నీ మురికి కంపు
ఎత్తిపోసేది మేము
నీ కుటిల కడుపుకు
మెతుకు పెట్టేది మేము
నీ చీకటి బతుక్కు
దీపము పట్టేది మేము
నీ నల్ల అంతస్తుకు
పునాది వేసేది మేము
నీ దోపిడీ సంపదకు
కాపలా కాసేది మేము
నీ రొచ్చు పీనుగకు
పాడెను కట్టేది మేము
డప్పుల కొట్టేది మేము
నీ సర్వ చాకిరి చేసినా
ఇంకా మీరుతున్నావు
నీ కులం జాడ్యంతో
విష కత్తులు దూసి
తలల తెగ్గోస్తున్నావు
నీ మత మౌఢ్యంతో
చితి మంటలు రాజేసి
దేహాల దహిస్తున్నావు
నీ అగ్రవర్ణ అహంతో
నెత్తుటేరుల పారించి
ప్రాణాల హరిస్తున్నావు
మనువు వారసుడా!
మేమంటూ లేకుంటే
నీ బతుకు తెల్లారదు
ఇకనైనా
వేర్పాటు పోకడలు వీడి
సమభావం పాటిస్తేనే సరి
లేదంటే గుణపాఠం తప్పదు
– కోడిగూటి తిరుపతి, 9573929493