Take a fresh look at your lifestyle.

రాజధానిపై మాటమార్చి మాట్లాడుతున్న నేతలు

  • కరకట్ట డ్రెడ్జింగ్‌ ‌పనులతో రైతులకు ఇబ్బందులు
  • పనులను పరిశీలించిన బిజెపి నేత పాతూరి

అమరావతి,జూన్‌ 11 : ‌గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పతనాన్ని కోరుతుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం అన్నారు. జగన్‌ ‌గజినీలాగా మారిపోయాడని… జగన్‌ ఆనాడు రాజధాని గురించి ఏం మాట్లాడాడో వాళ్ల మంత్రులు మర్చిపోయారని విమర్శించారు. కరకట్ట వద్ద డ్రిడ్జింగ్‌ ‌పనుల వలన రైతుల ఇబ్బందులు పడుతున్నారని… కట్టకి ఆనుకొని ఉన్న రైతుల పొలాల్లో మట్టి వేస్తే అధికారులకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. కరకట్ట బలహీన పడితే గ్రామాలు మునుగుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. డ్రెడ్జింగ్‌ ‌విధానం సరికాదని…పొలాల రైతులకు కౌలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. పొలాల్లో డ్రిడ్జింగ్‌ ‌లేకుండా చూడాలని..లేకుంటే బీజేపీ తరుపున ఆందోళన తీవ్రతరం చేస్తామని పాతూరి నాగభూషణం హెచ్చరించారు. శుక్రవారం కృష్ణానది ఒడ్డున డ్రిడ్జింగ్‌ ‌చేసి ఇసుక తవ్వకాల పేరుతో కరకట్టను బలహీనపరుస్తున్నారంటూ కరకట్ట డ్రిడ్జింగ్‌ ‌పనుల వద్ద బీజేపీ నేతలు పర్యటించారు.

ఈ సందర్భంగా రైతుల పొలాల్లోకి మట్టి పోస్తున్నారంటూ బీజేపీ నేతలకు రైతులు మొర పెట్టుకున్నారు. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలంలో గల కరకట్ట ప్రాంతాన్ని బీజేపీ నేత పాతూరి నాగభూషణం తదితరులు శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. డ్రెడ్జింగ్‌కు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కరకట్టను తవ్వేస్తుంటే జల వనరులుశాఖ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వీర్రాజు ఆదేశాల మేరకు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకున్నామన్నారు. పార్టీ పరంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు. రైతులకు వార్షిక కౌలు, కూలీలకు పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు.మూడు రాజధానుల సంగతి తమకు చెప్పిచేయలేదని…అది తమ పార్టీ అంశం కాదని పాతూరి నాగభూషణం అన్నారు.

Leave a Reply