Take a fresh look at your lifestyle.

మొక్కలను.. చంటిపిల్లల్లా పెంచుదాం..!

Let's grow plants telangana harithaharamమానవాళికి స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం అందించడంతో పాటు, భూగర్భ జలాల సంరక్షణ, భూమి కోత, కర్బన ఉద్ఘారాల తగ్గింపు, వాతావరణ మార్పుల నియంత్రణలో మొక్క(అడవు)ల పాత్ర కీలకమని భావించారు. అలా ముందు చూపుతో మన దేశపు భూబాగంలో 33శాతం మేర అటవీ విస్తీర్ణాన్ని నిర్ధేశించినారు. ఆ లక్ష్యాల దశాబ్దాలు దాటినా చేరుకోలేకపోతున్నాము. కేంద్రం రాష్ట్రాలకు నిధుల విడుదలలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. మరో ప్రక్క పెరుగుతున్న జనాభా, పర్యావరణ, వాతావరణ కాలుష్యాన్ని నివారించుటకు మన దేశ భూబాగంలో మున్ముందు 50% మొక్కల పెంపకం చేయవలసి ఉందని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’కు ఐదేళ్లు పూర్తి అయినది. ప్రతి ఏటా నిర్వహిస్తున్న హరిత హారం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్ధేశించుకున్నప్పటికీ, 2015-16 నుండి 2019-2020 నాటికి అడవి బయట, లోపల కలిపి 177 కోట్ల మొక్కలు నాటినట్లు అధికారుల గణాంకాలు తెలుపుతున్నాయి. ఇందుకుగాను రూ।। 3,836 కోట్ల ఖర్చు చేసినట్లు తెలుపుతున్నారు. మన ముఖ్యమంత్రి తాను స్వయంగా ఈ పథకంపై సమీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ, అధికారుల నిర్లక్ష్యానికి, సిబ్బంది అలసత్యం జతకలిసి క్షేత్రస్థాయిలో ఆశించినంతగా ఫలితం రాలేదు. నాటిన మొక్కల్లో మూడింట రెండు వంతులకు పైగా ఎండిపోయినట్లు తెలుస్తుంది. క్రమం తప్పకుండా నీళ్ళు పోయడం, పశువుల మేకల నుంచి రక్షణ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం మూలంగా పచ్చదనం(హరితహారం) పథకంలో ఆశించినంతగా ఫలితాలు కనిపించడం లేదు. ఎన్ని మొక్కలు బతికాయన్న దానిపై స్పష్ట(ఖచ్చిత)మైన గణాంకాలు అధికారుల వద్ద లేవు. పంపిణీ చేసిన మొక్కలు, నాటిన మొక్కలు, క్షేత్రస్థాయిలో కనిపించే మొక్కలకు చాలా అంతరం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

ప్రజలు స్పందించిన చోట్ల స్థానిక సంస్థలు ప్రత్యేక దృష్టి పెట్టిన కొన్ని పట్టణ, గ్రామాల్లో మాత్రం ఆశించినంతగా పచ్చదనంతో చెట్లు పెరుగుతున్నాయి. ప్రత్యేకంగా గ్రామ పంచాయితీలలో దృష్టి పెడుతున్న కారణంగా గత నాలుగేళ్లతో పోలిస్తే, ఐదో విడత హరిత హారం మెరుగ్గా ఉంది. ముఖ్యమంత్రి అధికారుల, ప్రజా ప్రతినిధులపై కఠినంగా శాసన సభ వేదిక్షగా మాట్లాడడం వలన కొంత మెరుగైంది. కానీ రైతులు ఎక్కువగా కోరుకునే టేకు, ఎర్రచందనం లాంటి మొక్కల పంపిణీ జరగడం లేదు. ఇంటింటికి ఇచ్చే మొక్కలు ప్రజలు కోరుకునేవి కాకుండా నర్సరీలో ఉన్నవాటిని ఇవ్వడం జరుగుతుంది. హరితహారం పథకం గత ఐదేళ్లుగా పరిశీలిస్తే నాటుతున్న మొక్కల సంఖ్యతో క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నవి చూస్తే ఆశించిన లక్ష్యానికి చేరుకోలేక పోవచ్చునని, పచ్చదనం తగ్గిపోతుందని పాలకులు, ప్రజలు బెంగపడుతున్నారు. ఇదిలా ఉంటే నిర్వహణ సమస్యలతో పాటు నాటుతున్న మొక్కలు ఉంటే మొక్కలను పర్యవేక్షించడం అధికారులకు, సిబ్బందికి సవాల్‌గా మారుతుంది. 2019-20 సం।।లలో మొదట 100 కోట్ల మొక్కలు నాటాలని నిర్ధేశించుకుంటే… ఈ ఏడాది 37 కోట్ల మొక్కలు నాటినట్లు తెలుస్తుంది. ఒక గుడి కడితే హిందువులు వెళతారు. ఒక మసీదు కడితే ముస్లీంలు వెళతారు. ఒక చర్చి కడితే క్రైస్తవులు వెళతారు. అదే ఒక మొక్కనాటి వృక్షాన్ని చేస్తే… దాని నీడలోకి కుల, మత, జాతి భేదాలు లేకుండా సకల జీవజాతులతో పాటు మనుషులందరు దాని నీడలోకి చేరతారు.

