీ కోం ఆధ్వర్యంలో ఒక విచారణ కమిటీ కేంద్ర ప్రభుత్వ క్రీడా శాఖ వేసింది. దానితో అప్పుడు రెస్లర్లు తమ పోరాటాన్ని విరమించారు. మూడు నెలల పాటు వేచి చూశారు. ఏప్రిల్‌ 5 ‌వ తేదీన కమిటీ రిపోర్ట్ ‌ను మంత్రిత్వ శాఖకు సమర్పించింది కానీ బహిర్గత పరచలేదు. అధికారుల అలసత్వాన్ని ప్రశ్నిస్తూ, కమిటీ రిపోర్ట్ ‌ని బహిర్గతం చేయాలని (పిటిఐ కథనం ప్రకారం కమిటీ బ్రిజ్‌ ‌భూషణ్‌ ‌శరణ్‌ ‌సింగ్‌ ‌కి అనుకూలంగా రిపోర్ట్ ‌రాసింది!) క్రీడాకారులు మళ్లీ ఏప్రిల్‌ 23 ‌నుంచీ జంతర్‌ ‌మంతర్‌ ‌లో నిరవధిక ధర్నాకు కూర్చున్నారు. తమపై సంవత్సరాల తరబడి నుంచీ  లైంగిక వేధింపులకు పాల్పడుతున్న బ్రిజ్‌ ‌భూషణ్‌ ‌శరణ్‌ ‌సింగ్‌ ‌ని అరెస్ట్ ‌చేయాలని, కమిటీ రిపోర్ట్ ‌ని బహిర్గతం చేయాలని, రెస్లింగ్‌ ‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియాని రద్దు చేయాలని కోరుతున్నారు.

విచిత్రం ఏమిటంటే, చట్టం నిర్దేశించిన ప్రకారం పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా 2013 నిర్భయ చట్టం ప్రకారం, యాభై శాతం మహిళలతో, మహిళల నేతృత్వంలో (ఇంటర్నల్‌ ‌కంప్లయింట్‌ ‌కమిటీ-ఐసిసి) వుండాలి. కానీ,  రెస్లింగ్‌ ‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా వెబ్సైట్‌ ‌ప్రకారం నలుగురు పురుషులు ఒక మహిళ ఐసిసి మెంబర్లుగా వుండటం అంటే చట్టాన్ని తుంగలో తొక్కటమే.

తమ సమస్య ను పట్టించుకోండి అని క్రీడాకారులు ప్రతివక్కరికీ విజ్ఞాపనలు ఇస్తున్నారు. అధికార బీజేపీ మహిళా లోకసభ సభ్యులకు కూడా ఇచ్చారు. దేశ విదేశాల్లో ఈ విషయం మీద చర్చ జరుగుతోంది కానీ, వారికి మాత్రం ఇప్పటివరకూ ఈ విషయమే పట్టలేదు. మాట మాట్లాడితే ‘బేటీ బచావో, బేటీ పడావో’ అంటూ వూకదంపుడే కానీ, మహిళలపై జరిగే లైంగిక వేధింపులపై, అత్యాచారాలపై, హింసలపై నోరు పెగలటం లేదు వీరెవరికీ! క్రీడాకారులు ఇప్పటికీ వందల సార్లు మీడియా సాక్షిగా, తమ మీద అధికార బలంతో బ్రిజ్‌ ‌భూషణ్‌ ‌శరణ్‌ ‌సింగ్‌ ఏ ‌విధంగా లైంగిక వేధింపులు చేశాడో చెప్పారు. అలాగే రాతపూర్వకంగా పోలీస్‌ ‌స్టేషన్లో ఇచ్చిన రిపోర్ట్ ‌లో ఎనిమిది సంఘటనలను కూడా వివరించారు. ఇవేవీ దేశం, ధర్మం అంటూ వూగిపోయేవాళ్ల మెదళ్లకు చేరటం లేదు. చట్టబద్ధమైన న్యాయ విచారణ అడగటం, నిందితుణ్ణి అరెస్ట్ ‌చేయాలనటం కూడా తప్పు పట్టే పరిస్థితిలో వున్నారు.

