Take a fresh look at your lifestyle.

పెట్రో ధరలపై భగ్గుమన్న వామపక్షాలు

  • విజయవాడలో ఉద్రిక్తంగా లెఫ్ట్ ‌ధర్నా
  • నేతలను అడ్డుకుని అరెస్ట్ ‌చేసిన పోలీసులు
  • ప్రజలపై 36 లక్షల కోట్ల భారం మోపారిన మండిపడ్డ మధు

విజయవాడ,జులై 26 : పెట్రోలు, డీజిల్‌ ‌ధరల పెంపును నిరసనగా వామపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆధ్వర్యంలో విజయవాడలో చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పెంచిన గ్యాస్‌, ‌పెట్రోల్‌ ‌ధరలను తగ్గించాలంటూ సీపీఎం నేతలు డిమాండ్‌ ‌చేశారు. ధర్నాకు దిగిన నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి.. పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ గ్యాస్‌, ‌పెట్రోల్‌, ‌డీజిల్‌పై పెంచిన ధరలు తగ్గించే వరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో ఆందోళనలు జరుగుతాయని చెప్పారు. ప్రధాని మోదీ ప్రజలపై రూ. 36 లక్షల కోట్ల పన్నులు వేశారని మధు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ ధర్నా పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలను అడ్డగోలుగా పెంచుతుందని మండిపడ్డారు.

గత ఒక సంవత్సరంలో 1.25 లక్షల కోట్ల రూపాయిల ఎక్సైజ్‌ ‌సుంకాలను మోడీ ప్రభుత్వం ప్రజలపై మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 7సంవత్సరాలలో పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు పెంచి మోడీ హయాంలో ఏకంగా రూ. 36లక్షల కోట్లు ప్రజల నుండి వసూలు చేసిందని విమర్శించారు. విజయవాడలో జరిగిన ఈ పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పోరాటానికి నాంది పలుకుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేలా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కేరళలో పినరాయి ప్రభుత్వం పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌పై రాష్ట్ర వ్యాట్‌ ‌ను తగ్గించినట్టు రాష్ట్రంలో కూడా తగ్గించాలని డిమాండ్‌ ‌చేశారు. సిహెచ్‌ ‌బాబూరావు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా కూడా పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌పై రూ.64 పన్ను ఉండదని ఎద్దేవా చేశారు. సిపిఐ పార్టీ నాయకులు దోనేపూడి శంకర్‌ ‌మాట్లాడుతూ పన్నుల పెంపు, ప్రజలపై భారాలు వేయడం తప్ప మరో పని లేదన్నట్లు వ్యవహరిస్తోందన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని అన్నారు.

అరెస్టు చేసిన వారిని పోలీసులు సింగ్‌నగర్‌, ‌నున్న పోలీస్‌ ‌స్టేషన్‌లకు తరలించారు. ఆందోళనకు దిగిన వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ధర్నా చౌక్‌లో ఉద్రిక్తత నెలకొంది. కేంద్రం ఇష్టారాజ్యంగా పెంచుతున్న పెట్రోలు, డీజిల్‌ ‌ధరలను తగ్గించాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి పి.మధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్‌.‌బాబూరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు డి.వి.కృష్ణ, డి.కాశీనాథ్‌, ‌సిపిఐ నాయకులు దోనేపూడి శంకర్‌, ‌భాస్కరరావు, వి.నాగేశ్వరరావు తదితరులు, ఎంసిపిఐ నాయకుడ ఖాదర్‌ ‌బాషా తదితరులు రోడ్డుపై బైఠాయించారు. అంతకు మందు ఆటో ప్రదర్శన ఏర్పాటు చేయగా పోలీసులు వాటిని అడ్డుకున్నారు. దీంతో నాయకులు నిలిపేసిన ఆటోలను విడిపించుకుని అలంకార్‌ ‌సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులు, నాయకులకు మధ్య స్వల్ప వాగ్వివాదం జరిగింది. తాము నిరసన వ్యక్తం చేస్తామని చెప్పినా పోలీసులు అంగీకరించలేదు. దీంతో మధు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులను నిరసిస్తూ నాయకులు నున్న పోలీస్‌ ‌స్టేషన్‌లో బైఠాయించారు. అక్రమంగా అరెస్టులను ఖండించారు. అరెస్టయినవారిలో సిపిఐ(యం) నాయకులు బోజెడ్ల నాగేశ్వరరావు, భూపతి రమణ, గురుమూర్తి, ఆదిలక్ష్మి, సీతారామయ్య తదితరులు ఉన్నారు.

Leave a Reply