Take a fresh look at your lifestyle.

పెద్ద పండుగ సంక్రాంతి

‘‘ ‌హరిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు. బసవన్న చిందులు శివుని ప్రత్యక్ష దైవంగా,  హరి దాసును విష్ణుమూర్తి స్వరూపం గాను భావిస్తాం. ధనుర్మాసం లో భోదించే విష్ణుతత్వం హరి నామస్మరణంభక్తి తత్వాని దానగుణం అలవర్చుకోవాలి అని బోదిస్తున్నాయి. ’

సంక్రాంతి పండుగ పుష్య మాసంలో వస్తుంది.ఇది మూడు రోజుల పండుగ. దీనిని పెద్ద పండుగగా పరిగణిస్తాం. మార్గశిర మాసం, పుష్య మాసాలు హేమంత ఋతువులో వస్తాయి. ఇది చలికాలం. చలి గజగజా వణికిస్తుంటుంది. ఈ రోజుతో దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ రోజున స్వర్గ వాకిళ్లు తెరుస్తారని హిందువుల నమ్మకం.  సంక్రమణం అంటే మారడం అని అర్థం. ఈ సంక్రమణం  పదం నుండి పుట్టిందే సంక్రాంతి, సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం జరుగు తుందో అపుడే సంక్రాంతి, అందుచేత సంవత్స రానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి, సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉన్నపట్టికి పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతల గాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది, ఇది ఇంగ్లీష్‌ ‌సంవత్సర కాలెండర్‌ ‌ప్రకారం మొదటి నెల అయిన జనవరి మాసంలో వస్తుంది, మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణ పథంలోకి అడుగుపెడతాడు, అలా సూర్యుడు ఉత్తరాయణ పథంలోకి అడుగుపెట్టిన ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి.

పెద్ద పండుగ సంక్రాంతి, ఇది కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు( భోగి, మకర సంక్రమణం, కనుమ) ఇతర ప్రాంతాలలో నాలుగు రోజులు (నాలుగోరోజు ముక్కనుమ) జరుపతారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి రైతుల పండుగగా  దీన్ని అభివర్ణిస్తారు. పొలం నుంచి ఇంటికి తెచ్చిన కొత్త పంటతో పొంగలి నైవేద్యం భగవంతునికి చెల్లించి, వారిని విడిచివెళ్లిన పెద్దలకు వస్త్రం సమర్పించి కుటుంబాన్ని చల్లగా చూడమని నమస్కరిస్తూ ప్రాదిస్తారు.రాళ్ళూ రప్పలూ లేకుండా ఒక పద్దతిలో అలకిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతం, ఒక పద్దతిలో పెట్టబడు చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం, చుక్కల చుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్ళలో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పడికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం, ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్యు స్థానానికి సంకేతం, ఇంకొక దృక్పథంలో గీతలు స్థితశక్తికి, చుక్కలు గతిశక్తికి సంకేతాలని మరియు ముగ్గులు శ్రీ చక్ర సమర్పనా ప్రతీకలని శక్తి తత్త్వవేత్తలు అంటారు, ఇక వివిధ ఆకారాలతో వేయు ముగ్గులు విల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికీ, పుష్పం పుష్యమీ నక్షత్రానికీ పాము ఆకారము ఆశ్లేష కూ, మేక, ఎద్దు, పీత, సింహం, ఇలాంటివి మేష , వృషభ, మిధున, కర్కాటక రాసులకూ, తొమ్మిది గడుల ముగ్గు నవగ్రహాలకూ సంకేతాలుగా చెప్పచ్చు.

సంక్రాంతి రధం ముగ్గు విశిష్టత : మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే సంక్రాంతి పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రధం ముగ్గు. అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలసి సహజీవనం సాగించాలి అనే సంకేతాలతో ఒక రధం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ పోతూంటారు.సంక్రాంతి గొబ్బెమ్మలు : పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలకు సంకేతం, ఎందుకంటే ఈ గొబ్బెమ్మలు పెట్టే ఆడపిల్ల కూడా ఆ చిలిపి కృష్ణుని గోపిక అయి ఉండవచ్చు, ఈ ముగ్గుల తలమీద కనుపించే రంగుల పూలరేకులు, పసుపు కుంకుమలు ఆ గోపికలందరూ భర్తలు జీవించియున్న పుణ్య స్త్రీలకు సంకేతం, ఆ గోపికా స్త్రీల రూపాలకు సంకేతమే గోపీంబొమ్మలు• గొబ్బెమ్మలు, మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం, సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణ భక్తి తమకూ కలగాలని ప్రార్ధిస్తుంటారు, దీనినే సందె గొబ్బెమ్మ అంటారు, గొబ్బెమ్మలు పొద్దున పూట ముగ్గులో ఉంచి, దానిపై గుమ్మడి పూలుతో అలంకారం చేస్తే చాలా అందంగా ఉంటుంది.

