Take a fresh look at your lifestyle.

చట్టాలు పకడ్బందీగా అమలయినప్పుడే మహిళలపై వేధింపులకు చెక్

వర్క్ ప్లేస్ లలో జరిగే లైంగిక పరమైన వేధింపులపై మరింత చర్చ జరగాల్సిన అవసరముందని భిన్న రంగాల్లో లబ్ద ప్రతిష్టులైన  ప్రముఖ మహిళలు అభిప్రాయ పడ్డారు. తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఏర్పాటై మూడు సంవత్సరాలు పూర్తి కావడం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా వర్క్ ప్లేస్ లలో మహిళలపై జరిగే వేధింపులు, న్యాయ పరమైన లొసుగులు, అధిగమించే మార్గాలు అనే అంశంపై మహిళా భద్రతా విభాగం నేడు భిన్న రంగాల మహిళా ప్రముఖులతో వెబ్-నార్   వర్క్ షాప్ నిర్వహించింది. అడిషనల్ డీజీ స్వాతి లక్రా, హిమాచల్ ప్రదేశ్ లోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి నిష్ఠా జైస్వాల్, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ జెండర్ విభాగం వైస్ ఛైర్మెన్ శృతి ఉపాధ్యాయ్, ఎన్డీటీవీ దక్షన్ భారత కార్య నిర్వాహక సంపాదకులు ఉమా సుధీర్ తదితరులు పాల్గొనగా డీఐజీ సుమతి సమన్వయకర్తగా వ్యవహరించారు.

ఈ సందర్బంగా అడిషనల్ డీ.జీ.స్వాతి లక్రా మాట్లాడుతూ, వర్క్ ప్లేస్ హరస్మెంట్, గృహ హింస లు అధికంగా జరుగుతున్నా వీటిలో అధిక శాతం నమోదు కావడం లేదని అభిప్రాయ పడ్డారు. లాక్ డౌన్ సమయం లో గృహ హింస కేసులు కూడా అధికంగా నమోదయ్యాయని వెల్లడించారు. కాగా, ఇటీవల వచ్చిన మీ-టూ ఉద్యమం, ఎం.జె. అక్బర్ – ప్రియా రమణి కేసు వర్క్ ప్లేస్ హరస్ మెంట్ పై పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి నిష్ఠా జైస్వాల్ మాట్లాడుతూ, వర్క్ ప్లేస్ లలో జరిగే వేధింపులు, ఇతర విధానాలలో జరిగే  వేధింపులపై నమోదయ్యే కేసుల దర్యాప్తు నిర్దిష్ట సమయంలో పూర్తిచేయడం, చట్టాలను మరింత పకడ్బందిగా అమలు చేయడం వల్లనే ఈ విధమైన వేధింపులను కట్టడి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

 

యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ జెండర్ విభాగం వైస్ ఛైర్మెన్ శృతి ఉపాధ్యాయ్ మాట్లాడుతూ, జస్టిస్ ఫర్ ఆల్ అన్న విధానంలో భాగంగా మహిళలకు ప్రతి ఒక్కరూ అండగా నిలిచినప్పుడే మహిళలపై జరిగే వేధింపులు తగ్గుతాయని అభిప్రాయ పడ్డారు. మీడియా రంగం లో లైంగిక వేధింపులు అనే అంశంపై ప్రముఖ జర్నలిస్ట్ ఉమా సుధీర్ తన అభిప్రాయాలను వెల్లడించారు. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానికన్నా ముందు పోలీస్ శాఖలో మహిళా పోలీసుల సంఖ్య కేవలం 4.30 శాతమే ఉండగా, తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పోలీస్ శాఖలో ఈ సంఖ్య గణనీయంగా 8 శాతానికి పెరిగిందని, రానున్న రోజుల్లో 14 శాతానికి పెరుగుతుందని డీఐజీ సుమతి వివరించారు.

women safety

దేశంలో మారె రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణా పోలీస్ శాఖలో ప్రత్యేకంగా మహిళా భద్రతా విగాగం ఏర్పాటు చేసి అడిషనల్ డీజీ అధినేతగా షీ- టీమ్ లు, ఎన్నారై సెల్, భరోసా కేంద్రాలు, కౌన్సిలింగ్ సెంటర్లు, టెలి కౌన్సిలింగ్ తదితర వినూత్న విధానాలు ప్రవేశపెట్టడం ద్వారా రాష్ట్ర మహిళలలో ఆత్మా స్థైర్యం నిలిపేందుకు ప్రధాన పాత్ర వహిస్తోందని వివరించారు. ఈ సందర్బంగా వర్క్-ప్లేస్ హరాస్ మెంట్ ను ఎదుర్కోవడం ఎలా అనే అంశంపై రూపొందించిన మాన్వల్ పుస్తకాన్ని అడిషనల్ డీజీ స్వాతి లక్రా ఆవిష్కరించారు. జర్నలిస్టులు, విద్యా రంగ ప్రముఖులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, అధికారులతో పాటు భిన్న రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వర్క్-షాప్ లో పాల్గొన్నారు. ఈ వెబ్ వర్క్ షాప్ ప్రొసీడింగ్ ను పేస్ బుక్, ట్విట్టర్, తదితర మాధ్యమాల ద్వారా  దాదాపు 7  వేల మంది వీక్షించారు. తదుపరి మానవ అక్రమ రవాణా అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహించనున్నట్టు డీఐజీ సుమతి తెలిపారు

Leave a Reply