Take a fresh look at your lifestyle.

వీర జవాన్‌ ‌మహేశ్‌కు నేతల సలాం..ఘన నివాళి కుటుంబానికి అండగా ఉంటామన్న రాష్ట్ర సర్కార్‌

‌కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో వీరమ రణం పొందిన రాడ్యా మహేశ్‌కు మంత్రులు, జిల్లా నేతలు ఘనంగా నివాళి అర్పించారు. ఉగ్రవాదుల చొరబాటుని అడ్డుకుని నిజామాబాద్‌ ‌జిల్లా కోమన్‌పల్లికి చెందిన ర్యాడా మహేశ్‌ అమరుడైన సంగతి తెలిసిందే. ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఐటీ మంత్రి కేటీఆర్‌, ‌స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తదితరులు ఘన నివాళులర్పించారు. మహేశ్‌ ‌త్యాగం మరువలేనిదని పేర్కొన్నారు. మహేశ్‌ ‌కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి కేటీఆర్‌ ‌భరోసానిచ్చారు. రాడ్యా మహేశ్‌ ‌మృతిపై డీజీపీ మహేందర్‌ ‌రెడ్డి ట్విట్టర్‌ ‌వేదికగా స్పందించారు. తమను సురక్షితంగా ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపారు.  వీరత్వం ఎప్పటికీ మరచిపోలేమని డీజీపీ పేర్కొన్నారు. ర్యాడా మహేష్‌ ‌మృతి పట్ల రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ ‌స్పందిస్తూ..దేశ రక్షణ కోసం సైన్యంలో చేరి భారతావని కోసం మహేష్‌ ‌చేసిన త్యాగం మరువలేనిదని అన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికుడు మహేష్‌కు యావత్తు తెలంగాణ నివాళి అర్పిస్తుందన్నారు. మహేష్‌తో పాటు వీరమరణం పొందిన తోటి సైనికులకు జోహార్లు తెలిపారు. వారి కుటుంబ
సభ్యులకు స్పీకర్‌ ‌ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వీర జవాన్ల పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. అమర జవాను ర్యాడా మహేశ్‌ ‌కుటుంబానికి తెలంగాణ జాతి అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ట్విట్టర్‌ ‌ద్వారా ఆమె స్పందిస్తూ మహేశ్‌కు ఘన నివాళి అర్పించారు. వీరోచిత పోరాటంలో దేశం కోసం తన ప్రాణాలను వదులుకున్న వీర జవాన్‌ ‌కుటుంబానికి తెలంగాణ జాతి అండగా ఉందని కవిత పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లోని మాచిల్‌ ‌సెక్టార్‌లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన సైనికుడు రాడ్యా మహేశ్‌కు మంత్రి ప్రశాంత్‌ ‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. భారతావని కోసం మహేశ్‌ ‌చేసిన త్యాగం మరువలేనిదని అన్నారు.

అసైనికుడికి యావత్‌ ‌తెలంగాణ నివాళులర్పిస్తున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్‌, ‌వేల్పూర్‌ ‌వాసిగా తాను మహేశ్‌ ‌కుటుంబానికి అండగా ఉంటానని ప్రకటించారు. మహేశ్‌తోపాటు వీరమరణం పొందిన సైనికులకు జోహర్లు అర్పించారు. కశ్మీర్‌లో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిజామాబాద్‌ ‌జిల్లా వేల్పూర్‌ ‌మండలం కోమన్‌పల్లికి చెందిన ఆర్మీ జవాన్‌ ‌ర్యాడ మహేశ్‌(26) ‌వీర మరణం పొందారు.
మహేశ్‌ 2015‌లో ఆర్మీ జవాన్‌గా విధుల్లో చేరాడు. మహేశ్‌ 6‌వ తరగతి వరకు వేల్పూర్‌ ‌మండలం కుకునూర్‌ ‌ప్రభుత్వ పాఠశాలలో, 7-10వ తరగతి వరకు వేల్పూర్‌లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదివారు. బాల్యం నుంచి దేశభక్తి భావాలు ఉన్న మహేశ్‌ ‌ప్రత్యేక ఆసక్తితో ఆర్మీలో చేరారు. మహేశ్‌కు తల్లి ర్యాడ గంగు, తండ్రి గంగమల్లు, అన్న భూమేశ్‌ ఉన్నారు. మహేశ్‌ ఏడాది క్రితం సుహాసినిని ప్రేమవివాహం చేసుకున్నాడు. ఏడాది క్రితం ఇంటికి వొచ్చి నెల రోజుల పాటు ఉండి వెళ్లాడు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply