Take a fresh look at your lifestyle.

జాతరను తలబెట్టనున్న శాసనమండలి ఎన్నికల పోరు !

నిరుద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు కలిసి పరస్పర అంగీకారంతో చర్చించి, ఒక్కటై ముందుకెళితే ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. అంతేగాని ఇద్దరూ కొట్లాడితే  మూడోవాడి కి లాభంచేకూరేలా అన్నట్లుగా గాకుండా తెలివిగా ముందుకు వెళ్లాల్సిన అవశ్యకత ఎంతైనా ఉన్నది. ఈ ఎన్నికలలో గెలిచే అభ్యర్థుల వలన జరిగే ప్రతిఫలం అంతగా లేకపోయినప్పటికీ, ప్రభుత్వంపై వ్యతిరేకతను చాటి చెప్పడానికి నిదర్శనమై, రాబోయే ఎన్నికలలో ప్రభుత్వానికి ఒక హెచ్చరికను జారీచేయడంలో, వారి ఆలోచనా విధానంలో చిన్నమార్పు తేవడానికి ఉపయోగపడుతుందని చెప్పకతప్పదు.

దుబ్బాక ఉపఎన్నిక పోరు ముగిసింది.తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు, ఆపై ఉమ్మడి నల్గొండ, వరంగల్‌, ‌ఖమ్మం మరియు మహ బూబ్‌ ‌నగర్‌, ‌రంగారెడ్డి, హైదరాబాద్‌ ఈరెండు స్థానాలలో గ్రాడ్యుయేట్‌ ‌శాసనమండలి ఎన్నికల పోరు కొనసాగనుంది. ఇప్పటికే సెప్టెంబర్‌ 23‌న ఎన్నికల కమిషన్‌ ‌షెడ్యూల్‌ ‌ప్రకటించి అక్టోబర్‌ 1 ‌నుండి వోటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభించి నవంబర్‌ 6 ‌వరకు గడువునిచ్చి , అభ్యర్థన మేరకు మరల డిసెంబర్‌ 1 ‌నుండి 31 వరకు మరొకసారి అవకాశం కల్పించనుంది.జనవరి 18న తుదిజాబిత విడుదలచేసి తర్వాతి తతంగాన్ని పూర్తిచేయనుంది .నల్గొండ వరంగల్‌ ‌ఖమ్మం శాసనమండలి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి పల్లా రాజేశ్వర్‌ ‌రెడ్డి మరియు మహబూబ్‌ ‌నగర్‌ ‌రంగారెడ్డి హైదరాబాద్‌ ‌శాసనమండలి నియోజకవర్గంలో భారతీయ జనతాపార్టీ నుండి రాంచందర్‌ ‌రావు పదవీకాలం 2021 మార్చ్ 29‌న ముగుస్తుండటంతో ఈదఫా ఎన్నికలపోరు రసవత్తరంగా మారనుంది . ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను మిగతా పార్టీలు సద్వినియోగం చేసుకోవాలనిదలిచి ఇప్పటికే అంతర్గతంగా ప్రచార కార్యక్రమాలు చేయడం ఒక్కెత్తైతే , ఇండిపెండెంట్‌ అభ్యర్థుల సంఖ్యా సైతం పెరగనుంది . ఈసారి గ్రాడ్యుయేట్‌ అభ్యర్థులు సైతం వోట్ల నమోదు ప్రక్రియలో ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం , ఒక్క వరంగల్‌ ‌ఖమ్మం నల్గొండ నియోజకవర్గంలో ఆన్లైన్‌ ‌ద్వారా 4,13,475 మరియు ఆఫ్‌ ‌లైన్‌ ‌ద్వారా 1,04,068 మొత్తం 5,17,543 మంది వోటు నమోదు చేసుకున్నారు , ఇంకా డిసెంబర్‌ ‌లో ఈసంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి .

