Take a fresh look at your lifestyle.

కొరోనా అనుభవాలతో పాఠాలు నేర్చుకోవాలి

“కొరోనా అనుభవాలు మనకు పాఠం నేర్పాయి. దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉంది. వైద్య రంగంలో భవిష్యత్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో విజనరీతో ఆలోచించాలి సమగ్ర వైద్య సదుపాయాల కోసం ప్రణాళిక వేయాలి, కేంద్రాలు, రాష్ట్రాలు కలిసి ఈ ప్రణాళిక అమలు చేయాలి. గతంలో మనకు కొరోనా లాంటి అనుభవం లేదు. ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ..!”

             -ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 
  • దేశంలో వైద్య సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించండి
  • జనాభా నిష్పత్తి మేరకు వైద్య కళాశాలలు ఉండాలి
  • వైద్య రంగంలో కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలి
  • ప్రధాని మోడీతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్‌

‌కొరోనా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని దేశంలో వైద్య సదుపాయాలు పెంచే విషయంపై దృష్టి సారించాలని సీఎం కె.చంద్రశేఖరరావు సూచించారు. దేశంలో వైద్య సదుపాయాలను పెంచాల్సిన అవసరాన్ని కొరోనా మనకు గుర్తు చేసిందని అభిప్రాయపడ్డారు. వైద్య రంగంలో భవిష్యత్తు కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో విజనరీతో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాలలో కొరోనా పరిస్థితులు, నివారణకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ప్రగతి భవన్‌ ‌నుంచి వైద్య ,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ‌సీఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌, ‌ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ ‌శర్మ, డీజీపీ మహేందర్‌రెడ్డి, వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి, వైద్య శాఖ విభాగాధిపతులు శ్రీనివాసరావు, రమేశ్‌ ‌రెడ్డి, గంగాధర్‌, ‌కరుణాకర్‌రెడ్డితో కలసి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ‌మాట్లాడుతూ కొరోనా అనుభవాలు మనకు పాఠాలు నేర్పాయనీ, గతంలో మనకు ఇలాంటి అనుభవం లేదనీ, ఈ పరిస్థితి ఇంకెన్నాళ్లు ఉంటుందో తెలియదని పేర్కొన్నారు.

దీన్ని ఎదుర్కుంటూనే ఇలాంటి పరిస్థితులు వస్తే భవిష్యత్తులో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే విషయంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. గతంలో కూడా అనేక వైరస్‌లు ప్రజలను ఇబ్బంది పెట్టాయనీ, కొరోనా వైరస్‌ ‌లాంటివి భవిష్యత్తులోనూ వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ఏ విపత్కర పరిస్థితినైనా తట్టుకునే విధంగా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలో జనాభా నిష్పత్తి ప్రకారం ఎంత మంది వైద్యులు ఉండాలి ? ఇంకా ఎన్ని వైద్య కళాశాలలు ఉండాలి ? వంటి విషయాలను ఆలోచించాలన్నారు. ఐఎంఎ వంటి సంస్థలతో సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలనీ, కొరోనా వంటి విపత్కర పరిస్థితులు ఎన్ని భవిష్యత్తులో వచ్చినా సరే తట్టుకునే విధంగా వైద్య రంగం తయారు చేసుకోవాలని పేర్కొన్నారు. దీనికోసం ప్రధాని చొరవ తీసుకోవాలనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా పనిచేసి దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొరోనా వైరస్‌ ‌నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామనీ, రాష్ట్రంలో రికవరీ రేటు 71 శాతంగా ఉందనీ, మరణాల రేటు 0.7 శాతంగా ఉందనీ, పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచడంతో పాటు కొరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఐసీఎంఆర్‌, ‌నీతి ఆయోగ్‌, ‌కేంద్ర బృందాల సలహాలు పాటిస్తున్నామనీ, వైద్యులు, పోలీసు సిబ్బంది, ఇతర ప్రభుత్వ యంత్రాంగమంతా శక్తి వంచన లేకుండా పని చేస్తున్నదని సీఎం కేసీఆర్‌ ‌ప్రధాని మోడీకి వివరించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!