Take a fresh look at your lifestyle.

ఆరోగ్యానికి తక్కువ నిధులు…అవి కూడా హాం ఫట్‌

సంక్షేమ రాజ్యంలో  ప్రజల ఆరోగ్యం కోసం బడ్జెట్‌లో 15 శాతాన్ని ఖర్చు చేయాలని ఆరోగ్య రంగానికి చెందిన పలు అంతర్జాతీయ సంస్థలు సూచిస్తుండగా, మన దేశం మాత్రం నాలుగు శాతం మాత్రమే ఖర్చు చేస్తోంది. ఆరోగ్యానికి అతి తక్కువగా  కేటాయింపులు చేస్తున్న దేశాల్లో మన దేశం ఆఫ్ఘనిస్థాన్‌ ‌సరసన ఉండటం అత్యంత విషాదకరం. కింది నించి నాల్గో స్థానంలో మన దేశం ఉన్నట్టు ఆక్స్ ‌ఫోమ్‌ ‌సంస్థ విడుదల చేసిన నివేదికలో పేర్కొనడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఆరోగ్య పరిస్థితులు, బడ్జెట్‌ ‌కేటాయింపుల గురించి ఆ సంస్థ క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఈ నివేదికను వెలువరించింది. పేదల సంక్షేమం ఎంత ముఖ్యమో, వారి ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. మన దేశంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉమ్మడి  జాబితాలో ఉన్నాయి. అంటే కేంద్రం, రాష్ట్రాలూ కూడా ఆరోగ్య విషయమై శ్రద్ధ తీసుకుంటున్నట్టు చెప్పుకోవడమైతే జరుగుతోంది కానీ,  అందుకు తగిన నిధులను ప్రభుత్వాలు కేటాయించడం లేదని ఇలాంటి నివేదికల కారణంగా అప్పుడప్పుడు తెలుసుకునే అవకాశం ప్రజలకు కలుగుతుంది.

ఆరోగ్య సేవలు అంతంత మాత్రంగా ఉండటం వల్లనే మన దేశంలో కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి ఎక్కువగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మన కన్నా ఆర్థికంగా బాగా తక్కువ స్థాయిలో ఉన్న బురుండీ వంటి దేశాలు ఆరోగ్యానికి ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయి. మన దేశం 147వ స్థానంలో ఉంది. ఆరోగ్యానికి సంబంధించి  15 శాతం బడ్జెట్‌ ‌కేటాయింపులు చేయాలన్న సిఫార్సులను కొద్ది దేశాలు మాత్రమే పాటిస్తున్నాయి. మన దేశంలో 51 శాతం మందికి మాత్రమే వైద్య సదుపాయాలు అందుతున్నాయి. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు తమ ఆదాయాల్లో అధిక భాగాన్ని వైద్య, ఆరోగ్య సేవలకు ఖర్చు చేస్తున్నారు. వీరిలో ఉద్యోగులు, నికర ఆదాయ వర్గాలు ఎక్కువ మంది ఉన్నారు. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు, ఉద్యోగులకు వైద్య ఆరోగ్య సేవలు అందుబాటులో లేవు. వారికి తాహతు లేకపోయినా కార్పొరేట్‌ ‌హాస్పిటళ్లలో వైద్యం చేయించుకోవల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. భారత దేశంలో  కార్మికుల హక్కులు పటిష్టంగా లేవనీ, వారికి వైద్య, ఆరోగ్య సేవలు  కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా, అందరికీ అవి అందడం లేదని పేర్కొంది. ఆ మాట నిజమే. మన దేశంలో కార్మికుల బీమా హాస్పిటళ్లలో నిధులన్నీ అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తున్నాయి. మందుల కోసం కేటాయించే నిధులను అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కయి స్వాహా చేస్తున్నారు. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో ఈఎస్‌ఐ ‌కుంభకోణాల్లో వెల్లడైంది.

