Take a fresh look at your lifestyle.

కోవిడ్ కష్టాల నుండి జర్నలిస్టులను రక్షించుకుంటాం

టీయూడబ్ల్యుజె రాష్ట్ర కార్యవర్గ సమావేశం వెల్లడి

రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి ప్రభావంతో ఉద్యోగ, ప్రాణ భద్రత కరువై ఆందోళన చెందుతున్న జర్నలిస్టులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతున్నందున, జర్నలిస్టులను రక్షించుకోడానికి వివిధ రూపాల్లో పోరాటాలను ఉధృతం చేస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యుజె) వెల్లడించింది. యూనియన్ అధ్యక్షులు నగునూరి శేఖర్ అధ్యక్షతన ఆదివారం టీయూడబ్ల్యుజె రాష్ట్ర కార్యవర్గ సమావేశం జూమ్ యాప్ ద్వారా జరిగింది. ఆయా జిల్లాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న 35 మంది రాష్ట్ర బాధ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కొరోనా బారిన పడి పలువురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోతున్నా, బాధిత కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోక పోవడం సహించారనిదని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ తన నివేదికను సమర్పిస్తూ, తాము సేకరించిన సమాచారం మేరకు ఇప్పటివరకు రాష్ట్రంలో ఏడుగురు జర్నలిస్టులు, ముగ్గురు మీడియా సిబ్బంది కొరోనా కాటుకు గురై ప్రాణాలు కోల్పోయినట్లు విచారం వ్యక్తం చేశారు. అలాగే సుమారు 900 మంది జర్నలిస్టులు, మీడియా సిబ్బంది, 1500 మంది వారి కుటుంబ సభ్యులు కొరోనా పాజిటీవ్ కు గురైనట్లు ఆయన తెలిపారు. పాజిటీవ్ వచ్చిన వారికి, ఐసోలేషన్లో ఉన్న వారికి మాత్రమే మీడియా అకాడమీ ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది తప్ప, మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఇంతవరకు ఎలాంటి ఆర్థిక సహకారాన్ని అందించక పోవడం విచారకరమన్నారు. కొరోనా బారిన పడుతున్న జర్నలిస్టులకు వైద్యసహకారం అందించడంలో తమ సంఘం అగ్రస్థానంలో ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. అలాగే స్వచ్చంద సంస్థల సహకారంతో గడిచిన 6 నెలల వ్యవధిలో రాష్ట్రంలో 3వేల జర్నలిస్టుల కుటుంబాలకు తమ సంఘం రేషన్ సరుకుల కిట్లను అందించినట్లు విరాహత్ వివరించారు.

tuwj zoom meeting

నగునూరి శేఖర్ మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మీడియా అకాడమీ జర్నలిస్టుల సంక్షేమ నిధి వడ్డీపై ఆధారపడి సహాయం చేయడం సరైంది కాదని, ఆ నిధి నుండి మృతి చెందిన ప్రతి జర్నలిస్టు కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సహకారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన హెల్త్ కార్డులు ప్రైవేట్ హాస్పిటల్ల తిరస్కరణకు గురవుతున్నందున, అనారోగ్యానికి గురై సరైన వైద్యం పొందలేక పోతున్న జర్నలిస్టులకు చౌక ప్రీమియంతో గ్రూప్ ఇన్సూరెన్స్ ద్వారా చేయూత నిచ్చేందుకు ఆయా ఇన్సూరెన్స్ కంపెనీలతో చర్చించేందుకు సమావేశం నిర్ణయించింది. కొరోనా బారిన పడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ జాబితాలో ఉన్న జర్నలిస్టులకు కార్పోరేట్ హాస్పిటల్ ల్లో ప్రత్యేక చికిత్స కోసం ప్రభుత్వంపై వివిధ రూపాల్లో ఒత్తిడి తెచ్చేందుకు సమావేశం నిర్ణయించింది. కొరోనా ప్రభావంతో మీడియా రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటూ సిబ్బందిని ఉద్యోగాల నుండి అక్రమంగా తొలగిస్తున్నందున తగు కార్యాచరణపై సమావేశం చర్చించింది. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కోవిడ్ పాజిటీవ్ జర్నలిస్టులకు సేవలందిస్తున్న రాష్ట్ర నాయకత్వాన్ని సమావేశం అభినందించింది. జర్నలిస్టుల కోవిడ్ కష్టాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేందుకు గానూ టీయూడబ్ల్యుజె చేస్తున్న ఆన్లైన్ క్యాంపెన్ కు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తుందని, త్వరలో ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సమావేశం స్పష్టం చేసింది. ఈ సమావేశంలో ఐజేయూ నాయకులు వై.నరేందర్ రెడ్డి, దాసరి కృష్ణారెడ్డి, కల్లూరి సత్యనారాయణ, పీసీఐ సభ్యులు ఎం.ఏ.మాజీద్, రాంనారాయణ, రాష్ట్ర బాధ్యులు దొంతు రమేష్, మహిపాల్ రెడ్డి, ఫైసల్ అహ్మద్, గుడిపల్లి శ్రీనివాస్, గాడిపల్లి మధుగౌడ్ లతో పాటు ఆయా జిల్లాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

tuwj zoom meeting

Leave a Reply