అధికార పార్టీ గత ఆరు సంవత్సరాల పాలనలో నిరుద్యోగ నిర్మూలనలో విఫలం అయింది. అందుకే చదువుకున్న ప్రతి ఒక్కరిలో పాలకవర్గంపై వ్యతిరేక భావనతో ఉండటం జరిగింది . అందుకు దుబ్బాక ఉప ఎన్నికలలో ఇచ్చిన తీర్పుయే నిదర్శనం. శాసన మండలిలో జరగబోయే గ్రాడ్యుయేట్‌ ఎన్ని కలలో సైతం అందరూ చదువుకున్న నిరుద్యోగులే ఉంటారు కావున నేటి ఫలితం సైతం అధికార పార్టీకి ప్రతికూలంగా మారనుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు. ఇదియే గాకుండా మున్సిపాలిటి ఎన్నికలలో సైతం ఆ ప్రభావం పడుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వంపైన వ్యతిరేకత నెలకొంటున్నదన్నది ముమ్మాటికి వాస్తవం అయినప్పటికీ, దుబ్బాక ఉప ఎన్నికలలో పార్టీల పరంగానే కాకుండా స్వతంత్ర అభ్యర్ధులు పదుల సంఖ్యలో పోటీలో నిలబడి వోట్లను చీల్చడంలో ఒకింత విజయం సాధించారని చెప్పవచ్చు. అందులో భాగంగానే గ్రాడ్యుయేట్‌ ‌శాసనమండలి ఎన్నికలలో సైతం పోటీలో నిలబడే అభ్యర్థుల సంఖ్య సైతం పెరిగే అవకాశం ఉన్నది. అందుకే ఎవరికి వారు ముందస్తుగానే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ, వోటర్లను ఆకర్షింప చేయడానికి తీవప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఇంకా ప్రధాన పార్టీలు అభ్యర్థుల ప్రకటన చేయకుండా పరిస్థితులను గమనిస్తూ, వోటర్ల నమోదుపక్రియలో చురుకుగా పాల్గొని, ఈ దఫా ఎక్కువ వోటర్లను నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే.

ఇక్కడ ప్రధానంగా అధికార పార్టీకి ఎదురుగాలి వీయనుందా ? ఎందుకంటే 2014 ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఉద్యమపార్టీ, ఉద్యమ సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులు ఎన్నో కలలుగని, కలల సాకారం చేసుకోవడానికి అధికారాన్ని అందించి, కోటిఆశలతో ఎదురుచూసిన… ఫలితం లేకుండా పోయింది. కేవలం వారుచేపట్టే అభివృద్ధి పథకాలు సైతం ధనార్జన నేపథ్యంలో మరీ ముఖ్యంగా వోట్ల రాజకీయంగానే కొనసాగాయి తప్పా! నిరుద్యోగుల పాలిట శాపంగామారి, వారి జీవన విధానమే ప్రశ్నార్థకంగా మారిందనడంలో నిజంలేకపోలేదు.గ్రాడ్యుయేట్‌ ఎన్నికలలో వోటువేసే అభ్యర్థులందరూ, నిరుద్యోగులు కావడంతో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. కానీ సంఘాల వారిగా ఎవరికి వారు ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకిదిగి వోట్లనుచీల్చి అధికార పార్టీకి మేలుచేసిన ఆశ్చర్యపోనక్కరలేదు.

ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి నెలకొన్నమాట వాస్తవం. గత ఆరు సంవత్సరాల పరిపాలనలో ఉద్యోగవకాశాల మాట నీటిమూటగా తయారయింది. తినడానికి తిండి లేదన్నవాడికి బిర్యానీ పెడతామని ఊరించే విధంగా రెండుపడక గదుల ఇల్లు అనిచెప్పి, ఇంటి జాగలను కూడా ఇవ్వలేని పరిస్థితి, ఇలా చెప్పుకుంటూపోతే పరిష్కారం దొరకని ఎన్నోసమస్యలు ఉన్నాయి. ఇదిగాక ప్రతిపక్షం లేకుండా చేసి, ప్రశ్నించే గొంతులను నొక్కివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికార పక్షంలో సైతం ఒకరిద్దరు మినహాయిస్తే.. మిగతా వారందరూ ఉత్సవ విగ్రహాలుగా మారినారు ! వారి వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందనడంలో ఎలాంటి ఆవాస్తవం లేదు.