రెండు రాష్ట్రాల్లోనూ వందల కోట్ల రూపాయిల కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. రాజకీయ నాయకుల ప్రమేయంతోనే ఈ కుంభకోణాలు జరుగుతున్నాయి. వీటిపై కేసుల నమోదు, దర్యాప్తు వంటి తతంగాలు జరుగుతున్నా, అంతిమంగా పేదలకు అందాల్సిన మందులు పక్కదోవ పడుతున్నాయి. హాస్పిటళ్లలో ఆరోగ్య సేవల తీరు ఎలా ఉంటుందో  వేరే చెప్పనవసరం లేదు. ప్రభుత్వ హాస్పిటళ్లంటే బాబోయే అనే మాట ఎంతో కాలంగా స్థిరపడింది. ఆ విషయం ఇప్పుడు కొరోనా కాలంలో మరింత బహిర్గతం అయింది. కేటాయింపుల విషయంలో కూడా కొరోనా కాలంలో తగిన రీతిలో జరగలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, హాస్పిటళ్లలో పీపీఈ కిట్లు అందుబాటులో లేకపోవడానికి నిధుల కొరత అని తేలింది.  అయితే, కొరోనా రోగుల చికిత్సకు ఎంతైనా ఖర్చు చేస్తామనే నాయకుల వాగ్దానాలు ఆచరణలో కనిపించడం లేదు. దీంతో ప్రైవేటు హాస్పిటళ్లు ప్రజల సహనాన్ని  పరీక్షిస్తున్నాయి. స్థోమత లేకపోయినా  ప్రాణాలు నిలబెట్టుకోవడానికే ప్రైవేటు హాస్పిటళ్లకు ప్రజలు వెళ్తున్నారు. అలా వెళ్ళినా ప్రాణాలు దక్కుతాయన్న నమ్మకం ఉండటం లేదు. ప్రాణం పోయినా, బిల్లులు కట్టి  మృతదేహాలను తీసుకుని వెళ్ళాలని ప్రైవేటు హాస్పిటళ్ల యాజమాన్యాలు రోగులను పీడిస్తున్న సంఘటనలు అనేకం.

భారత్‌ ‌లోని హాస్పిటళ్లలో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్లనే కొరోనా వ్యాప్తి సమయంలో ప్రభుత్వ హాస్పిటళ్లు చేతులెత్తేశాయన్నది ఆరోపణ కాదు , వాస్తవమని ఆక్స్ ‌ఫోమ్‌ ‌నివేదిక స్పష్టం చేస్తోంది. కనీస వైద్య సౌకర్యాలు అందించేందుకు కూడా దేశంలోని హాస్పిటళ్లకు తగిన వసతులు లేవు. ఆపరేష న్‌ ‌థియేటర్లలో ఆక్సిజన్‌ ‌సిలిండర్లు  లేకపోవడం వల్ల రోగులను మరో హాస్పిటల్‌కి తరలించమని వైద్యులు సిఫార్సు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి.   ప్రభుత్వ హాస్పిటళ్లలో సౌకర్యాల కోసం చేస్తున్న కేటాయింపులన్నీ సక్రమంగా ఖర్చు కాకపోవడం, లేదా అవినీతి పరుల జేబుల్లోకి పోవడమో జరగుతుండటం వల్లనే మన హాస్పిటళ్ల దుస్థితి నానాటికీ తీసికట్టుగా ఉంది. ప్రభుత్వం నియమించే కమిటీలు, కమిషన్లు కాలయాపనకే తప్ప హాస్పిటళ్లలో అవినీతి రోగాన్ని నిర్మూలించడానికి తోడ్పడటం లేదు. ఇందుకు తగిన చిత్తశుద్ది, రాజకీయ సంకల్పం పాలకుల్లో లేకపోవడం వల్ల హాస్పిటళ్లలో పరిస్థితి మన పొరుగు దేశాల కన్నా, మన కన్నా చిన్న దేశాల కన్నా అధ్వాన్నంగా ఉంది. హాస్పిటళ్ల నిర్వహణకే కేటాయింపులలో అధిక భాగం పోతోంది. మందులకు అతి స్వల్పంగా కేటాయిస్తున్నారు. అలా కేటాయించిన మందుల నిధులను కూడా అక్రమార్కులు స్వాహా చేస్తున్నారు. వైద్య, ఆరోగ్య రంగంలో మన బలహీనతను ఆక్స్ ‌ఫోమ్‌ ‌సంస్థ మరోసారి బయటపెట్టింది.

Leave a Reply