- నిమ్స్ తరహాలో నిర్మించాలని ప్రభుత్వం యోచన
- అన్నింటికీ అటానమస్ హోదా
- మంత్రి హరీష్ రావు చొరవతో పనుల్లో వేగం
ప్రజాతంత్ర, హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు నాలుగు వైపులా పెద్ద దవాఖానాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాజధానిలోని పెద్ద దవాఖానాలైన ఉస్మానియా, గాంధీ దవాఖానాలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రోగులు వేల సంఖ్యలో వస్తుంటారు. ఈ రద్దీని నియంత్రించడానికి ప్రభుత్వం రాజధాని హైదరాబాద్‌కు నాలుగు వైపులా అన్ని సౌకర్యాలతో కూడిన దవాఖానాలను నిర్మించనుంది. దీనికి సంబంధించి గతంలోనే నిర్ణయం జరిగినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల పనుల్లో పురోగతి సాధ్యం కాలేదు. అయితే, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు బాద్యతలు స్వీకరించిన అనంతరం ఈ ఫైలుపై ప్రత్యేక దృష్టి సారించారు. నిమ్స్ తరహాలో నగరానికి నాలుగు వైపులా భారీ దవాఖానాలను నిర్మించాలనీ, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలనిన సంబంధిత శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం ఉన్న నిమ్స్ తరహాలోనే నగరంలో నాలుగు భారీ దవాఖానాలను నిర్మించాలనీ, ఈ దవాఖానాలకు నిమ్స్ మాదిరిగానే అటానమస్ హోదాను ఇవ్వనున్నారు. దీంతో ప్రస్తుతం గాంధీ,ఉస్మానియా దవాఖానాలపై పడుతున్న భారం తగ్గి రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఏర్పడుతుంది. దీనికి తోడు రోగికి అవసరాన్ని బట్టి అక్కడికక్కడే వైద్య సదుపాయాలు అందించడానికి వీలు కలుగుతుంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో నాలుగు భారీ దవాఖానాల నిర్మాణానికి సంబంధించి రంగం సిద్ధమైంది. మంగళవారం మంత్రి హరీష్ రావు వైద్య, ఆరోగ్య శాఖపై నిర్వహించనున్న సమీక్షా సమావేశంలో నాలుగు భారీ దవాఖానాల నిర్మాణానికి సంబంధించి స్పష్టత రానుందని వైద్య,ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.