Take a fresh look at your lifestyle.

నేడు లష్కర్‌ ‌బోనాలు..భారీగా ఏర్పాట్లు

శాంతి భద్రతలపై పోలీసుల ప్రత్యేక దృష్టి
సికింద్రాబాద్‌ ‌లష్కర్‌ ‌బోనాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సీపీ అంజనీ కుమార్‌ ‌వెల్లడించారు. శాంతి భద్రతలకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. 2500 మందితో భద్రతను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే ఆలయ కమిటీలతో సమావేశం ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన చర్యలను చర్చించామన్నారు. ఆలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. కోవిడ్‌ ‌నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని..ప్రజలందరూ పోలీసులకు సహకరించాలన్నారు. ట్రాఫిక్‌ ‌మళ్లింపును గమనించాలన్నారు. పోలీసులకు సహకరించి అందరూ బోనాలు విజయవంతం చేయాలన్నారు. పోలీసులు, పేలుడు పదార్థాల నిపుణులు జాగిలాలతో పలు దఫాలుగా ఆలయం, పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్‌ అవాంతరాలు లేకుండా చేస్తున్నారు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. గతేడాది కొరోనాతో ఆగిన బోనాలు ఇప్పుడు మళ్లీ వేడుకగా జరుపుకునేందుకు బోనాల జాతరకు లష్కర్‌ ‌సిద్ధమైంది. నేడు ఆదివారం  బోనాలు, సోమవారం రంగం జరగనున్నాయి. కోవిడ్‌ ‌కారణంగా గతేడాది సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి బోనాలు సమర్పించలేదని నిరాశ చెందిన భక్తులకు ఈ ఏడాది ఆ అవకాశం లభించనుంది. బోనాలకు అశేష సంఖ్యలో తరలివొచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. అమ్మవారికి ఆచారంగా తనవంతుగా బంగారు బోనం సమర్పిస్తారు. ఆ తరవాత నుంచి భక్తులను అనుమతించనున్నారు. వీవీఐపీలు, ప్రజా ప్రతినిధులు అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అధికారులు రోడ్లు, పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాలను మెరుగుపరిచారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించడానికి విద్యుత్‌ ‌శాఖ అధికారులు ట్రాన్స్‌ఫార్మర్‌ను సిద్ధం చేశారు.

Leave a Reply