Take a fresh look at your lifestyle.

నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ‘‘భాషలను బతుకనిద్దాం’’!

Today is International Mother Tongue Day

ఒక భాష అంతరించిపోవటమంటే మన చరిత్రకు సంబంధించి ఒక పార్శ్వం సజీవసమాధి కావటమే! ప్రాచీన సంస్కృతి,వారసత్వ సంపద గల భారతదేశంలో గత యాభై సంవత్సరాలకాలంలో అనేక భాషలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇది కనీస విపత్తుగా కూడా ఎవరికీ కనిపిం చకపోవటం చింతించాల్సిన విషయం. అంతేకాదు ఆయా భాష లతోపాటు వాటిలో అంతర్లీనమైన సంస్కృతి, సాంప్రదాయాలు, అచార,వ్యవహారాలు కూడా అంతరించిపోతా యన్న స్పృహ లేకపోవటం బాధాకరం! స్వాతంత్య్రం సిద్ధించిం దని చెప్తున్న కాలం నుంచి నేటి వరకు ఈ దేశాన్ని పాలించిన రాజకీయ పక్షాల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణమని భావించటంలో శషభిషల అవసరం లేదు. అంతరించిన భాషలలో అధికం సంచారజాతులు,గిరిజనులు,పాలకుల పౌరసత్వజాబితాలో లేనివారు మాట్లాడే భాషలే అధికం అనేది అనేక పరిశోధనలు వెల్లడిస్తున్న వాస్తవం!ఈ నేపథ్యంలో నిర్లక్ష్యానికిగురై జీవించే అనేక తెగల,జాతుల భాషలనే కాదు వారి సంస్కృతిని అంతమొందించటంలో అగ్రకుల వివక్ష లేకపోలేదు.మన దేశంలో అగ్రకులా లకే పరిమితమైన విద్య సామాన్యులకు, గిరిజన తెగలకు అందుబాటులోకి రాలేదు. జాతీయోద్యమ అనంతరం చాలాకాలం వరకు కూడా ప్రభుత్వం విద్యను బహుళవ్యాప్తిలోకి తేలేక పోయింది. తెచ్చినా, అది అంటరాని తనం వంటి అనేక సామాజిక రుగ్మత లతో సామాన్య ప్రజానీకానికి అందని సరుకైంది. మనుధర్మ వాసనలింకా విడువనినాటి పాలకుల కులం,మతం వివక్షల ఫలితంగా ‘బడి’ పేదవాడికి అక్షరదానం చేయటంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో మాతృభాషల సంర క్షణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురై ంది. యాభయ్యవ దశకం వరకూ కొందరి సొత్తే అయిన విద్య సాంస్కృతిక పునరుజ్జీ వనంలో భాగంగా గ్రంథా లయోద్యమాలు,పత్రికలు తదితర ఉద్యమాలు, సంస్థలు విశేష కృషి ఫలితంగా పంచా యితీలస్థాయిలో పాఠశాల విద్య మొగ్గతొడిగింది.పట్టణ,మైదాన ప్రాంతాలలో విద్య అందుబా టులోకి తెచ్చినట్టుగా దేశవ్యాప్తంగా వున్న వందలాది గిరిజన సంచార తెగల భాషలలో విద్య బోధించేందుకు ప్రత్యేక ప్రయత్నా లు మాత్రం సాగించ లేక పోయింది.

నేపాల్‌,‌బంగ్లాదేశ్‌ ‌వంటి దేశాలలో వందల సంఖ్యలో వున్న గిరిజన భాషల ఉనికి కోసం వారు ఎంచుకున్న మార్గం ప్రధానంగా ఆయా భాషలలో ప్రాథమిక స్థాయి విద్యాబోధనను ప్రభుత్వాలే బాధ్యతగా స్వీకరించటం. ఒకే ప్రాథమిక పాఠశాలలో 64కు మించి గిరిజన భాషలకు సంబంధించిన మాతృభాషావా చకాలు అక్కడి పిల్లలకు అందుబాటులో వున్నాయి. తరగతి వారీగా భాషకు సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానం మాత్రమే కాకుండా వారి సంస్కృతికి సంబంధించి అదనపు పఠనానికి కూడా పుస్తకాలు అందజేస్తున్నారు. 2007లో ఉమ్మడి తెలుగు రాష్ట్రం లో జరిగిన సర్వ శిక్షా అభియాన్‌ ‌గిరిజన బాలసాహిత్యం రాష్ట్ర స్థాయి వర్క్ ‌షాప్‌ ‌ను సందర్శించిన బంగ్లాదేశ్‌ ‌విద్యాశాఖ ప్రతినిధుల బృందం వారి వద్ద విజయవంతంగా అమలుచేస్తున్న మల్టీ లింగ్విస్టిక్‌ ,‌మల్టీ క్లాస్‌ ‌రూం పాఠశాలలు చేస్తున్న పనితీరును మన విద్యారంగ మేధావులు,ఉపాధ్యాయ బృందం తో పంచుకుంది. భారతదేశంలో మాతృభాషల సంరక్షణ పై సర్వే చేసిన ‘‘ది పీపుల్స్ ‌లింగ్విస్టిక్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియా’’ ప్రధానంగా గిరిజన,సంచార జాతులకు చెందిన తెగల వారి భాషలు అంతరించి పోవటంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.

