Take a fresh look at your lifestyle.

పదవి కోసం కాదు..మీ కోసం..! తెలంగాణ కాపాడుకుందాం.. ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొ.కోదండరామ్

భువనగిరి,మార్చ్1: ‘మాకంటే పెద్ద పార్టీలు ఉండొచ్చు కానీ మాకంటే పెద్ద పని చేసినోల్లు లేరు. రండి, గడీలను బద్దలు కొడదాం ..అని ప్రొ.కోదండరామ్ సోమవారం సాయంత్రం భువనగిరి AR గార్డెన్స్ లో జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతు అన్నారు.

‘ఈ ఎన్నికల్లో పోటీ నా పదవి కోసం కాదు
ప్రజలందరూ ఆవేదనలో ఉన్నరు. బతుకుదెరువు కోల్పోయిన్రు..అని ఆందోళన వ్యక్తం చేస్తూ..రైతులు, ఆదివాసీలు దిక్కుతోచని స్థితిలో ఉన్నరు..ఉద్యోగాలు, ఉపాధి లేక యువత నిరాశలో ఉన్నరు..కరోనా కారణంగా జీతాలు లేక ప్రైవేట్ టీచర్ల బతుకు ఆగం అయింది…ముఖ్యమంత్రి పదేపదే చేసే పరిహాసాలతో, దిక్కుమాలిన పీఆర్సీతో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు అవమానభారంతో ఉన్నరు..మంత్రులు ఎమ్మెల్యేలు కబ్జాలు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు.

అధికార పార్టీ నాయకులు న్యాయవాదులను సైతం నడిరోడ్డున నరికేస్తున్నరు…ఆదివాసీలను భూములనుంచి తరిమేస్తున్నరు…ఐటీఐఆర్ ప్రక్రియ మొదలు పెట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆపని చేయడంలేదు. ఐటీ నిపుణులను మోసం చేస్తున్నది.. తమ కుటుంబానికి ఆదాయం వచ్చే పని తప్ప మరోపని చేయడం లేదు కేసీఆర్ కుటుంబం.. కృష్ణా జలాల్లో వాటా సాధించుకోలేకపోతున్నం. పక్క రాష్ట్రం నీటిదోపిడీని ఆపడానికి సిద్ధంగా లేదు కేసీఆర్ ప్రభుత్వం… కాళేశ్వరం పేరుతో ధనదోపిడీ జరుగుతున్నది.

మెఘా కృష్ణారెడ్డి అత్యంత ధనవంతుడైండు. ముడుపులు అందుకుని మురిసిపోవుడేతప్ప కేసీఆర్ కు తన జనంపై సోయిలేదు. వారి జీవన ప్రమాణాలు పెంచే మనసు లేదు… ఉద్యోగ ఉపాధికోసం యువత స్టడీ సెంటర్లు లైబ్రరీల్లో తినీతినక ఆశతో ప్రయత్నాలు చేస్తుంటే ఉద్యోగ కల్పన గురించి అబద్ధాలు చెపుతున్నరు. అమూల్యమైన కాలాన్నీ వయసునూ కోల్పోయే యువ మానవవనరుల దైన్యం మనకు సిగ్గుచేటు.. ఇంక రాష్ట్రం తెచ్చుకున్నదెందుకు? ఉద్యమ ఆకాంక్షలు విఫలమైనయ్.. ఉన్న యూనివర్సిటీలు మూసేస్తరు, తాము మాత్రం ప్రైవేట్ యూనివర్సిటీ తెచ్చుకుంటరు అని అన్నారు.

‘ఈ రాజకీయాలు మారాలె. అవినీతి పోవాలె. తెలంగాణ అభివృద్ధి-సంక్షేమం తప్ప మరో లక్ష్యం లేని రోజులు రావాలె. ఇది జరగాలంటే కేసీఆర్ ను దెబ్బతీయాలె. ఈ ఎన్నిక ఒక అవకాశం. అందుకే నేను పోటీ చేస్తున్న. రాజకీయాలను మార్చాలని నేను పోటీచేస్తున్న. మీ అందరి మద్దతుతో మార్పు సాధ్యం. ఇది కీలకపోరాటం. వాళ్ళు పైసలు వెదజల్లుతరు. భయపడొద్దు. మనకు అంబేడ్కర్ ఉన్నడు. Educate Agitate Organise అని బోధించిండు.

అది తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ మార్గం. కాన్షీరాం సైకిలెక్కి ఇల్లిల్లూ తిరిగి రాజ్యాధికారం సాధించిండు. తెలంగాణ అస్తిత్వం కోసం మరో ఉద్యమ నిర్మాణం మన ముందున్న లక్ష్యం. ఈ ఎన్నిక దానికి మార్గం. రండి, కలిసి కదులుదాం. గడీలను బద్దలు కొడుదాం. మార్చి 14న జరిగే పోలింగ్ లో పెద్దఎత్తున పాల్గొనండి. *బ్యాలెట్ పేపర్ లో 7వ నంబర్ ఎదురుగా మీ మొదటి ప్రాధాన్యత ఓటు 1 వేసి నన్ను గెలిపించండి. శాసనమండలిలో మీ గొంతుకనవుతా అని అన్నారు.

Leave a Reply