Take a fresh look at your lifestyle.

యుద్ధం చేద్దాం…

“సవాళ్ళను ఎదుర్కోవటం మానవాళికి కొత్త కాదు. దాదాపు ప్రతి వందేళ్లకు ఒకసారి ఏదో ఒక ఉపద్రవం పంజా విసురుతూనే ఉంది. కాస్త తడబడ్డా…మానని గాయాలు ఉన్నా, ధైర్యం కూడగట్టుకుని తిరిగి నిలబడుతూనే ఉన్నాం. 1720లో యూరప్‌ ‌ఖండంలో ప్రబలిన మార్సెల్లీ ప్లేగ్‌ ‌వ్యాధి ప్రపంచాన్ని వణికించింది. అప్పుడు లక్షలాది మంది ప్రాణాలు వదిలారు. 1820లో ఆసియా దేశాల్లో కలరా సవాలు విసిరింది. 1920లో ఆ పాత్రను స్పానిష్‌ ‌ఫ్లూ  పోషించింది. లక్షల సంఖ్యలో ప్రజలు బలయ్యారు. మన కళ్ళ ముందు కొరోనా గణాంకాలు ఉన్నాయి. ఇప్పటి వరకు నాలుగు లక్షలకు పైగా ఈ వైరస్‌ ‌బారిన పడితే మరణాల గ్రాఫ్‌ ‌రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఇవాల్టికి సుమారుగా 22వేల దగ్గర ఉంది ఈ సంఖ్య. లక్షల కోట్ల రూపాయలను ప్రపంచం ఖర్చు చేస్తోంది. అంత మాత్రాన గుండె ధైర్యాన్ని కోల్పోవలసిన అవసరం లేదు.”

pen drive rehanaకొరోనా లాక్‌ ‌డౌన్‌ ‌చూస్తుంటే నాకో విషయం గుర్తుకు వస్తోంది. ఈ మధ్య నేనో పుస్తకం చదివాను. ప్రపంచ పటంలో ఓ చిన్న దేశం కిర్గిస్థాన్‌ ‌రచయిత చింగీజ్‌ ఐత్‌మాతోవ్‌ ‌రాసిన అద్భుతమైన నవల మదర్‌ ఎర్త్. ‌రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్‌ ‌రష్యా పరిధిలోని ఓ మారుమూల గ్రామం నవల భూమిక. ఆ ఊర్లో వయస్సులో ఉన్న ప్రతి వ్యక్తి నిర్బంధంగా యుద్ధంలో పాల్గొనాల్సిన వస్తుంది. వృద్ధులు, చిన్న పిల్లలు, మహిళలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. ఒక రకంగా మినహాయింపు అని కూడా అనలేం. వీరు చేయాల్సిన పని సమూహ పొలాల్లో పంట పండించి యుద్ధ వీరులకు పంపాలి. వీరికి తిండి గింజలు లేని సందర్భంలో యుద్ధ క్షేత్రంలో ఉన్న వారికి కడుపు నింపే బాధ్యత వీరిదే. గాయపడిన వారికి చికిత్స అందించటానికి ఇలా ఊర్లలో ఉండిపోయిన యువతులు పని చేయాల్సి ఉంటుంది. సరిగ్గా చెప్పాలంటే ఆ ఊర్లో అయితే ప్రత్యక్ష యుద్ధ క్షేత్రంలో శత్రువుతో పోరాడటం లేదా పోరాడుతున్న వారికి సపోర్ట్ ‌సిస్టమ్‌గా వ్యవహరించటం. ఇప్పుడు కరోనా వైరస్‌పై మనం చేస్తున్న పోరాటం దీనికి తక్కువేం కాదు అనిపిస్తుంది. కంటికి కనిపించనంత సూక్ష్మ జీవే కావచ్చు…కాని ఇవాళ యావత్‌ ‌ప్రపంచాన్ని వణికిస్తోంది. లక్షలాది మంది వైరస్‌ ‌బారిన పడ్డారు. వేలాది మంది ప్రాణాలు బలయ్యాయి. ఇంకా ఎంత కాలమో, ఎంత మందో తెలియని ఆందోళనకర స్థితి నుంచి మనం ప్రయాణం చేస్తున్నాం.

