Take a fresh look at your lifestyle.

బలవంతులు గా బ్రతుకుదాం ..!

“‘ నిరంతరం పరివర్తన చెందే కరోనా వైరస్ నుండి మనం హెర్డ్  ఇమ్మ్యూనిటి సాధించినా..ఈ హెర్డ్ ఇమ్మ్యూనిటి ఎక్కువ కాలం పనికి రాదు. ప్రస్తుత కరొన కోసం హెర్డ్  ఇమ్మ్యూనిటి తయారు చేసిన ఆయా యాంటీబాడీ కొన్ని నెలల్లో పాతబడి పోయి పనికిరాదు. ఎందుకంటే కొత్త కరోనా వైరస్ మన నెత్తి మీద కూర్చుని ఉంటుంది.. అప్పుడు మళ్ళీ మొత్తం చక్రం కొత్తగా ప్రారంభించాలి. సో ఇందు మూలంగా  చెప్పొచ్చేది ఏమంటే ప్రకృతిని నాశనం చేసే ఉత్పత్తి విధానము ఆగిపోతే.. అడవులు, ఇతర జీవ జంతువులు పెరుగుతాయి.. ప్రకృతి పెరిగితే.. కరోనా వైరస్ కు ఇతర జీవాల శరీరం ఇల్లుగా దొరుకుతుంది..అప్పుడు ! మనుషులం.. మనుషులుగా బ్రతకగలుగుతాం.. లేకపోతె ‘బలహీనులు చావాలి.. బలవంతులు బతకాలి..’ అనే అటవీ న్యాయ సూత్రంతో కాంక్రీట్ జంగిల్ లో సమాధి అయిపోతాం..!  ‘”

aruna
అరుణ ,జర్నలిస్టు ,న్యూ దిల్లీ

‘హెర్డ్ ఇమ్మ్యూనిటి’ ఈ పదాన్ని తెలుగు లో “ప్రజా సమూహం రోగనిరోధక శక్తి కలిగి ఉండటం” అంటాం . హెర్డ్ ఇమ్మ్యూనిటి ఎలా పని చేస్తుంది..? ఇది అర్ధం చేసుకోవాలి అంటే ముందు..రోగనిరోధక శక్తి ఎలా పనిచేస్తుంది..? అనేది అర్ధం చేసుకోవాలి. రోగనిరోధక శక్తి అంటే..శరీరంలో వందలాది కాంబినేషన్లలో డజన్ల కొద్దీ కదిలే కణాల ప్రక్రియ. ఇది చాలా కష్టమైన ప్రక్రియ. దీనికి సంబంధించి కొన్ని ఫండమెంటల్స్ అర్ధం చేసుకోవాలి .. శరీరానికి అవసరంలేని ఏదైనా ఒక చొరబాటు శత్రువు బ్యాక్టీరియా..వైరస్ల రూపంలో శరీరంలోకి జొరబడితే.. అది శరీరానికి సంబంధించింది కాకపోవటం వలన ఆ చొరబాటు శత్రువు శరీరాన్ని బాధించడం ప్రారంభిస్తుంది. (శరీరంలోకి ప్రవేశించే చొరబాటు దార్లని మనం బ్యాక్టీరియా..వైరస్లలు అని పేరు పెట్టుకున్నాం.) మనం నిత్యం వందల మిలియన్ల బ్యాక్టీరియా..వైరస్లతో జీవిస్తున్నాం. బ్యాక్టీరియా..వైరస్లలు మనచుట్టూ ఉండనే ఉంటాయి. వాటిపై మన శరీరం ఆధిపత్యం కొనసాగిస్తున్నప్పుడు మనం బతికి బ్యాక్టీరియా..వైరస్లలు ఓటమి చూస్తుంటాయి.

