రైతులకు బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ బెదిరింపు నోటీసులు
సిద్ధిపేటకు చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచి మేనేజర్ రైతులను బ్లాక్ మెయిల్‌కు చేస్తున్నారు. పంట రుణాలు రీషెడ్యూలు చేయకుంటే న్యాయపరమైన(లీగల్) చర్యలు తీసుకోవల్సి ఉంటుందని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేస్తున్నారు. రైతులను భయబ్రాంతులకు గురి చేసే విధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ నోటీసులు జారీ చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. తాము అధికారంలోకి వొస్తే పంట రుణాలను మాఫీ చేస్తామనీ ఎన్నికల ముందు పాలకులు చేసిన వాగ్దానం అమలు కాకపోవడంతో పంటల సాగు కోసం రైతులు తీసుకున్న రుణాలను రీ షెడ్యూల్ చేయాలనీ, చెల్లించాలంటూ సిద్ధిపేటకు చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్, సిబ్బంది రుణాలు తీసుకున్న రైతులను ఫోన్లలో బెదిరింపులకు పాల్పడటమే కాకుండా, ఇప్పుడు ఏకంగా నోటీసులు పంపిస్తున్న తీరుతో రైతులు మానసిక వొత్తిళ్లకు గురౌతున్నట్లు పలువురు రైతులు గురువారమిక్కడ ‘ప్రజాతంత్ర’తో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు.
గత ఏడాది కాలంగా కొరోనా యావత్ ప్రపంచాన్ని ఎంతగా కుదిపేస్తుందో అందరికీ తెలిసిందే. కొరోనా ప్రతి ఒక్కరినీ ఆర్థికంగా ఎంతో నష్టపర్చింది. కొరోనా నుంచి ఇంకా కోలుకోకపోయినప్పటికీ…పంట రుణాలను రీ షెడ్యూల్ చేయాలనీ, చెల్లించాలంటూ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచి మేనేజర్ పేరుతో పంట రుణాలను తీసుకున్న రైతులకు నోటీసులు రావడం పట్ల రైతులకు ఏం చేయాలో తోచక భయాందోళనలకు గురౌతున్నారు. ప్రస్తుతం కొరోనా కష్ట కాలంలో బయట అప్పులు పుట్టడం లేదు. పెట్టుబడి భారంగా ఉంది. పంట సాగుకు చేతుల్లో పైసలు లేక రైతులు పడరాని పాట్లు పడుతుంటే..ఇవేమీ చాలవన్నట్లుగా పంటల సాగు కోసం తీసుకున్న వేల రూపాయలను తక్షణమే రీషెడ్యూల్ చేయాలనీ, చెల్లించాలంటూ రైతులపై వొత్తిళ్లకు తేవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
వందల, వేల కోట్ల రూపాయలు తీసుకుని ఎగ్గొట్టే పారిశ్రామికవేత్తల జోలికి వెళ్లని బ్యాంక్ అధికారులు పంటల సాగు కోసం రైతులు తీసుకున్న వేల రూపాయలు చెల్లిస్తారా? లీగల్‌గా చర్యలు తీసుకోమంటారా? అంటూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడటం సమంజసంగా లేదనీ పలువురు అభిప్రాయపడుతున్నారు.
పంట రుణాల బాకీ కోసం లీగల్ చర్యలు తీసుకుంటామంటూ బెదిరింపుగా నోటీసు పంపడంతో అవమానభారం భరించలేక రైతులెవరైనా బలవనర్మరణానికి పాల్పడితే బ్యాంక్ అధికారే బాధ్యత వహించాల్సి ఉంటుందనీ పలువురు రైతులు, రైతు సంఘాల నేతలు, రాజకీయ పార్టీల నాయకులంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పందించి పంట రుణాలు చెల్లించాలంటూ భయబ్రాంతులకు గురి చేస్తున్న బ్యాంకు అధికారులు, సిబ్బందిని కట్టడి చేయాలని పలువురు కోరుతున్నారు.