Take a fresh look at your lifestyle.

‌ప్రభుత్వ బడులను కాపాడుకుందాం..

కొరోనా కారణంగా దేశప్రజల ఆర్థిక పరిస్థితులు తలకిందులవ్వడంతో, ఒక్కసారిగా ప్రజల జీవన ప్రమాణాలు కనిష్టస్థాయికి దిగజారాయి. ఇలాంటి వేళ మూల్గే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ప్రైవేట్‌ ‌విద్యాసంస్థలకు ఫీజులు కట్టలేక తమ పిల్లల కొరోనా జాగ్రత్తలకు తగ్గట్టు మౌళిక వసతులు కల్పిస్తారనే నమ్మకం లేక సతమతమవుతున్నారు. బతుకు జీవుడా అంటూ ప్రభుత్వ వైద్యులు, వైద్య శాలలు కొరోనా కష్టకాలంలో ఆదుకుంటే.. ప్రైవేట్‌ ‌వైద్యులు, దవాఖానాలలో కనీసం ఓ.పి. (ఔట్‌ ‌పేషెంట్‌) ‌కూడా చూడని స్థితి కొన్నాళ్లు, ఆ తరువాత కొరోనా పేషంట్ల వైద్యం పేరుతో దోపిడీ చేసిన స్థితి చూస్తిమి. అదే మాదిరిగా ప్రైవేట్‌లో చదువులు చెప్పించుకుంటున్న పిల్లల తల్లిదండ్రుల్లో మార్పు వచ్చి సర్కారు బడులకు పోటెత్తినారు విద్యార్థులు. మరోవైపు ఫీజులు వసూలు కాక, ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేక గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్‌ ‌విద్యా సంస్థలు మూతబడినాయి. వారంతా మరోమార్గం లేక సర్కారు బడుల బాట పట్టినారు. ఇలా ఈ ఏడాది తెలంగాణాలో సుమారు రెండు లక్షలకు పైగా విద్యార్థులు సర్కారు బడులకు చేరినట్లు ప్రభుత్వ గణాంకాలు తెలుపుచున్నాయి. ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. అలాగే దేశంలో మొత్తంగా 15.51 లక్షల పాఠశాలలు ఉండగా, వాటిలో 24.83 కోట్ల మంది విద్యార్థులు చదువుచున్నట్లు యునెస్కో తాజాగా విద్యా నివేదిక 2021 వెల్లడి చేసింది. మౌళిక వసతుల కొరతతో పాటు, ఉపాధ్యాయుల నియామకాలు లేక ఏటా ఉపాధ్యాయుల పదవీ విరమణలు పెరిగిపోయి ఖాళీల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతుంది. ఇలా ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉండడం వలన ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులపై భారం పెరిగిపోయి ఒత్తిడికి గురౌతున్నారు.

సర్కారు బడులలో విశాలమైన మైదానం ఉంటుందని, ఆహ్లాదకర వాతావరణంలో కొరోనా జాగ్రత్తలు పాటించైనా ప్రైవేట్‌ ఇరుకు గదులకంటే మెరుగుగా ఉంటుందనేది తల్లిదండ్రుల భావన. కొరోనా కష్టకాలంలో ఉపాధ్యాయులు సానిటైజ్‌ ‌చేయడం, పరిసరాలు పరిశుభ్రముగా ఉంచడంలో, మరుగుదొడ్ల నిర్వహణలో చాలా ఇబ్బందులు పడుచున్నారు. స్థానిక సంస్థల వారు వారానికి రెండుసార్లు వచ్చి అరకొరగా శుభ్రం చేయడం వలన పూర్తి స్థాయిలో పాఠశాల ఆవరణ, తరగతి గదులు, మరుగుదొడ్లు, నీటి వసతులు లాంటి సౌకర్యాలు విద్యార్థులకు కల్పించడంలో సఫలీకృతం కాలేక పోవుచున్నారు. గతంలో ప్రభుత్వం నియమించిన స్కావెంజర్లను పాఠశాలల ప్రారంభంనుంచే కొనసాగించాలని ఉపాధ్యాయ ఎమ్‌.ఎల్‌.‌సి. ఎ. నర్సిరెడ్డిలు కోరుతున్నప్పటికీ, ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు పాలకులు. పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలు అందించడం లేదు. పాఠ్యపుస్తకాలను విద్యార్థులందరికీ అందించాల్సిన అంశం నిర్లక్ష్యం చేయరాదు. మధ్యాహ్నభోజన బియ్యం, వంటవాళ్ళ బిల్లులు, స్కావెంజర్ల నియామకం, ఉపాధ్యాయుల నియామకం, కొరోనా జాగ్రత్తల నిమిత్తం పాఠశాలలకు అదనపు నిధులను వెంటనే మంజూరీ చేయాల్సి ఉంది. కొద్దో గొప్పో వచ్చే నిధులు కరెంట్‌ ‌బిల్లులకు సరిపోవడం లేదు. క్షేత్ర స్థాయిలో కొరోనా అనంతర విద్యావ్యవస్థ స్థితిగతులను అవగతం చేసుకొని ప్రభుత్వ విద్యావ్యవస్థను మెరుగు పరచాలి.

