Take a fresh look at your lifestyle.

వయోవృద్ధులకు ప్రేమ పంచుదాం

జీవిత సారాన్ని కాచి వడబోసిన తమ అనుభావలతో తరువాత తరాలకు మార్గదర్శకులై కుటుంబాలను, వ్యవస్థలను, సమాజాన్ని సరైన మార్గంలో నడిపే వయోధికులకు వందనాలు సమర్పిస్తూ, వారి అడుగు జాడల్లో నడవడమే మనం వృద్ధులను గౌరవించడం. కుటుంబలోని పెద్ద తలకాయలైన తాతు, బామ్మలు, అమ్మమ్మలను ప్రత్యేకంగా ఆదరిద్దాం. వారికి సహకరిస్తూ, సహాయంగా ఉంటూ, ఆనందింపజేద్దాం. పిల్లలు తాతయ్య, అమ్మమ్మలు, బామ్మలతో సరదాగా గడపుతూ, బయటకెళ్ళి వృద్ధాశ్రమాలను సందర్శిస్తూ, వారి యోగక్షేమాలు కనుక్కుంటూ, అండదండలుగా యువతరం ఉందన్న ధైర్యం ఇద్దాం. వారికి సమాజపరంగా అందించే సహాయం చేస్తూ, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి.

ఇక , ప్రపంచవ్యాప్తంగా 65 ఏళ్ళ వయస్సు దాటిన వృద్ధులు 703 మిలియన్లు కాగా, అందులో ఆసియాలో 261 మిలియన్లు, యూరప్‌-నార్త్ అమెరికాలో 200 మిలియన్లు ఉన్నారని 2019 గణాంకాలు చెబుతున్నాయి. వీరి సంఖ్య 2050 నాటికి రెట్టింపై 1.5 బిలియన్లు దాట వచ్చని అంచనా. అంతగా అభివృద్ధి చెందని భారత్‌ లాంటి దేశాల్లోనే వృద్ధుల సంఖ్య 2050 నాటికి 1.1 బిలియన్‌ ఉండవచ్చని భావిస్తున్నారు. 75వ వ్యవస్థాపక సంవత్సరం జరుపుకుంటున్న ఐక్యరాజ్యసమితి ప్రకారం అక్టోబర్‌ 1న ప్రపంచ వ్యాప్తంగా 30వ “అంతర్జాతీయ వయో వృద్ధుల దినం” పాటిస్తున్నారు. ఈ సందర్భంగా ‘కొరోనా కష్ట కాలంలో వృద్ధుల సంరక్షణ కార్యక్రమాలు చేపడుతున్నారు.. 2020 – 2030 దశాబ్దాన్ని “ఆరోగ్యకర వయోవృద్ధుల దశాబ్దం” గా నామకరణం చేసి, ఆ దిశలో ఐరాస అనేక సంక్షేమ కార్యక్రమాలను సభ్యదేశాలు పాటించనున్నాయి.

ప్రస్తుత కొరోన విశృంఖల విహార సమయంలో వయోవృద్ధులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వైరస్‌ ముప్పు భయంతో బతుకుతున్నారు. అపార అనుభవం, విచక్షణ, వివేకం కలిగిన వృద్ధులను అనారోగ్య సమస్యల నుండి కాపాడవలసిన బాధ్యత అందరి మీద ఉంది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలలోని వృద్ధుల ఆరోగ్య స్థితిలో అంతరం ఎక్కువగా ఉంది. అభివృద్ధి వెనుక బడిన దేశాలలో వృద్ధులకు వైద్య ఆరోగ్య వసతుల కల్పన, నర్సింగ్‌ సేవలు మరింత ముమ్మరం చెయ్యాలి. గణాంకాల ప్రకారం, 5 ఏళ్ళ లోపు బాలల జనాభా కంటే 60 ఏళ్ళు దాటిన వృద్ధుల జనాభా ఎక్కువగా ఉంది. 2030 నాటికి వృద్ధుల జనాభాతో పోలిస్తే 15 నుండి 24 సంవత్సరాల వయసు యువత జనాభా తక్కువగా ఉంటుందని అంచనా. ప్రస్తుతం వృద్ధులు ఆర్థిక, మానసిక, ఆరోగ్యం ఒడిదుడుకులకు లోనై, ఆదరణకు దూరమై జీవితాలు గడుపుతున్నారు. యువతలోని శారీరక శక్తి, పెద్దల్లోని అనుభవ మానసిక యుక్తి కలిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి.

వృద్ధులను చిన్నచూపు చూడడం, దుర్భాషలాడడం, ఇంట్లోంచి గెంటేయడం, సామాజిక వివక్షతో దూరం పెట్టడం లాంటివి సమాజ విలువల పతనానికి దర్పణం.. వృద్ధుల శక్తి యుక్తులను సమాజాభివృద్ధి, ఆర్థిక ప్రగతి, రాజకీయ రంగాలలో వినియోగిస్తూ దేశ సమగ్రాభివృద్ధిలో వారిని భాగస్వాములు చేయాలి. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, సమాజ హితులు కలిసి వృద్ధులను సంరక్షించుకోవాలి. మానవ సంబంధాలు గల కుటుంబాల్లో ఆశావహ దృక్పథంతో జీవించే వృద్ధులు మరో 10 ఏళ్ళు ఎక్కువ జీవిస్రారని విశ్లేషణలు తెలుపుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, చట్టసభలు, స్వచ్ఛంద సంస్థలు, కుటుంబాలు తమ విధులను కచ్చితంగా నిర్వహించినప్పుడు వృద్ధులు సమాజానికి కొత్త మానసిక ధైర్యం ఇవ్వడమేగాక కసంపద సృష్టిలో దోహదపడతారు. వృద్ధుల విజ్ఞాన వివేకాలను గౌరవించిన సమాజం, కుటుంబాలు సదా సంతోషంగా ఉంటాయి. వయోవృద్ధులకు ఇవ్వవలసిన ప్రాధాన్యతలను, తాత బామ్మల సాహచర్యాల ఉపయోగాలను, వారి పట్ల బాధ్యతలను పిల్లలకు విద్యాలయాల్లో వివరించాలి. జీవితకాలంలో వృద్ధులు సాధించిన ఘనతలను, వారు పొందిన పురస్కారాలను, సమాజాభివృద్ధిలో వారి పాత్రను స్మరించుకునే రోజుగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినం జరుపుకోవాలి. నేటి బాలలు రేపటి పౌరులే కాదు, నేటి యువకులే రేపటి వృద్ధులమని గుర్తుంచుకోవాలి. ***

dr burra madhsudhan
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి జాతీయ ఉత్తమ అధ్యాపక ఆవార్డు గ్రహీత విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ కళాశాల కరీంనగర్‌ – 9949700037

Leave a Reply