బ్యాక్టీరియా..వైరస్ల నుంచి మనల్ని రక్షించే మన తోలి రక్షక భటుడు, మన చర్మం. చర్మం మనల్ని రోగం నుంచి కాపాడే రక్షణ రేఖగా పని చేస్తుంది. ఈ రక్షణ రేఖ ఉల్లంఘనకి గురి అయినప్పుడు సమస్య మొదలవుతుంది. ఇప్పుడు శరీర రక్షణ వ్యవస్థ రెండవ దశ మొదలు అవుతుంది. శరీరాన్ని కాపాడే ఈ దశలో మాక్రోఫేజెస్ అని పిలువబడే రక్షణ కణాలు రంగంలోకి దిగుతాయి. మాక్రోఫేజెస్ కణాలు మన శరీరంలో ఉన్న ఒకానొక బ్రహ్మాండమైన కణాలు. ఇవి కరోనా వైరస్ వైరియన్ కంటే దాదాపు 100 రెట్లు ఎక్కువగా వున్నాయి.ఇవి విపరీతమైన తిండిపోతు కణాలు. అందుకే ఒక్కొక్క కణం బయటనుంచి శరీరంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియా..వైరస్లనే శత్రువులను 100 శాతం మింగివేయ ప్రయత్నించి మనల్ని గెలిపిస్తాయి. ఈ కణాలు తమ పనిని సులభతరం చేసుకోవడానికి శరీరం మీద ఎక్కడైతే దండయాత్ర జరిగిందో.. ఆ ప్రదేశంలో ఎక్కువ నీటిని విడుదల చేయడానికి సమీపంలోని రక్త నాళాలను ప్రేరేపిస్తాయి. తత్ఫలితంగా మనకి శరీరం మండినట్టుగా అవగతం అవుతుంది. మాక్రోఫేజెస్ కణాలు చాలా కాలం పోరాటం చేసినాక కూడా ఓడిపోతే, అప్పుడు శరీరంలో మూడవ రక్షణ దశ మొదలు అవుతుంది. మూడవ దశ యుద్ధంలోకి న్యూట్రోఫిల్స్ అనే కణాలు దిగుతాయి. ఈ కణాలు విచక్షణ రహిత కణాలుగా ఉండి.. నిజమైన హంతకులుగా పోరాటంలోకి దిగుతాయి.న్యూట్రోఫిల్స్ కణాలు బ్యాక్టీరియా..వైరస్లతో పాటు ఆరోగ్యకరమైన కణాలను కూడా విడిచిపెట్టకుండా విచక్షణారహితంగా చంపేస్తాయి. అందుకే ఈ కణాలు ఐదు రోజుల తర్వాత స్వీయ-వినాశనానికి కూడా గురయితాయి..

ఇక చివరి నాల్గవ దశ లో శరీర రక్షణ యుద్ధం మొదలు అవుతుంది.ఈ దశలో మెదడు డెన్డ్రిటిక్ కణాలను రంగంలోకి దింపుతుంది. న్యూట్రోఫిల్స్ కణాలు అలసటను సూచించి.. సన్నగిల్లినప్పుడు చివరిగా డెన్డ్రిటిక్ కణాలు శరీరంలోకి చొరబడిన బయటి శత్రువు నమూనాలను ఎంచుకొని వాటికి సమీపంగా శరీరంలో ఉన్న లింఫ్ గ్రంథుల దగ్గరకు బ్యాక్టీరియా..వైరస్ల నమూనాలను తీసుకుపోయి.. ఈ శత్రువుని చంపే ప్రత్యేకమైన ఆయుధాలు తయారు చేయి అని చెబుతుంది. శరీరం ఈ ఆయుధాలు తయారు చేయటానికి ఒకటి లేదా రెండు రోజులు తీసుకుంటుంది. లింఫ్ గ్రంథులలోకి బ్యాక్టీరియా..వైరస్లనమూనాలు చేరి వేచి వుండే ప్రక్రియ జరిగేటప్పుడు, బ్యాక్టీరియా..వైరస్ల నమూనాలను చంపేసే ప్రక్రియను బిలియన్ల సమూహంలో ‘టి కణాలు’ మొదలు పెడతాయి. ఈ ‘టి’ కణాలకు బ్యాక్టీరియా..వైరస్ల నమూనాలకు మధ్య మధ్య భీకర పోరు జరుగుతుంది. అందుకే లింఫ్ గ్రంథులలో పోరాటం జరిగేటప్పడు ప్రతి నలుగురిలో ఒకరు మాత్రమే సజీవంగా బయటకు వస్తారు. ‘టి’ కణాలు పుట్టుకతోనే కఠినమైన శిక్షణ పొంది ఉంటాయి. తన దగ్గరకు వచ్చిన బ్యాక్టీరియా..వైరస్ల నమూనాలకు వ్యతిరేకంగా డెన్డ్రిటిక్ కణాలతో కలిసి టి కణాలను పని పకడ్బందీగా ప్రారంభిస్తాయి. శరీరాన్ని కాపాడే రోగనిరోధక యుద్ధం బాగా చేయటానికి ‘టి’ కణాలు ముందుగా తమని తాము వేగంగా విభజించుకుంటాయి. అటుపై లింఫ్ గ్రంథులలో కొన్ని ‘టి’ కణాలు ‘మెమరీ టి కణాలుగా’ కొనసాగుతూ.. మరికొన్ని కొన్ని ‘టి’ కణాలు రోగనిరోధక యుద్ధం చేయటానికి శరీరంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియా..వైరస్లు ఉన్న ప్రదేశానికి ప్రయాణిస్తాయి. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడే మరో సమూహం ‘టి’ కణాలు, లింఫ్ గ్రంథులలో ‘వర్జిన్ బి కణాలను’ వెతుకుతాయి. శరీరంలో వుండే ఈ ‘బి’ కణాలను బాక్టీరియా వైరస్ శత్రువుపై పోరాడే ప్రతిరోధక ఆయుధాలు ఉత్పత్తి చేయడానికి ఉన్న ప్రత్యేక కణాలు. ‘టి’ కణాలు ఇచ్చిన సూచనలు అందుకున్న ‘బి’ కణాలు మిలియన్ల ప్రతిరోధక ఆయుధాలు తీసుకుని శరీరంలో జరిగే రక్తప్రవాహంలోకి వదులుతాయి.. దీనితో శరీరంలోకి బాక్టీరియా.. వైరస్.. అనే చొరబాటు శత్రువును శరీరం బాహ్య ఉపరితలాలకు మించి శరీరంలోకి చొరబడకుండా తాళాలు పడతాయి. ‘బి’ కణాలు ఇక్కడితో తమ పని ఆపకుండా మాక్రోఫేజ్‌ కణాలకు సంకేతాలు పంపి.. బాక్టీరియా వైరస్ చొరబాటు గుర్తించమని చెప్పి.. అటుపై శత్రువుని మింగేయమని మాక్రోఫేజ్‌ కణాలకు ఆదేశిస్తాయి.ఇలా నాలుగో దశ ఉద్వేగంగా కొనసాగుతుంది.

