Take a fresh look at your lifestyle.

కమలం నేర్పుతున్న పాఠాలు

“ఐదు రాష్ట్రాల ఫలితాలు వచ్చిన రెండో రోజే మోడీ- షా ద్వయం తర్వాతి లక్ష్యం పై దృష్టి సారించారు. ప్రధాని మోదీ ఈ ఏడాది డిసెంబరులో ఎన్నికలు రానున్న గుజరాత్‌ ‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఐదింట నాలుగు రాష్ట్రాల్లో సాధించిన ఘన విజయాన్ని తన సొంత గడ్డతో పంచుకోవడం ఒక అంశం. తూర్పున మణిపూర్‌, ‌పశ్చిమాన గోవా, ఉత్తరాన ఉత్తరాఖండ్‌, ‌కాస్త మధ్య భారతదేశంలోనూ విస్తరించి ఉండే ఉత్తరప్రదేశ్‌లలో అంటే ఒకరకంగా నాలుగు దిక్కుల్లోని రాష్ట్రాల్లో ప్రజలు తమ పై నమ్మకం ఉంచారు అనే విషయాన్ని గుజరాత్‌ ఓటర్లలోకి తీసుకుని వెళ్ళటం మరో వ్యూహం.”

pendrive rehanaఇప్పుడు దేశ వ్యాప్తంగా బీజేపీ సాధించిన ఘన విజయం పై చర్చ జరుగుతోంది.విన్నింగ్‌ ‌మెషీన్‌, ‌సక్సెస్‌ ‌ఫార్ములా ఇలా అనేక వ్యక్తీకరణలుకనిపిస్తున్నాయి. కమలదళం గెలుపుకు , ప్రత్యర్ధులు ఘోర ఓటమికి గల కారణాల పై విశ్లేషణలు సాగుతున్నాయి. ఆ యా రాష్ట్రాల్లో రాజకీయ, సామాజిక సమీకరణాలు, అభివృద్ధి, పాలన, వైఫల్యాలు … ఇవన్నీ చర్చలో భాగమవుతాయి. రాష్ట్రాల వారీగా గత ఎన్నికల కంటే ఈసారి ఏ పార్టీకి ఎన్ని సీట్లు తగ్గాయి, పెరిగాయి… ఓటింగ్‌ ‌శాతం పై వేటి ప్రభావం ఏ రకంగా ఉంది అనేగణాంకాల జోలికి నేను ఇప్పుడు వెళ్ళటం లేదు. ఒక స్థూల దృక్పథంతో, విశాల క్షేత్రంలో చూస్తే బీజేపీ నుంచి ప్రత్యర్ధులు నేర్చుకోవాల్సిన పాఠాలు కొన్ని ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే గెలుపు కాంక్షించే వారు ఎవరైనా అనుసరించాల్సిన అంశాలే.బీజేపీ గెలుపు సిలబస్‌ ‌లో ప్రధానంగా ఐదు చాప్టర్లు. మొదటిది, అర్జునుడు విలువ విద్య పోటీ సందర్భంగా లక్ష్యాన్ని గురి పెట్టిన తీరు బీజేపీది. ఆ గెలుపుకు ఇది మొదటి సూత్రం.

ఒక రాష్ట్రంలో ఎన్నికలకు ఆరు నెలల నుంచి పది నెలల ముందు నుంచే కమలదళం సీరియస్‌ ‌కసరత్తు మొదలు పెడుతుంది. ఐదు రాష్ట్రాల ఫలితాలు వచ్చిన రెండో రోజే మోడీ- షా ద్వయం తర్వాతి లక్ష్యం పై దృష్టి సారించారు. ప్రధాని మోదీ ఈ ఏడాది డిసెంబరులో ఎన్నికలు రానున్న గుజరాత్‌ ‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఐదింట నాలుగు రాష్ట్రాల్లో సాధించిన ఘన విజయాన్ని తన సొంత గడ్డతో పంచుకోవడం ఒక అంశం. తూర్పున మణిపూర్‌, ‌పశ్చిమాన గోవా, ఉత్తరాన ఉత్తరాఖండ్‌, ‌కాస్త మధ్య భారతదేశంలోనూ విస్తరించి ఉండే ఉత్తరప్రదేశ్‌లలో అంటే ఒకరకంగా నాలుగు దిక్కుల్లోని రాష్ట్రాల్లో ప్రజలు తమ పై నమ్మకం ఉంచారు అనే విషయాన్ని గుజరాత్‌ ఓటర్లలోకి తీసుకుని వెళ్ళటం మరో వ్యూహం. పైగా రెండు రోజుల గుజరాత్‌ ‌పర్యటనలో ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాల్లోనే కాకుండా గ్రామ, తాలుకా, జిల్లా పంచాయతీ సభ్యులతో పంచాత్‌ ‌మహా సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొనటం కూడా రానున్న ఎన్నికల కోణంలో చూడాల్సిన అంశమే.