వీటిలో వెయ్యి సంవత్సరాల నుండి మనుగడలో వున్న కొన్ని ప్రాచీన భాషలున్నాయి. ప్రస్తుతం దేశంలో సుమారు 780 భాషలు చెలామణిలో వుండగా రాబోయే ఐదుదశాబ్దాలలో 400 భాషలు అంతరించి పోయే ప్రమాదం పొంచి వుందని వారి సర్వేనివేదిక తెలియజేస్తున్నది.గత ఐదు దశాబ్దాల కాలంలో 250 గిరిజన,సంచార జాతులకు చెందిన భాషలు అంతరించిపోయా యని నివేదిక వెల్లడిస్తున్నది. భారత్‌లో ప్రజలు మాట్లాడుతున్న మొత్తం భాషలలో సగం భాషలు రాబోయే ఐదు దశాబ్దాల కాలంలో అంతరించి పోయేందుకు అవకాశాలున్నాయనే పి.ఎల్‌.ఎస్‌.ఎ ‌నివేదిక ఆందోళన కల్గిస్తున్నది.దాదాపు సగం భాషలు అంతరించి పోవటం అంటే ఆయాభాషలతో ముడిపడివున్న సంస్కృతి, సాంప్రదాయాలు,ఆచార వ్యవహారాలు,కళలు,జానపద సాహిత్యం అంతరించి పోవటమే. భారతదేశంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ,రాష్ట్రాల పరిధిలో గిరిజన సంక్షేమ శాఖలు అంతరించిపోతున్న భాషలను రక్షించేందుకు తమ వార్షిక బడ్జెట్లలో నిధులు మంజూరు పై చూపుతున్న నిర్లక్ష్యం కూడా కారణాల్లో ఒకటని భావించాలి.ప్రధానంగా 22 అధికార భాషల అభివృద్ధికి ఆయా భాషల సారస్వత పీఠాల ఏర్పాటు, గ్రంథాలయాల ఏర్పాటు, గ్రంథాల ముద్రణ,పాఠశాలలో ఆయా భాషల వాచకాల బోధనకు ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అంతరించి పోనున్న భాషలు గిరిజనులు,సంచార జాతులు, తెగలకు సంబంధించినవి కావటంతో ఈ విషయాన్ని అగ్ర కుల వర్గాలు పట్టించుకోవడంలేదన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది.

గిరిజనులు నివసించే అటవీ ప్రాంతాల్లో ఖనిజ సంపద తవ్వకాలకోసం ప్రభుత్వాలు గిరిజన గూడెంలపై సాగిస్తున్న జులుం మరో ప్రధాన కారణంగా చర్చించాల్సిందే! అక్కడ నివసించే ప్రజల మనుగడను చిన్నాభిన్నం చేస్తున్న తవ్వకాలకు సంబంధించి ప్రభు త్వ ఆదేశాలు,అనుమతులు అక్కడి ప్రజల జీవితాలను చెల్లాచెదురు చేస్తున్నాయి. ప్రభుత్వాలు బహుళ జాతి కంపెనీలతో కుమ్మక్కు కావటమే ఇందుకు ప్రధాన కారణమని ఆందోళనలు వెల్లు వెత్తుతున్నాయి.ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాల్లో నల్లమల,విశాఖలో గాలికొండ,ఛత్తీస్‌ఘడ్‌,‌బస్తార్‌ ‌వంటి అడవులు మాత్రమేకాదు, దేశవ్యాప్తంగా అనేక అటవీ ప్రాంతాలలోని గిరిజనుల జీవితంపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి.వారిని భయ భ్రాంతులను చేయటానికి నక్సల్స్ ‌సానుభూతి పరులుగాముద్ర వేయటం,పారామిలిటరీ బలగాలతో గూడెంలపై విరుచుక పడటం సాధారణమైతోంది.పిల్లలు,వృద్ధులపై దాడులు, మహిళలపై సామూహిక అత్యాచారాలు..! ఉదా:వాకపల్లి వంటివి.ఛత్తీస్‌ఘడ్‌ అటవీప్రాంతంలో అమాయక రైతులను కాల్చి చంపిన సంఘటనలు కోకొల్లలు.ఈ నేపథ్యంలో గిరిజనతెగల జీవితమే కల్లోలమై,భాష,సంస్కృతులు చెల్లాచెదురై మనుగడ కోల్పోతున్నాయి. మణిపూర్‌ ‌తదితర ఈశాన్యరాష్ట్రాల్లోనూ పరిస్థితులు ఇందుకు భిన్నంగా యేమీ లేవు.అక్కడ మనుగడలో వున్న అనేకభాషలు వాటి సంస్కృతులు ఈ అర శతాబ్దంలో కాలగర్భంలో కలిసిపోయాయి గిరిజన ప్రాంతాల్లో వారి భాషల్లో ప్రాథమిక పాఠశాలలు, సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు మ్యూజి యంలు,కళలు,సాహిత్యం,అటవీ ఉత్పత్తులు, వ్యవసాయం, ఔషధ వనరులు ఇవన్నీ అక్కడి భాషతో మమేకమై వుంటాయి.కారణాలు అనేకమైనా అస్తిత్వం ప్రశ్నార్థకమైన గిరిజన భాషలు,సంచార జాతుల,తెగల భాషలను కాపాడుకోవాలనే అవగాహన కలిగించేందుకు మాతృభాషల సంరక్షణ దినోత్సవం దోహద పడుతుందని ఆశిద్దాం.
– ఎలమంద

Leave a Reply