Take a fresh look at your lifestyle.

హైదరాబాద్‌ ‌జీవాత్మ… విభిన్నమత సంస్కృతుల సమ్మేళనం… కాపాడుకుందాం

“భిన్నత్వంలో ఏకత్వం అనే అంశం మీద, భిన్న మతాల సహజీవన సామరస్యం ఆవశ్యకతను గుర్తింపచేసే ఓ ముఖ్యమైన రాజకీయ కార్యాచరణ. తదనంతర కాలంలో ఒక విద్యార్థిగా అలాంటి కార్యాచరణలో భాగమవటంవల్ల హైదరాబాద్‌ ‌ప్రజల జీవితం ఎన్ని సంస్కృతుల సమ్మేళనమో ప్రత్యక్షంగా అర్థం చేసుకోవటానికి ఒక అవకాశం ఏర్పడింది.”

హైదరాబాద్‌ ‌నగరానికి ఆటుపోట్లు కొత్తకాదు. ప్రకృతి వైపరీత్యాల నుంచీ, రాజకీయ, మతవిద్వేషాల వరకూ తట్టుకుని నిలబడిన నగరం. ఎంత కష్టం వచ్చినా మతాల కతీతంగా మనిషికి మనిషి అండగా నిలబడ్డారు తప్పించి ఎన్నడూ నగర జీవాత్మను ధ్వంసం కానీయలేదు. ఒకపక్క ఎవరెవరో స్వార్థాల వల్ల కలహాలు పెరిగే పరిస్థితి ఏర్పడినా గానీ, మరోపక్క తమ ప్రాణాలడ్డుపెట్టి తమ తోటివారిని మతాలకతీతంగా కాపాడిన అద్భుత మానవీయత హైదరాబాద్‌. ఇది పదే పదే పునరావృతమయ్యే దృశ్యం. హైదరాబాద్‌ ఏనాడూ కేవలం ఒక మతానికి మాత్రమే సంబంధించిన నగరం కాదు. నాలుగు శతాబ్దాల సమ్మిళిత చరిత్రలో మానవీయత, సహోదర భావాలను మట్టుపెట్టాలనుకునే ఏ రాజకీయ, మతోన్మాద దురుద్దేశాలను కొనసాగనివ్వకూడదు.

హైదరాబాద్‌ ‌నగరంతో నాకు నాలుగు దశాబ్దాల అనుబంధం. నాకు తెలిసినంతవరకూ, తొలిదశ తెలంగాణ ఉద్యమం (1969) తర్వాత హైదరాబాద్లో రోజుల తరబడి కర్ఫ్యూ పెట్టింది రమీజాబీ సంఘటనలో. ఆమె భర్తను చనిపోయేవరకు లాకప్లో కొట్టటం తర్వాత ఆమెపై పోలీసులు అత్యాచారం చేయటం అనేది ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహాన్ని కలగజేసింది. పోలీసుల చర్యను నిరసిస్తూ ఆందోళన ఉధృతమవటం, అవి రెండు సమూహాల మధ్య కలహాలుగా దారితీయటంతో రోజుల తరబడి కర్ఫ్యూ అనుభవం హైదరాబాద్‌ ‌జనజీవితంలోకి వచ్చింది. దానికి గల కారణాలను, ఆనాటి రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకునే వయసు కానప్పటికీ, పోలీసు పారా మిలిటరీ బలగాల నిర్బంధం ప్రజల్ని ఎలా భయంలోకి నెట్టేస్తుందో, కనీస అవసరాలకు కూడా బయటికి రానీయని పరిస్థితి ఎలా వుంటుందో ప్రత్యక్షంగా పధ్నాలుగేళ్ల వయసులో నాకు మొదటిసారి అర్థమయిన సందర్భం.

ఆ తర్వాత ఒకటిన్నర దశాబ్దకాలం పాటు హైదరాబాద్‌ ‌నగరం నివురుగప్పిన నిప్పులా భయం, అభద్రతల్లోనే వుంది. భిన్నమతాల ప్రజలను పరస్పర అనుమానంలోకి నెట్టింది. అయితే, హైదరాబాద్‌ ‌పరిస్థితి మెరుగుపడటానికి, భిన్న మత సమూహాల మధ్య సామరస్యం కోసం కేశవరావు జాదవ్‌, ఎం.‌టి.ఖాన్‌, ‌రమా మెల్కోటే వంటివారితో పాటు ఎంతోమంది ‘హైదరాబాద్‌ ఏక్తా’ పేరుతో అన్ని కాలనీలలో పాదయాత్రలు చేస్తూ, కరపత్రాలు పంచుతూ భిన్న మత సమూహాల ప్రజలతో నిరంతరం ఒక సంభాషణ జరిపేవారు. ఇవి కేవలం అధికారం కోసం జరిపిన పాదయాత్ర కాదు. భిన్నత్వంలో ఏకత్వం అనే అంశం మీద, భిన్న మతాల సహజీవన సామరస్యం ఆవశ్యకతను గుర్తింపచేసే ఓ ముఖ్యమైన రాజకీయ కార్యాచరణ. తదనంతర కాలంలో ఒక విద్యార్థిగా అలాంటి కార్యాచరణలో భాగమవటంవల్ల హైదరాబాద్‌ ‌ప్రజల జీవితం ఎన్ని సంస్కృతుల సమ్మేళనమో ప్రత్యక్షంగా అర్థం చేసుకోవటానికి ఒక అవకాశం ఏర్పడింది.