రెండు, పొలిటికల్‌ ‌ఫిలాసఫీ. హిందుత్వ నినాదం కమలం పార్టీ ఫిలాసఫీ. హిందుత్వ పై చర్చ ఉంటే ఉండొచ్చుగాక…కానీ పార్టీకంటూ ఒక సిద్ధాంతం ఉండాలి. హిందుత్వ అనగానే బీజేపీ, బీజేపీ అనగానే హిందుత్వ గుర్తుకు వచ్చేలా ప్రజల్లోకి తమ నినాదాన్ని తీసుకుని వెళ్ల గలిగింది. మూడు, ప్రత్యర్ధుల పై ఫోకస్‌ ‌పెట్టడంలో బీజేపీ ఏ ఆరోపణలను ఖాతరు చేయదు. ఏ ఆటగాడికి అయినా తన శక్తి సామర్థ్యాలను పెంచుకోవడం ఎంత అవసరమో ప్రత్యర్ధుల బలహీనతల పై దెబ్బ కొట్టడం అంత కంటే ఎక్కువ అవసరం. ప్రత్యర్థిని నిర్వీర్యం చేయగలిగితే గ్రౌండ్‌లో గెలుపు నల్లేరు పై నడక అవుతుంది. టార్గెట్‌ ‌గా ఈడీ, ఐటీ దాడులు చేస్తోందని ఎవరు గగ్గోలు చేసినా చట్టం తన పన తాను చేసుకుని పోతూనే ఉంటుంది. నాలుగు, నిబద్ధత. బీజేపీ అధిష్ఠానం నుంచి బూత్‌ ‌స్థాయి కార్యకర్త వరకు నిబద్ధతతో పని చేయటం కనిపిస్తుంది. దేశంలోనే అపర రాజకీయ చాళుక్యులుగా పేరుబడిన మోడీ, అమిత్‌ ‌షా ఏ స్థాయి ఎన్నికలు అయినా ఒకే రకమైన కమిట్‌మెంట్‌తో పని చేస్తారు. జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికల ప్రచారానికి అమిత్‌ ‌షా వచ్చారు. మూడు నాలుగ రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ ప్రచారం చేయించారు. మొన్న యూపీలో షా ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. కొంత మంది నేతలు ఒక స్థాయికి వెళ్లిన తర్వాత క్షేత్ర స్థాయిలో పని చేయడం తగ్గిస్తారు. ఒక రాష్ట్రంలోని ఒక మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌లో కార్పొరేటర్ల గెలుపుకు ప్రచారం చేయటాన్ని అమిత్‌ ‌షా నామోషీగా భావించలేదు. గ్రౌండ్‌ ఏదైనా గెలుపే ముఖ్యం అన్న నైజం, ఫైటింగ్‌ ‌స్పిరిట్‌ ‌చాలా కీలకం.

చివరగా ఐదో అంశం, విస్తృత ప్రచారం. దీని కోసం డబ్బు మాత్రమే కాకుండా అన్ని రకాల ప్లాట్‌ఫారాలు ఉపయోగించుకోవటంలో బీజేపీ తర్వాతే ఏ పార్టీ అయినా. సాంప్రదాయ మీడియా నుంచి సోషల్‌ ‌మీడియా వరకు ఒక బ్రాండ్‌ ‌సృష్టించుకోవటంలో కీలక పాత్ర పోషిస్తాయి. సోషల్‌ ఇం‌జనీరింగ్‌ ‌లాంటి ఇతర ఆయుధాలు ఏలాగూ ఉంటాయి. యుద్ధ క్షేత్రంలో ఉంటే పోరాడాల్సిందే. మరో ప్రత్యామ్నాయం ఉండదు. నాగరిక సమాజం ఎప్పుడూ పరివర్తనం చెందుతూనే ఉంటుంది. దానికి అనుగుణంగా ఆట నియమాలు మారుతూ ఉంటాయి. గెలవాలంటే గెలుపు సూత్రాలు ఒంట బట్టించుకోవాలి.

Leave a Reply