సైన్యంపై దాడి వెనక లష్కరే తోయిబా
గుర్తించిన మిలిటరీ అధికారులు
శ్రీనగర్,మే6 : జమ్ముకాశ్మీర్ లోని బారాముల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ అమోద్ అశోక్ తెలిపారు. అతను లష్కరే తొయీబాకు చెందిన ఉగ్రవాదిగా గుర్తించామని వెల్లడించారు. బారాముల్లా జిల్లాలోని కుంజర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారాన్ని అందుకున్న పోలీసులు, భద్రతా బలగాలు మే 06 శనివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదుల బృందంపై కాల్పులు జరపగా ఓ ఉగ్రవాది హతమయ్యాయడు. బారాముల్లాలో గత నాలుగు రోజులలో ఇది మూడో ఎన్‌కౌంటర్ కాగా ఇప్పటికే నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. జమ్మూ కాశ్మీర్ లో భద్రతా పరిస్థితిని సక్షించేందుకు ఇవాళ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే జమ్మూలో పర్యటిస్తున్నారు. రాజౌరీ జిల్లాలోని కాండి అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడిన మరుసటి రోజే ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇకపోతే శుక్రవారం తెల్లవారుజామున రాజౌరి జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన పేలుడులో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.
రాజౌరిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో జవాన్లపై ఉగ్రవాదులు పేలుడు పదార్థం విసరడంతో జవాన్లు వీరమరణం పొందారు. ఇటీవల జమ్ము రీజియన్‌లో ఆర్మీ ట్రక్‌పై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకొనేందుకు సైన్యం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నది.ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు ఆర్మీ జవాన్లకు జమ్మూ కాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా నివాళులర్పించారు. ఇదిలావుంటే రాజౌరి ఉగ్రదాడి వెనుక పాక్ లష్కరే తోయిబా హస్తం ఉందని శనివారం వెల్లడైంది. రాజౌరి దాడికి పాల్పడిన 9మంది ఉగ్రవాదులను సైన్యం హెలికాప్టర్లు,డ్రోన్‌లతో అడవులను స్కాన్ చేసింది.జమ్మూ కాశ్మీర్,సౌత్ బ్లాక్ నుంచి లభ్యమైన సమాచారం ప్రకారం రాజౌరీ-పూంచ్ సెక్టార్‌లో స్థానికుల మద్దతుతో రెండు గ్రూపుల లష్కరే తోయిబా ఉగ్రవాదులు మకాం వేశారు.భాటా-ధురియన్ ప్రాంతంలో ఆర్మీ వాహనంపై ఏప్రిల్ 20వతేదీన జరిగిన దాడిలో ఐదుగురు భారతీయ ఆర్మీ జవాన్లు మరణించారు.ఈ దాడిలో ముగ్గురు స్థానిక ఉగ్రవాదులతో పాటు ముగ్గురు పాకిస్థానీయులతో కూడిన ఒక బృందం పాల్గొందని వెల్లడైంది. 9 పారా కమాండోలపై దాడి స్థాయిని బట్టి ఈ ప్రాంతంలో ఇద్దరు పాకిస్థానీలతో పాటు ఐదుగురు ఉగ్రవాదులతో కూడిన మరో బృందం ఉండవచ్చని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి.
ఆక్రమిత కశ్మీర్‌లోని కోట్లిలో నియంత్రణ రేఖ వెంబడి జమ్మూ ప్రాంతంలోని మహోరే రియాసి నివాసి రియాజ్ అహ్మద్ అలియాస్ ఖాసీమ్‌తో పాటు లష్కర్ కమాండర్ హబీబుల్లా మాలిక్ అలియాస్ సజ్జిద్ జుట్ అలియాస్ సజ్జిద్ లాంగ్డా కంది అటవీ గ్రామాల్లో ఉగ్రదాడులు నిర్వహిస్తున్నట్లు భద్రతా సంస్థలకు సమాచారం అందింది. ప్రస్తుతం లాహోర్‌లోని మురిద్కేలోని లష్కరే తోయిబాకు చెందిన మెంధార్ నివాసి రఫీక్ నాయ్ అలియాస్ సుల్తాన్ ప్రస్తుతం పాకిస్తాన్‌లో నివసిస్తున్నారు.భారత భద్రతా దళాలపై రాజౌరీ దాడుల వెనుక ప్రధాన నిందితుడు ఇతడేనని భద్రతా దళాలు తెలిపాయి.పక్షం రోజుల్లో 10 మంది సైనికులను కోల్పోయిన తర్వాత, భారత సైన్యం ఉగ్రవాదులపైకి నేరుగా వెళ్లకుండా, ఉగ్రవాద నిరోధక వ్యూహాలను కూడా సక్షిస్తోంది. కంది అటవీ ప్రాంతంలో జరిగిన ఎల్‌ఇటి ఉగ్రవాదుల దాడి ఘటనపై ఇంటెలిజెన్స్ సక్షించడానికి ఆర్మీ కమాండర్‌లతో పాటు భారత ఉన్నతాధికారులు శనివారం శ్రీనగర్‌కు వచ్చారు.