సమాజమే సపోర్ట్ ‌సిస్టమ్‌:
‌గతంలో చరిత్ర పుస్తకాల్లో చదువుకున్న జ్ఞాపకమే. హైదరాబాద్‌లో ప్లేగ్‌ ‌వ్యాధి వచ్చింది…ఇన్ని వేల మంది చనిపోయారు, లేదా ఫలానా దేశంలో ఫలానా వైరస్‌ ‌ప్రబలింది…ఇన్ని లక్షల మంది చనిపోయారు వంటి అంశాలు. కాని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. నేనే కాదు బహుశా ఇప్పుడు ఈ భూమ్మీద ఉన్న అందరికి ఓ మహమ్మరి శరవేగంగా ప్రబలుతున్న తీరును చూడటం మొదటి సారి కావచ్చు. మీడియా ప్రతినిధులు ఉండి ఉండి వాట్సప్‌లు చెక్‌ ‌చేసుకోవటమే. కరోనా గణాంకాల కోసం. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఇంకా ఎంత మందికి వచ్చింది? ఎంత మంది చనిపోయారు, ప్రముఖులు ఎవరు? లాక్‌డౌన్‌ ఎలా సాగుతోంది ఇలా…ఒకటే అంశం. అత్యవసరం అయితే తప్పించి వైద్యులు కరోనా చికిత్సకే పరిమితం అయ్యారు. పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం, విధానాలు, ప్రభుత్వ పెద్దల ప్రకటనలు అన్నీ ఒకే ఒక్క అంశం చుట్టూనే తిరుగుతున్నాయి. అన్ని దేశాల్లో ఇదే పరిస్థితి. నిరుద్యోగం, పేదరికం, అవినీతి, ఆర్ధిక ఒడుదొడుకులు, రాజకీయాలు, జెండాలు, అజెండాలు అన్నీ పక్కకు వెళ్లాయి. ఇప్పుడు మానవాళి ముందు ఉన్న ఏకైక లక్ష్యం కరోనా మహమ్మరిని అంతం చేయటం. మానవ మనుగడను కాపాడుకోవటం. వైద్య సిబ్బంది ప్రత్యక్షంగా వైరస్‌ ‌పై పోరాటం చేస్తున్నా మిగిలిన సమాజం సపోర్ట్ ‌సిస్టమ్‌గా నిలబడి ఉంది. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించటం, వైరస్‌ ‌వ్యాపించకుండా తమ వంతు సహకారం అందించటం ఈ దశలో కీలకమైంది.

ప్రస్తుతం మనం రెండో దశలో ఉన్నాం. మొదటి దశలో ఇతర దేశాల్లో ప్రయాణించి అక్కడ వైరస్‌ ‌బారిన పడి తిరిగి దేశానికి రావటం. వీరిని గుర్తించటం, పరీక్షించటం, వైద్యం అందించటం కొంత తేలికే. అయితే వీరు కొరోనా లక్షణాలు బయటపడక ముందు బయటి వాతావరణంలో తిరిగితే వారి నుంచి మరి కొంత మంది కరోనా బారిన పడే అవకాశాలుంటాయి. ఇది రెండో దశ. ఒక వ్యక్తి ఎంత మందితో కాంటాక్ట్‌లోకి వెళ్లారు అనే లెక్కలు తీయటం కష్టమే అయినా అసాధ్యం కాదు. ఈ దశ కీలకమైంది. మొదటి దశలోనే ఆపగలిగితే ఇంత ఆందోళనకర పరిస్థితులు ఉత్పన్నం అయ్యేవి కావు. కాని ప్రపంచంలోనే రెండో అతి ఎక్కువ జనాభా ఉన్న మన దేశంలో అంత తేలిక కాదు. అయితే కనీసం ఇప్పుడైనా, ప్రమాదపుటంచుల్లో ఉన్న ఈ తరుణంలో అయినా మనం అందరం కలిసికట్టుగా యుద్ధం చేయాల్సిందే. లేదంటే కమ్యూనిటీ స్ప్రెడ్‌లోకి వెళ్లిపోతాం. ఈ మూడో దశలో వైరస్‌ ఎవరి నుంచి ఎవరికి ప్రబలుతుందో అంచనా వేయలేం. ఎవరిలో వైరస్‌ ‌దాగి ఉందో, ఎటు నుంచి దాడి చేస్తుందో ఊహించలేం. లెక్కలేనంత మంది వైరస్‌ ‌బారిన పడితే వైద్య రంగంపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఆ స్థాయిలో వైద్య సిబ్బంది, సదుపాయాలు మనకు లేవు. సాధ్యమూ కాదు. నిశ్చహాయంగా ఓటమిని అంగీకరించటం మినహా మరోమార్గం ఉండదు. మనం ఈ విపత్తు ముంగిట నిలబడి ఉన్నాం కనుకనే కేంద్రం ప్రస్తుతానికి 21 రోజుల లాక్‌డౌన్‌ ‌ప్రకటించింది. పరిస్థితిని సమీక్షించి తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతానికి అయితే కొరోనా కట్టడికి మే నెలాఖరు వరకు సమయం పడుతుందన్న ప్రచారం జరుగుతోంది. దీనికి మనం మానసికంగా సిద్ధపడాలి.