1990 దశకం ప్రారంభంలోనే మళ్లీ అటువంటి విపత్కర పరిస్థితికి హైదరాబాద్‌ ‌గురయింది. స్వార్థ అధికార రాజకీయాలు తమ వికృతక్రీడకు ప్రజల మతవిశ్వాసాలను ఆయుధాలుగా మార్చుకున్నాయి. ఫలితం, వందలాదిమంది సామాన్య ప్రజల ప్రాణాలు బలైయ్యాయి. చరిత్ర గుర్తున్నవారెవరికైనా ఈ విషయాలు జ్ఞాపకం వుండే వుంటాయి. ఒక సంవత్సరకాలంలో రెండు సుధీర్గ కర్ఫ్యూలు చోటుచేసుకున్నాయి. రాజకీయ అధికార దాహం ఎంతపనైనా చేస్తుంది అనటానికి అవి ఉదాహరణలు. ఏం జరుగుతుందో అర్థం అయ్యేసరికే ఒకేరోజు అనేక బస్తీల్లో అర్థరాత్రి ఆయుధాలతో గుండాల దాడి. కనిపించినవాళ్ళని కనిపించినట్లు చంపారు. చిన్నపిల్లలు, స్త్రీలు కూడా చనిపోయారు.

రోజుకూలీలు, చిన్నాచితకా ఉపాధు లతో తమ మానాన తాము బతికే సామాన్య ప్రజల జీవితాలు అల్లకల్లోలం అయ్యాయి. భయం గుప్పిట్లోకి హైదరాబాద్‌ ‌పాతనగరం వెళ్ళింది. నిత్యావసర సరుకులు, మందులు, పిల్లలకు కనీసం పాలు కూడా దొరకని స్థితిలోకి ప్రజలు వెళ్ళిపోయారు. అన్నిమతాలవారూ బాధితులుగా మారారు. ఎడతెగని కర్ఫ్యూ లతో వ్యాపారాలు ధ్వంసం అయ్యాయి. సామాన్యప్రజల శవాలగుట్టల మీద అధికారమార్పిడి జరిగింది. ఆనాటి భయానక పరిస్థితి నుంచీ నగరం తేరుకుందంటే కారణం రాజకీయ పార్టీలు కాదు. కేవలం మతాలకతీతంగా ప్రాణాలకు తెగించి నిలబడ్డ ప్రజా చైతన్యమే. మతాల కతీతంగా కర్ఫ్యూ సమయంలో నిత్యావసర సరుకులు అందించడం నుంచీ, గాయపడ్డవారిని హాస్పిటళ్ళకి తీసుకెళ్లి వైద్య సహాయం అందించడం, ఆ తర్వాత బాధితులను కాపాడిన ప్రతిఒక్కరినీ పేరు పేరునా గుర్తించి వారికి పబ్లిక్‌ ‌గార్డెన్స్ ‌లో పౌర సన్మానం చేయటం వరకూ కూడా హైదరాబాద్‌ ‌పౌరసమాజం ముఖ్యపాత్ర వహించింది. ఇందులో ముస్లిములు, హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, పార్సీలు అందరూ వున్నారు. అనేక రాష్ట్రాల నుంచీ వచ్చి ఇక్కడ స్థిరపడిన ఎంతోమంది ఈ కార్యాచరణలో భాగమయ్యారు. వీటన్నిటిలోనూ ఎంతోమందిమి ప్రత్యక్షంగా పనిచేశాము, ఇప్పటికీ పనిచేస్తూనే వున్నాము.

హైదరాబాద్‌ ‌నగరం మీద మతవిద్వేషపు నీడని పరవాలనుకునే శక్తులు ఇప్పటికిప్పుడు వచ్చాయనుకోవటానికి లేదు. అవకాశం దొరికినప్పుడల్లా కాటేయటానికి చూస్తూనే వున్నాయి. చాప కింద నీరులా విద్వేషాన్ని పెంచి పోషించాలనుకుంటున్నాయి. ఎప్పుడూ వేరే వేరే సందర్భాలలో విద్వేషాన్ని రగిలించే శక్తులు ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధం గా జరగాల్సిన జిహెచ్‌ఎమ్సి ఎన్నికలను అడ్డుపెట్టుకుని మతవిద్వేషాన్ని పెంచాలని చూస్తున్నాయి. భిన్నమతాల సహజీవనాన్ని, సామరస్యాన్ని కాపాడటం కన్నా ప్రజలమధ్య విద్వేషాలను ఎలా రెచ్చగొట్టాలా అని పథకాలు రచిస్తున్నాయి. బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీలేవీ కూడా ఇంత దుర్మార్గానికి తెగబడవు. ఇప్పటికే ఐటీ విశ్వనగరంగా మారిన నగరాన్ని మళ్లీ విశ్వ నగరంగా మారుస్తామనే వాగ్దానం ఏమిటి? హైదరాబాద్‌ ‌నగర చరిత్రను తుడిచేస్తామని చెప్పటం అంటేనే ఈ నగరం మీద ఎంత ద్వేషం కూడగట్టుకుని వున్నారో కూడా తెలుస్తోంది. అనుమతి లేని కట్టడాల పేరుతో కూలగొడతామని చెబుతున్న అంశంలో వాళ్లు ఇక్కడ అధికారంలోకి వస్తే చారిత్రిక కట్టడాలను ఏం చేయాలనుకుంటున్నామో అనిచెప్పే బెదిరింపు మాత్రమే కనిపిస్తోంది.