దేశం, రాష్ట్రంలో మూతపడిన ప్రభుత్వ బడుల• తిరిగి విద్యార్థుల చేరికలతో మళ్ళీ తెరుచుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్న విద్యార్థుల సంఖ్యను నిలుపుకొనుటకు, నాణ్యమైన విద్య అందించడం, మెరుగైన సౌకర్యాలను సమకూర్చడం, పర్యవేక్షించడం ముమ్మాటికి పాలకులపై ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యావ్యవస్థకు పరిపుష్టి నింపుటకు తాజా స్థితిగతులపై సమీక్ష జరపాలి. వెంటనే అత్యవసరమైన మౌళిక వసతులతో పాటు నాణ్యమైన విద్యనందించుటకు కావలసిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే తల్లిదండ్రుల్లో, సమాజంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నమ్మకం ఏర్పడుతుంది. కొరోనా వలనో, మరో కారణమో, సర్కారు బడిపై ప్రేమో ఏమైనా కాని సర్కారు బడుల బాట పట్టిన విద్యార్థులు తిరిగి ప్రైవేట్‌, ‌కార్పొరేట్‌ ‌బాట పట్టకుండా ఉండాలంటే .. పాలకులు, ఉపాధ్యాయులు, సమాజం సంఘటితంగా ప్రభుత్వ విద్య(బడుల)కు నిధులు, నియామకాలు, కనీస సౌకర్యాలు పెంచాలి. పంచాయితి స్థాయినుండి అసెంబ్లీ, పార్లమెంట్‌ ‌వరకు కనువిప్పు కలిగేలా విద్యా వ్యవస్థ బలోపేతం అయ్యేంత వరకు మరో పోరాటం చేయాలి. ఎందుకంటే కార్పొరేటు, ప్రైవేటు విద్యా, వైద్యం రంగాల్లో కొరోనా మహమ్మారి సంక్షోభ కాలంలో ఎంత దోపిడి చేశాయో చూస్తిమి. ఆ అనుభవంతోనైనా ప్రభుత్వ రంగంలోనే విద్య, వైద్య ఉంటేనే పాలితులకు మేలు జరుగుతుందని గమనించండి.

పాలకులు ప్రభుత్వ విద్యా వ్యవస్థలో నియామకాలు, బదిలీలు, ప్రమోషన్లు, పర్యవేక్షణ, నిధులు, మౌళిక వసతుల కల్పన చేయకుండా.. కనీసం స్కావెంజర్లు లేని దుస్థితిలో ఇంకా కొనసాగిస్తే ప్రభుత్వం కావాలనే ప్రభుత్వ విద్యావ్యస్థను బలహీనపరుస్తుందనే అపవాదు మోయాల్సి వస్తుంది. దీని మూలంగా పరోక్షంగా ప్రైవేట్‌ ‌కార్పొరేటు రంగానికి దోహదం చేసినట్లేనని ప్రజలు భావిస్తారు. ఇలా ప్రభుత్వాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉదాసీన వైఖరి అవలంభించడం మూలంగా మునుముందు మళ్లీ ప్రైవేట్‌, ‌కార్పొరేట్‌ ‌పాఠశాలలు ఫీజుల దోపిడికి తెరలేపుతాయి. దీనికి ప్రభుత్వాలే కారణమౌతాయని గమనించండి. పాలకుల కళ్ళు తెరిచేలా విద్య, వైద్య రంగాలను ప్రైవేట్‌ ‌పరం చేయకుండా కొరోనా విలయతాండవం నుండైనా మేల్కొని వీటిని పూర్తిగా ప్రభుత్వాధీనంలోనే నడిపేలా చేయడం పాలితుల చైతన్యంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రైవేట్‌, ‌కార్పొరేటు పాఠశాలలను జాతీయం చేసి, వాటిని ప్రభుత్వాలు నిర్వహించాలి. అలాగే సంక్షేమం పేరుతో ఉచితాలను అధికార పీఠం కోసం అలవాటు చేసిన పాలకులు కొరోనా సంక్షోభం నుండైనా గుణపాఠం నేర్చుకోవాలి. విద్య అంగడిసరుకు కాకుండా పూర్తిగా ప్రభుత్వమే ఉచితంగా నాణ్యమైన విద్యను ప్రజలకు అందించాలి. ఉచితాలకు అలవాటు పడిన ప్రజలు మీ బతుకులు మార్చే ఉచిత విద్యకై పోరాడండి..

– మేకిరి దామోదర్‌
‌వరంగల్‌, 9573666650

Leave a Reply