సవాళ్ళకు ఎదురొడ్డుదాం…
సవాళ్ళను ఎదుర్కోవటం మానవాళికి కొత్త కాదు. దాదాపు ప్రతి వందేళ్లకు ఒకసారి ఏదో ఒక ఉపద్రవం పంజా విసురుతూనే ఉంది. కాస్త తడబడ్డా…మానని గాయాలు ఉన్నా, ధైర్యం కూడగట్టుకుని తిరిగి నిలబడుతూనే ఉన్నాం. 1720లో యూరప్‌ ‌ఖండంలో ప్రబలిన మార్సెల్లీ ప్లేగ్‌ ‌వ్యాధి ప్రపంచాన్ని వణికించింది. అప్పుడు లక్షలాది మంది ప్రాణాలు వదిలారు. 1820లో ఆసియా దేశాల్లో కలరా సవాలు విసిరింది. 1920లో ఆ పాత్రను స్పానిష్‌ ‌ఫ్లూ పోషించింది. లక్షల సంఖ్యలో ప్రజలు బలయ్యారు. మన కళ్ళ ముందు కొరోనా గణాంకాలు ఉన్నాయి. ఇప్పటి వరకు నాలుగు లక్షలకు పైగా ఈ వైరస్‌ ‌బారిన పడితే మరణాల గ్రాఫ్‌ ‌రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఇవాల్టికి సుమారుగా 22వేల దగ్గర ఉంది ఈ సంఖ్య. లక్షల కోట్ల రూపాయలను ప్రపంచం ఖర్చు చేస్తోంది. అంత మాత్రాన గుండె ధైర్యాన్ని కోల్పోవలసిన అవసరం లేదు. వైరస్‌ ‌పుట్టుకకు ఎపిక్‌ ‌సెంటర్‌ ‌వుహాన్‌ ‌నగరమే తేరుకుంది. వందల శవపేటికలు ఆ నగర వీధుల గుండా సాగి ఉంటాయి. వేలాది మంది తమ వారి కోసం గుండెలు అవిసేలా రోదించి ఉంటారు. అయినా వారిప్పుడు సాంత్వన పొందుతున్నారు.

నెలల పాటు సొంతిళ్లను, సొంత వారిని వదిలి తమ ప్రాణాలు పణంగా పెట్టి బాధితులకు చికిత్స అందించటానికి, ఈ మహమ్మారిని తరిమి కొట్టడానికి కృషి చేసిన వైద్య సిబ్బంది అందరికీ వుహాన్‌ ‌నగరం సాల్యూట్‌ ‌చేసింది. ఓ స్పూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అంటే కచ్చితంగా ఈ దశ నుంచి మనం కూడా బయటపడతాం. అంత వరకు మనం ఆత్మస్థైర్యంతో ఉండాలి. అంతే కాదు ఈ క్లిష్ట సమయాన్ని అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయాలి. బలహీనమైపోతున్న బంధాలను బలోపేతం చేసుకునేందుకు ఉపయోగించుకోవాలి. మనలోకి మనం ప్రయాణం చేయాలి. మనల్ని మనం కొత్త్గగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. కులాలు, మతాలు, వర్గాలు, వైషమ్యాలు లేని ఓ విశాల మానవీయ ప్రపంచాన్ని ఆవిష్కరించుకునేందుకు ముందుకు సాగుదాం. మనిషికి మనిషే అండ. మనిషికి మనిషే భరోసా.

Leave a Reply