ఆధునిక నాగరికత పేరుతో అడవులను నరికివేసి పరిశ్రమల స్థాపన చేస్తున్నారు. దానివల్ల ఆక్సిజన్‌ అం‌దించే అడవులు విషవాయువులకు నిలయంగా మారిపోతున్నాయి. అంతేకాదు పట్టణాల, నగరాల, మహానగరాల విస్తరణతో అభివృద్ధి మాటున చెట్లను నరికివేస్తూ, భూమి కనిపించకుండా చేస్తూ, చెట్లు లేని కాంక్రిట్‌ ‌జంగల్‌గా మారుస్తున్నారు. హరిత హారం హోరులో ఇప్పుడిప్పుడే అక్కడక్కడ మొక్కలు నాటుతున్నప్పటికీ, పెరిగిపోతున్న జనాభా, అందమైన ఆకాశహర్మ్యాల భ్రమలో కార్బన్‌డైఆక్సైడ్‌ ఉత్పత్తులు పెరిగిపోనున్నాయి. అంతేస్థాయిలో మొక్కలు నాటలేక నాటిన మొక్కలకు సంరక్షణ లేక, ఆశించిన స్థాయిలో మొక్కల పెంపకం జరగడం లేదు. కుటుంబంలో చంటిపిల్ల)ను చూసుకున్నట్లు, సామాజిక బాధ్యతతో మొక్కలను నాటాలి. నీరు పోసి పెంచాలి. రక్షణగా కంచెలు వేయాలి. తరిగిపోతున్న అడవుల రక్షణతో పాటు, ఎక్కువ విస్తీర్ణంలో బాగా అడవుల పెంపకం జరగాలి. అలా దట్టమైన అడవులు, వృక్షా•లతో దండిగా వర్షాలు కురవడంతో కరువు నుంచి విముక్తి లభిస్తుంది. స్వచ్ఛమైన ప్రాణవాయువుతో, ఆయురారోగ్యంతో సుభిక్షంగా సమాజం భాసిల్లుతుంది. చెట్లు నరకడం మానాలి. లేదంటే కాలుష్యం కోరల్లో సకల జీవరాసులు చిక్కుకుంటాయి. పర్యావరణాన్ని పదిలంగా రక్షించుకుంటూ ముందు తరాలకు భద్రంగా అందించాలని ప్రతి గ్రామంలో నర్సరీలను ఏర్పరచి, వివిధ రకాల మొక్కలు నీడనిచ్చే పండ్లు, పూలు, ఔషదాల మొక్కల లాంటివి పెంచుతున్నారు. తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో వెల్లివిరిసేలా… ముఖ్యమంత్రి కలలుగన్న హరిత తెలంగాణ ఏర్పాటులో లోపాలను సవరించుకొని రాజకీయాలకు అతీతంగా మనమందరం చేతులు క)పాలి. పచ్చదనంతో జగతిలో ఘనకీర్తిని చాటాలి. నిర్లక్ష్యాన్ని వీడాలి. దండుగా కదిలి, ఉద్యమంగా సాగాలి. నాటిన మొక్కలను జియో ట్యాగింగ్‌ ‌చేసి సంరక్షించాలి. మానవాళి బతుకుల్లో పచ్చదనం, చల్లదనంతో శోభాయమానంగా విరాజిల్లబడాలి. ఉద్గారాల నియంత్రణలో మొక్కల పెంపకం మాత్రమే ప్రధాన మార్గం. చెట్లను నరకడమంటే ‘‘తన వేలుతో తన కన్ను పొడుచుకున్నట్లే’’ అని మరువరాదు. సకల జీవకోటికి ప్రాణవాయువు స్వచ్ఛమైనదిగా అందేటట్లు చూడాలి… చెట్లు పెంచాలి.
– మేకిరి దామోదర్‌
‌వరంగల్‌,
‌సెల్‌: 9573666650

Tags: plant the trees, telangana haritahaaram, mekiri dhamodhar, pollution

Leave a Reply