భోగిపళ్ళు : భోగి పండ్లు అంటే రేగుపండ్లు, ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు, సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో బోగిపండ్లు పోస్తారు.
తిల తర్పణం : సంవత్సరంలో మిగిలిన రోజులలో నల్ల నువ్వులు వాడరు, కాని సంక్రాంతి పర్వధినాన మాత్రం నల్లనువ్వులతో మరణించిన పిత్రుదేవతలందరికీ తర్పణలిస్తుంటారు, దీన్నే పెద్దలకు పెట్టుకోవడం అంటుంటారు, సంక్రాంతి పర్వధినాలలో వారి వారి ఆచార సంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమం  చేస్తుంటారు, ఈ రోజు బూడిద గుమ్మడి కాయ దానం  ఇస్తారు.

సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో సుందర దృశ్యం. గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి, ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు అందరికి ఆనందాన్ని కలిగిస్తాయి, అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు, కొత్త దాన్యము వచ్చిన సంతోషంతో మనము వారికి దాన్యము ఇస్తాము, హరిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు. బసవన్న చిందులు శివుని ప్రత్యక్ష దైవంగా,  హరి దాసును విష్ణుమూర్తి స్వరూపం గాను భావిస్తాం. ధనుర్మాసం లో భోదించే విష్ణుతత్వం హరి నామస్మరణంభక్తి తత్వాని దానగుణం అలవర్చుకోవాలి అని బోదిస్తున్నాయి.

నిజానికి ధనుర్మాసారంభంతో నెల రోజులు ముందుగానే సంక్రాంతి వాతావరణం చలిచలిగా తెలుగునాట ప్రారంభమవుతుంది, ఆ నెల రోజులు తెలుగు పల్లెలు ఎంత అందంగా, ఆహ్లాదకరంగా జంగందేవరుల శివ తత్వాలతో, హరిదాసుల హరినామ సంకిర్తనల పలకరింపులతో, ప్రతి ఇంటి ముందు రంగవల్లులతో అలరారుతాయి, బుడబుక్కలవాళ్లు, పగటివేషధారులు, రకరకాల జానపద వినోద కళాకారులు ప్రతి ఇంటి ముందుకు వచ్చి దానం స్వికరించి, తమకు దానం ఇచ్చిన ఇల్లు ధన, ధాన్య, సుఖ సంతోషాలతో  ఉండాలి అని ఆశీర్వచనాలు అందించి వెళ్తారు, ఇంటిలో వున్న ఆడపడుచులు ప్రతీ రోజు తమ ఇళ్ళ ముంగిళ్ళను రంగవల్లులు, గొబ్బెమ్మలతో, గొబ్బెమ్మలలో పసుపు, కుంకుమ, పూవులు, రేగిపళ్ళు, పోసి అలంకరిస్తారు, ముగ్గులు వేయటానికి ప్రత్యేకంగా బియ్యపు పిండిని వాడతారు, ఆరు కాలాలు కష్టించి పండించిన పంట కళ్లం నుంచి ఇంటిలో వున్న బళ్ల మీదకు ధాన్యం బస్తాలుగా వస్తూ ఉంటాయి, సంక్రాంతి పండుగకు కొత్త అల్లుడు తప్పనిసరిగా అత్తవారింటికి వస్తాడు. కోడి పందాలు, ఎడ్ల బళ్ళ పందాలు జరుగుతాయి, ఇవన్నీ సంక్రాంతి పండుగకు శోభ చేకూర్చే సర్వసామాన్య విషయాలు.
– నందిరాజు రాధా కృష్ణ ,సీనియర్‌ ‌జర్నలిస్ట్

Leave a Reply