చరమాంకంలో ఈ మొత్తం రోగనిరోధక యుద్ధం ముగిసిన వెంటనే, ఆరోగ్యకరమైన కణాలకు మరింత నష్టం జరగకుండా ఉండటానికి అన్ని ‘టి కిల్లర్ కణాలు’ శరీరంలో మిగలకుండా ఆత్మహత్య చేసుకుంటాయి. అయితే కొన్ని ‘టి’ కణాలు మాత్రం శరీరంలో గప్ చుప్ గా కొనసాగుతాయి. ఇవి ‘మెమరీ హెల్పర్ టి కణాలుగా’.. లేదా మెమరీ బి కణాలుగా కొనసాగుతాయి. ఎందుకంటే మళ్ళీ బాక్టీరియా.. వైరస్ అనే చొరబాటుదారు శత్రువు శరీరాన్ని తాకినట్లయితే.. కీలకమైన సమయాన్ని ఆదా చేస్తూ.. బాక్టీరియా.. వైరస్ శత్రువుని చంపేసే యాంటీబాడీని వెంటనే ఉత్పత్తి చేయటానికి మెమరీ హెల్పర్ టి కణాలు రూపాంతరం చెందిన “మెమరీ బి కణాలు” గా కొనసాగుతాయి. ఈ ప్రక్రియలో మానవ జాతి చవి చూసే ఏకైక సమస్య “సమయం”. ఈ అన్ని ప్రక్రియలు సకాలంలో జరగాలి అప్పుడే మనుషులు బాక్టీరియా..వైరస్ ముందు విజేతలు అవుతారు. ఈ మొత్తం ప్రాసెస్ ని మనం సింపుల్ గా “రోగనిరోధక శక్తి” అని ముద్దుగా పిలుచుకుంటాం..

ఇప్పుడు హెర్డ్ ఇమ్మ్యూనిటి సంగతి చూద్దాం..
ప్రజల సమూహానికి రోగనిరోధక శక్తి కలిగి ఉండటాన్ని హెర్డ్ ఇమ్మ్యూనిటి అంటాం. అంటే ఓ మనిషి చుట్టుపక్కల ప్రతిఒక్కరూ రోగనిరోధక శక్తిని కలిగి ఉండటం ద్వారా, సాటి మనిషికి రోగనిరోధక శక్తి అందిస్తే దాన్ని హెర్డ్ ఇమ్మ్యూనిటి అని అంటాం.. మరి ఎంత మంది ప్రజా సమూహానికి రోగనిరోధక శక్తి కలిగి ఉండటాన్ని హెర్డ్ ఇమ్మ్యూనిటి అంటాం..? ప్రశ్నకి సమాధానం వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తుందో.. తెలిపే డాటాలో ఉంటుంది. వైరస్ వ్యాప్తి రేటును Ro విలువగా సూచిస్తారు. Ro అనేది ఒక మాథమెటికల్ పదం. ఈ Ro రేటు ప్రాథమికంగా ఒక వైరస్ సోకిన వ్యక్తి నుంచి ఎంత మంది ఇతర వ్యక్తులకి వైరస్ సంక్రమించేది తెలుపుతుంది. కరోనావైరస్ భారత్ కి వచ్చాక మన దేశంలో Ro రేటు 1.22. దీని అర్థం, ఒక కరోనావైరస్ సోకిన వ్యక్తి వైరస్ క్యారియర్ సగటున 1.22 మంది వ్యక్తులకు భారత్ లో కరోనాను సోకించ గలడు. మన భారత దేశ Ro రేటు ప్రకారం.. మనం కోవిడ్ -19ని ఎదుర్కోవాలి అంటే 18% భారతీయులు అంటే సుమారు 20 కోట్లకి పైగా ప్రజా సమూహానికి రోగనిరోధక శక్తి ఉండాలి. ఇలా ఉంటే మన దేశంలో హెర్డ్ ఇమ్మ్యూనిటి సాధించినట్టే..