క్రీడాకారులకు అంతర్జాతీయ వేదికల మీద పతకాలు వస్తే తామే దగ్గరుండి ప్రోత్సహించటంతోనే వచ్చినట్లుగా ఫోటోషూట్లు చేసుకునే ప్రధానమంత్రి  గారికి, దేశరక్షణ కోసం ఎవర్నీ ఉపేక్షించం అనే హోమ్‌ ‌మంత్రి గారికి గానీ క్రీడాకారుల మీద లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ పార్టీ ఎంపీ ని ప్రశ్నించే, చర్యలు తీసుకునే సమయం వుండదు. అంతులేని నిశ్శబ్దం పాటిస్తుంటారు. పైగా మహిళా రెస్లర్ల ఆరోపణలు నిరాధారమని, ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొడుతున్నాయని, అవసరమయితే వారికి కర్రలతో, బూట్లతో దండన సన్మానం చేస్తామని బహిరంగంగా వారి అనుయాయ గూండాలు(ఆధ్యాత్మిక సన్యాసి వేషధారణలో వుండే మహిళలతో సహా) సామాజిక మాధ్యమాలలో వీరంగం వేస్తూ వున్నారు. రెజ్లర్లకు మద్ధతుగా మాట్లాడుతున్న సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టుల మీద సామాజిక మాధ్యమాలలో విచ్చలవిడిగా ట్రోల్‌ ‌చేస్తున్నారు!

మరోపక్క క్రీడాకారులకు పెరుగుతున్న మద్ధతుని, నిర్బంధం, బలప్రయోగం ద్వారా అడ్డుకోవాలని దిల్లీ  చుట్టూ వున్న రహదారులకు కేంద్ర ప్రభుత్వం బారికేడ్లు పెడుతోంది. ధర్నా ప్రాంతంలో క్రీడాకారులకు కనీస సదుపాయాలైన నీరు, కరెంటు వంటివి ఆపేయాలని చూస్తోంది. హర్యానా ఔత్సాహిక రెజ్లింగ్‌ ‌సంఘం ఆందోళనలకు మద్ధతు తెలిపినందుకు ఐదుగురు అధికారులను మే 9 న సస్పెండ్‌ ‌చేసినట్లు పత్రికలలో కథనాలు వచ్చాయి.

ఎన్ని అడ్డకులు సృష్టించినప్పటికీ, ఎన్ని అవాస్తవాలు ప్రచారంలో పెట్టినప్పటికీ క్రీడాకారులకు పౌర సమాజం నుంచీ పెద్ద ఎత్తున మద్ధతు వివిధ రూపాల కార్యాచరణగా  వెళుతోంది.  దాదాపు అరవైకి పైగా మహిళా సంఘాలు మే 19-21 వరకూ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయి. వ్యవసాయ ఉద్యమాన్ని పెద్దఎత్తున నిర్వహించిన సంయుక్త కిసాన్‌ ‌మోర్చా, భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ ‌వంటి రైతు సంఘాలు ఇప్పటికే తమ మద్దతు ప్రకటించాయి. ఇతర ఆటల్లోని క్రీడాకారులు, రచయితలు, రాజకీయ నాయకులు, ఆఖరికి బీజేపీ పార్టీ నాయకులు కొంతమంది కూడా తమ మద్ధతు తెలియజేస్తున్నారు. ప్రతీ రాష్ట్రంలోనూ సంతకాల సేకరణ జరుగుతోంది.

లైంగిక వేధింపులపై తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని చట్టం నిర్దేశిస్తున్నప్పటికీ, సుప్రీం కోర్ట్ ఆదేశించేదాకా దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ ‌కూడా నమోదు చేయలేదు. ఏప్రిల్‌ 28 ‌న బ్రిజ్‌ ‌భూషణ్‌ ‌శరణ్‌ ‌సింగ్‌ ‌మీద పోక్సో(ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ‌చిల్డ్రన్‌ ‌ఫ్రమ్‌ ‌సెక్సువల్‌ ఒఫేన్సెస్‌), ‌మహిళల గౌరవానికి భంగకరంగా వ్యహరించినందుకు రెండు ఎఫ్‌ఐఆర్‌ ‌లు నమోదు అవ్వటం, విచారణ కోసం సిట్‌ ఏర్పాటు కావడం, రెస్లింగ్‌ ‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా వ్యవహారాలన్నీటినీ ఆర్థిక అంశాలతో సహా తమకు దాఖలు  చేయాలని ఇండియన్‌ ఒలంపిక్‌ అసోషియేషన్‌ ఆదేశించటం అన్నీ కూడా మొక్కవోని పట్టుదలతో క్రీడాకారులు ధైర్యంగా పోరాటం కొనసాగిస్తున్నందువల్లనే! వారికి అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి వొక్కరి మీదా వుంది. ఇది కేవలం నలుగురైదుగురి వ్యక్తిగత పోరాటం కాదు. క్రీడారంగంలో వున్న మన ఆడపిల్లల భవిష్యత్తు. ఈ రంగంలోకి వెళ్లాలనుకునే భవిష్యత్‌ ‌తరాల ఆడపిల్లలకు వ్యవస్థాపూరితమైన రక్షణలు వుండాలంటే ప్రతి ఒక్కరం  గొంతు విప్పాల్సిందే.

-కె సజయ సామాజిక విశ్లేషకులు,స్వతంత్ర జర్నలిస్ట్
-కె సజయ
సామాజిక విశ్లేషకులు, స్వతంత్ర జర్నలిస్ట్

Leave a Reply