ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి తన్నీరు హరీష్ రావు
రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీలో ఒకడిగా కార్యకర్తగా పని చేస్తానని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సోమవారం పటాన్ చెరు పట్టణంలో జీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతన పటాన్ చెరు, రామచంద్రాపురం, భారతీనగర్ డివిజన్ల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ..రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో కార్యకర్తలంతా కష్టపడి పనిచేసే కార్పొరేటర్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి కృషి చేయాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్కు చేసిన అభివృద్ధిని గడప గడపకు కార్యకర్తలు వెళ్లి ప్రచారం చేయాలని అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాలని పేర్కొన్నారు. 250 కోట్లతో పటాన్ చెరు, రామచంద్రాపురం, భారతీనగర్ డివిజన్లలోని ఇంటింటికీ నీళ్లు అందించామన్నారు. పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలో 24 గంటల కరెంట్ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీయే అని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో పవర్ హాలిడేతో పరిశ్రమలు మూత పడ్డాయని అన్నారు. స్థానిక యువత ఉపాధి కోసం ఐటీ, మెడికల్ సంస్థలను నెలకొల్పమని తెలిపారు. పటాన్చెరు, ఆర్.సి పురంలలో నూతనంగా మార్కెట్లు ఏర్పాటు చేశామన్నారు. అన్ని వర్గాల ప్రజల కోసం మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మించామని పేర్కొన్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలో నిర్మించిన 40 వేల డబుల్ బెడ్ ఇండ్లలో 10 శాతం స్థానికులకు కేటాయిస్తామన్నారు.