వాళ్లకు అది అలవాటైన విషయం అని మనకు తెలియనిదా? అన్నిటికీ మించి, ఒక నగరానికి సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికలకు కేంద్ర గృహమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రచారానికి రావలసిన అవసరం ఉందా? ఇది ఎంత హాస్యాస్పదంగా వున్నదనేది విచక్షణ వున్న పౌరులు ఆలోచించి తీరాలి. నాలుగు శతాబ్దాల హైదరాబాద్‌ ‌చరిత్రలో భిన్న సంస్కృతుల నేపథ్యం నుంచీ వచ్చిన ఎన్నో ప్రాంతాలవారు వున్నారు. ఆయా సమూహాలు వున్నచోట వాటి పేరుతోనే అక్కడి ప్రాంతాలు కూడా పేరుగాంచాయి. హైదరాబాద్‌ ‌చరిత్ర తెలియనోళ్ళు, పరిచయం లేనోళ్లు బస్తీ అంటే ఒక మురికివాడ అనుకుంటారు. కానీ బస్తీ అంటే వాడుకబాషలో నగరం అని తెలవదు. నగర విస్తీర్ణం పెరిగేకొద్దీ మొదటినుంచీ ఉన్నదాన్ని పాతబస్తీగా, మిగిలిన దాన్ని కొత్తబస్తీ గా పిలవటం మొదలెట్టారు. సినిమా పరిశ్రమ, ఐటి కంపెనీలు వచ్చిన తర్వాత నగరం తన ఎల్లలు జరుపుకుంటూ వెళుతోంది. ఇది కేవలం భౌగోళిక విస్తీర్ణం మాత్రమే కాదు. నగరం ఎంత విస్తరించినా గానీ, కొత్త కొత్త భవనాలు వెలిసినా కానీ, హైదరాబాద్‌ అం‌టే ఎవరికైనా మొదట గుర్తుకు వచ్చేది చార్మినారు మాత్రమే. చార్మినార్‌ ‌ని నిర్మించింది అకాల మృత్యువాతపడ్డ ప్రజల స్మృతిలో. ఆ ప్రజలు భిన్న మతాలకు చెందినవారు. ఇది గుర్తున్న ఎవరికైనా హైదరాబాద్‌ ‌జనజీవితం ఏ పునాది మీద వుందో అర్థమవుతుంది. ఆ వాస్తవాన్ని చూడ నిరాకరించేవారే పాతబస్తీ మీద ‘సర్జికల్‌ ‌స్ట్రైక్‌’ ‌చేస్తామని వదరుతారు. అంటే మేము పాలన లోకి వస్తే ప్రజల మీద ఊచకోత ప్రయోగిస్తామని ప్రకటించటం. వాళ్లకి ఇది అలవాటైన విషయమే అని మనకీ ఆరేళ్లలో పదే పదే పునరావృతమవుతూనే వుంది.

హైదరాబాద్‌ ‌నగర సహజ వనరులు, భౌగోళిక, సాంస్కృతిక జీవనంతో సంబంధం లేనివాళ్ళు, అవగాహన లేనివాళ్ళు, గౌరవం లేనివాళ్ళు ఇప్పటివరకూ చేసిన విధ్వంసం తాలూకూ విషాదం తాజాగా వరదల రూపంలో బయటికి వచ్చింది. తిరిగి ఈ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే కేవలం సాంకేతిక చర్యలు మాత్రమే కాదు, హైదరాబాద్‌ ‘‌తెహజీబ్‌’ ‌ని నిలబెట్టగలిగే, ఇక్కడి భిన్నమత సహజీవనం మీద గౌరవం వున్నవాళ్ళు స్థానిక పరిపాలనలో భాగమవ్వాల్సిన అవసరం ఎంతైనా వుంది. హైదరాబాద్‌ ‌ప్రజల బహుళ సాంస్కృతిక వారసత్వాన్ని, చరిత్రను చెదరగొట్టటానికి, ధ్వంసం చేయటానికి ప్రయత్నించే ఎవరినైనా ఉపేక్షించటం అంటే అది మనకు భస్మాసుర హస్తమే అవుతుంది. హైదరాబాద్‌ ఒక ప్రేమనగరం. దాన్ని, ప్రకృతి విపత్తుల నుంచీ, రాజకీయ దురుద్దేశాల నుంచీ, ద్వేషం నుంచీ అన్నివిధాలా కాపాడుకుందాం.

Leave a Reply