20 కోట్లకి పైగా భారతీయ ప్రజా సమూహానికి రోగనిరోధక శక్తి ఉందా..? భారత్ లో హెర్డ్ ఇమ్మ్యూనిటి సాధించాలి అనుకోవటం సబబేనా..?
కరోనాకి వాక్సిన్ లేదు. కనుక మనం వింటున్న ఏకైక ప్రత్యామ్నాయం “సామూహిక రోగనిరోధక శక్తి సాధించటం”. ఇది సాధించాలి అంటే అనేక సమస్యలు ఉన్నాయి. మొదటిది అధిక మరణాలు సంభవిస్తాయి. దీన్ని మనం స్వీకరించగలమా..? వైరస్ వ్యాప్తి భారత్ లో రోజు రోజుకు పెరుగుతున్నది. దీని వలన Ro రేటు మారిపోతున్నది. అయినా కానీ ప్రస్తుత Ro రేటు ప్రకారం పరిశీలిద్దాం. భారతదేశంలో కోవిడ్ -19 ధృవీకరించబడిన ప్రతి 100 మందిలో ఐదుగురు కోవిడ్ -19 రోగులు చనిపోతున్నారు. ఈ లెక్కను ఆధారంగా తీసుకుంటే, 26.3 కోట్ల భారతీయులకు వైరస్ సోకి.. వారిలో 1.3 కోట్ల ప్రజలు మరణిస్తే.. మనం 25 కోట్ల భారతీయులలో హార్డ్ ఇమ్మ్యూనిటి చూడగలం. పోనీ 1.3 కోట్ల దేశ ప్రజలు కరోనాకి బలి ఇద్దామనుకున్నా.. కూడా హెర్డ్ ఇమ్మ్యూనిటి సాదించాలి అన్న ఆలోచన మంచిదా..? ఈ ఆలోచన వ్యర్థం మాత్రమే కాదు ఆటవికం అని చెప్పక తప్పదు. ఎందుకంటే కరోనా వైరస్లు చాలా వేగంగా పరివర్తన చెందుతాయని మనకు తెలుసు. కనుక నిరంతరం పరివర్తన చెందే కరోనా వైరస్ నుండి మనం హెర్డ్ ఇమ్మ్యూనిటి సాధించినా..ఈ హెర్డ్ ఇమ్మ్యూనిటి ఎక్కువ కాలం పనికి రాదు. ప్రస్తుత కరొన కోసం హెర్డ్ ఇమ్మ్యూనిటి తయారు చేసిన ఆయా యాంటీబాడీ కొన్ని నెలల్లో పాతబడి పోయి పనికిరాదు. ఎందుకంటే కొత్త కరోనా వైరస్ మన నెత్తి మీద కూర్చుని ఉంటుంది.. అప్పుడు మళ్ళీ మొత్తం చక్రం కొత్తగా ప్రారంభించాలి. సో ఇందు మూలంగా చెప్పొచ్చేది ఏమంటే ప్రకృతిని నాశనం చేసే ఉత్పత్తి విధానము ఆగిపోతే.. అడవులు, ఇతర జీవ జంతువులు పెరుగుతాయి.. ప్రకృతి పెరిగితే.. కరోనా వైరస్ కు ఇతర జీవాల శరీరం ఇల్లుగా దొరుకుతుంది..అప్పుడు ! మనుషులం.. మనుషులుగా బ్రతకగలుగుతాం.. లేకపోతె ‘బలహీనులు చావాలి.. బలవంతులు బతకాలి..’ అనే అటవీ న్యాయ సూత్రంతో కాంక్రీట్ జంగిల్ లో సమాధి అయిపోతాం..

అరుణ ,జర్నలిస్ట్ ,న్యూ దిల్లీ

Leave a Reply