Take a fresh look at your lifestyle.

వ్యవసాయరంగానికే పెద్ద పీట..

గురువారం రాష్ట్ర శాసనసభలో ఆర్థిక మంత్రి టి. హరీష్‌రావు ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం వ్యవసాయరంగానికే పెద్ద పీట వేసినట్లు కనిపిస్తున్నది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణ వారికి వ్యవసాయం చేయడమేరాదని ఎక్కిరించిన వారు ఈర్షపడే విధంగా ఆ రంగంలో జరిగిన పురోగతిని హరీష్‌రావు బడ్జెట్‌ ‌సమర్పించే క్రమంలో ఎత్తిచూపారు. గతంలో కంటే తెలంగాణ ప్రాంతంలో కనీవినీ ఎరుగనంతంగా ఈ రంగం అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీసుకున్న చర్యలేకారణంగా ఆయన చెప్పుకొచ్చారు.

ఈ రంగం ఇంకా మెరుగు కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు చేపట్టిన చర్యల కారణంగా దేశంలోనే అగ్రస్థానానికి రాష్ట్ర చేరుకోవడం గర్వకారణమన్నారు. అందుకు ఈ యాసంగిలో యాభై రెండు లక్షల ఎకరాల్లో సాగు చేయడంద్వారా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన నిలిచిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అలాగే అత్యధికంగా పత్తిని పండించి దేశంలోని రెండవ రాష్ట్రంగా తెలంగాణ పేరు తెచ్చుకోవటం గర్వించదగ్గ విషయమన్నారు. దేశమంతా కొరోనా కష్టాలు ఎదుర్కుంటున్న క్రమంలో అన్ని రంగాలు దెబ్బతిన్నప్పటికీ తెలంగాణలో ఈ రంగం నిలబడగలిగిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి రైతాంగానికి ఇచ్చిన ప్రోత్సాహమే కారణంగా హరీష్‌రావు పేర్కొన్నారు.

రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడినప్పటినుండి బేరీజు వేసుకుంటే అంటే 2014-15లో రాష్ట్రంలో సాగువిస్తీర్ణం 1.41 కోట్ల ఎకరాలు కాగా, అదిప్పుడు 2.10 కోట్లకు చేరింది. అదేవిధంగా 2014-15లో 2.05 కోట్ల మెట్రిక్‌ ‌టన్నులుగా ఉన్న పంటల ఉత్పత్తి ఇప్పుడు 4.11 మెట్రిక్‌ ‌టన్నులకు చేరుకుందన్నదని ఓ అంచనా. అలాగే వరిధాన్య సేకరణలో రాష్ట్రం 2వ స్థానంలో ఉన్నట్లు సాక్షాత్తు ఎఫ్‌సిఐ ప్రకటించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. విచిత్రమేమంటే కెసిఆర్‌ ‌ప్రవేశపెట్టిన వ్యవయ పథకాలపట్ల ఐక్యరాజ్య సమితి కూడా ప్రశంసలు కురిపించడం, ఈ పథకాలు దేశానికే మార్గదర్శకాలుగా నిలవడం ఈ రంగంలో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతికి అద్దంపుడుతున్నదని చెప్పుకొచ్చిన హరీష్‌రావు ఈసారి బడ్జెట్‌లో ఈ రంగానికి 25వేల కోట్ల రూపాయలను కేటాయించిన విషయాన్ని తెలిపారు.

- Advertisement -

అంతేకాకుండా ఈ రంగం అనుబంధ విభాగాలకు కూడా బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు చేశారు. ఈ రంగంలో వినియోగించే పరికరాల ఆధునీకరణకోసం మరో 15 వందల కోట్లను కేటాయించారు. ఈ రంగంలో ముడిపడిఉన్న రైతుల భీమాకోసం 12 వందల కోట్లు, సమగ్ర భూ సర్వేకోసం 400 కోట్లను ఈ బడ్జెట్‌లో కేటాయించారు. ఇప్పటికే వేలాది మంది రైతులను ఆర్థికంగా ఆదుకుంటున్న క్రమంలో కొత్త బడ్జెట్‌లో రైతు బంధుకోసం 14వేల ఎనిమిది వందల కోట్లను, అలాగే రైతు సంక్షేమం కోసం 338 కోట్లతో పాటు, వ్యవసాయ రుణమాఫీకోసం అయిదువేల 225 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు.

అదే విధంగా ఈ రంగంతో ముడివడి ఉన్న సాగునీటి, పశువర్థక శాఖకు కూడా నిధులు కేటాయించడంద్వారా రైతుకు మరింత చేరువ కావాలని టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ ధ్యేయంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. సాగునీటి రంగానికి 16వేల 931 కోట్లను కేటాయించగా, పశుసంవర్థక, మత్స్యశాఖకు 1730 కోట్లను కేటాయించారు. దీని తర్వాత విద్యారంగానికి ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత నిచ్చినట్లు కనిపిస్తున్నది. పాఠశాల విద్యకోసం 11వేల 735 కోట్లను, ఉన్నత విద్యకు 1873 కోట్లను, పాఠశాల భవనాల ఆధునీకరణ కోసం 2వేల కోట్లను, సరికొత్త విద్యా ప్రమాణాలకోసం 4వేల కోట్ల రూపాయలను ఈ బడ్జెట్‌లో కేటాయించారు.

Leave a Reply