నిరుద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు కలిసి పరస్పర అంగీకారంతో చర్చించి, ఒక్కటై ముందుకెళితే ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. అంతేగాని ఇద్దరూ కొట్లాడితే మూడోవాడుకి లాభంచేకూరేలా అన్నట్లుగా గాకుండా తెలివిగా ముందుకు వెళ్లాల్సిన అవశ్యకత ఎంతైనా ఉన్నది. ఈ ఎన్నికలలో గెలిచే అభ్యర్థుల వలన జరిగే ప్రతిఫలం అంతగా లేకపోయినప్పటికీ, ప్రభుత్వంపై వ్యతిరేకతను చాటి చెప్పడానికి నిదర్శనమై, రాబోయే ఎన్నికలలో ప్రభుత్వానికి ఒక హెచ్చరికను జారీచేయడంలో, వారి ఆలోచనా విధానంలో చిన్నమార్పు తేవడానికి ఉపయోగపడుతుందని చెప్పకతప్పదు.

ఇప్పటికైనా అధికారపక్షం జరుగుతున్న తీరును, ప్రజలలో వస్తున్న వ్యతిరేకతను అర్థం చేసుకుని, చర్చిస్తూ, మేధావులతో విశ్లేషణ గావిస్తూ, సరైన నిర్ణయాలు తీసుకొని ప్రజలపక్షం నిలబడటానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. లేనిచో దానికి తగిన ప్రతిఫలం అనుభవించక తప్పని పరిస్థితి. అందుకే తగిన జాగ్రత్తలతో వ్యవహరించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇప్పటికైనా నిరుద్యోగ నిర్మూలనకు పాటుపడుతూ, ప్రజలకుపయోగపడే సంక్షేమ, అభివృద్ధి పథకాలను చేపడుతూ, వారిమన్ననలు పొందాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఈ శాసన మండలి ఎన్నికలలో వోటువేసే ప్రజలందరూ మేధావులు, సమాజంలో ఏం జరుగుతుందో, పాలకుల వైఖరి ఏంటో ఎప్పటికప్పుడు విశ్లేషించే నైపుణ్యం కలవారు కావున డబ్బుకు అమ్ముడు పోకుండా, సరైన సమయంలో ఆలోచించి సరైన నిర్ణయాన్ని తీసుకొని ఉత్తమ వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కావున ఆదిశగా అడుగులు వేసి, తీర్పును చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

ఇదే తంతును రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో , ఆపై వచ్చే ప్రతిఎన్నికలలో ప్రయోగిస్తూ, అభివృద్ధిని కాంక్షించే ఉత్తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు ఉపయోగపడని ఏ రాజకీయపార్టీకైనా తగిన గుణపాఠం చెప్పేవిధంగా ఉండాలి. ఇప్పటికే వివిధ రాజకీ యపార్టీలు, స్వతంత్రంగా బరిలోకి దిగడానికి నిశ్చ యించుకున్న అభ్యర్థులు వోటర్ల నమోదు పక్రియచేపట్టి, ఫోన్‌ ‌లలో సందేశాల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరికివారు తమ ప్రచారకార్యక్రమాలు చేపట్టి వోటర్లను ఆకర్షించడానికి తీవప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. గతంలో జరిగిన ఎన్నికలు ఒకెత్తయితే ఇప్పుడు జరగబోయే ప్రతి ఎన్నికలు ఆసక్తి కరం గా మారే అవకాశాలు ఉన్నాయి. వోటర్లు సైతం చైతన్యమయి, ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని గమనిస్తూ… తీర్పునెల ఇస్తారో ఊహించలేని విధంగా మారుతుంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు. ఏది ఏమైనప్పటికీ వోటర్లకు తమచేతిలోనున్న వోటు అనే వజ్రాయుధాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ఉత్తమ అభ్యర్థులను ఎన్నుకోవాలని ఆశిద్దాం.

polam sydhulu
డా. పోలం సైదులు ముదిరాజ్‌,
9441930361.

Leave a Reply