- ఓరోజు వెనక్కు పోయిన కేంద్రం
- చర్చలకు రావాల్సిందిగా రైతులకు ఆహ్వానం
న్యూఢిల్లీ,డిసెంబర్28: వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న రైతులను కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. డిసెంబర్ 30న చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానం పలికింది. డిసెంబర్ 30న మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్ భవన్లో చర్చలకు రావాల్సిందిగా కోరింది. నెల రోజులకు పైగా ఆందోళన చేస్తున్న రైతులు తాము చర్చలకు సిద్ధమని ప్రకటించారు. డిసెంబర్ 29న చర్చలు జరపాలని కోరారు. వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయడమే ప్రధాన ఎజెండాగా ఉండాలని స్పష్టం చేశారు. అయితే, కేంద్రం డిసెంబర్ 30న మధ్యాహ్నం 2 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. రైతులతో చర్చల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం కానున్నారు. రైతుల ఇష్యూపై చర్చించనున్నారు.
మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు భారీ టెంట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. తమకు మద్దతిచ్చే వారి సంఖ్య పెరుగుతోంది కాబట్టి, అందుకు అనుగుణంగా కొత్త టెంట్లు వేస్తున్నారు. తాజాగా, సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే కూడా రైతులకు మద్దతు ప్రకటించారు. రైతుల ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోకపోతే తాను జనవరి చివరిలో నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు. ఇదే తన చివరి నిరసన అవుతుందని కూడా హెచ్చరించారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌లోని రాలేగాం సిద్ధిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను గత మూడేళ్లుగా రైతుల కోసం ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నామని చెప్పారు. అయితే, రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు.
‘ప్రభుత్వం కేవలం ఉత్తుత్తి హామీలు ఇస్తోంది. అందుకే వారి మీద నాకు నమ్మకం పోయింది. ఇప్పుడైనా కేంద్రం ఏం చేస్తుందో చూడాలి. వారు నెల రోజులు సమయం అడిగారు. అందుకే వారికి జనవరి చివరి వరకు అవకాశం ఇచ్చా. రైతుల డిమాండ్లు నెరవేరకపోతే నేను నిరాహార దీక్షకు కూర్చుంటా. అదే నా చివరి నిరసన అవుతుంది.’ అని 83 ఏళ్ల అన్నా హజారే అన్నారు.మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 100వ కిసాన్ రైలును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. మహారాష్ట్రలోని సంగోలా నుంచి పశ్చిమబెంగాల్ లోని షాలీమార్ వరకు ఈ రైలు నడుస్తుంది. ఈ సందర్భంగా మోదీ దేశంలో రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆగస్టులో మొదలైన కిసాన్ రైలు ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. పశ్చిమ బెంగాల్లో మత్స్యకారులకు కూడా ఇది లాభదాయకంగా ఉంటుందన్నారు. కిసాన్ రైలు అంటే అది కదిలే కోల్డ్ స్టోరేజ్‌గా ప్రధాని మోదీ అభివర్ణించారు.