Take a fresh look at your lifestyle.

కర్ణ్‌ప్రయాగ్‌లో విరిగిపడుతున్న కొండచరియలు

డెహ్రాడూన్‌, ‌జనవరి 11 : ఉత్తరాఖండ్‌లోని కర్ణ్‌ప్రయాగ్‌లో కూడా జోషీమఠ్‌ ‌తరహా పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. చాలామంది వారి ఇండ్లను వదిలి వేరే చోట్లకు వెళ్తున్నారు. పలు చిన్నచిన్న కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలు కూడా జరుగు తున్నాయి. దీంతో కర్ణ్‌ప్రయాగ్‌ ‌ప్రజలు తమను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. స్థానిక మున్సిపాలిటీ కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పుష్కర్‌ ‌సింగ్‌ ‌ధామి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ సాయాన్ని అభ్యర్థించింది. ఈ పట్టణంలో 50 ఇండ్లకు పగుళ్లు ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు.జోషీమఠ్‌లో పగుళ్లు ఏర్పడి ఒరిగిపోతూ ప్రమాదకరంగా ఉన్న మలరి ఇన్‌, ‌మౌంట్‌ ‌వ్యూ హోటళ్లను కూల్చేసేందుకు ఎస్డీఆర్‌ఎఫ్‌ ‌సిద్ధమైంది. అయితే, తమకు పరిహారం ఇచ్చిన తర్వాతనే కూల్చివేయాలని హోటళ్ల యాజమానులు ఆందోళనకు దిగారు.

ఎన్టీపీసీ తపోవన్‌  ‌విష్ణుగడ్‌ ‌ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్థానికుల ఆందోళన కొనసాగుతున్నది. జోషీమఠ్‌ ‌మాత్రమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ప్రమాదంలో ఉన్నాయని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌రిమోట్‌ ‌సెన్సింగ్‌ ‌సంస్థ అధ్యయనంలో తేలింది. ఈ మొత్తం ప్రాంతం ఏడాదికి 6.5 సెంటీటర్ల చొప్పున కుంగిపోతున్నదని వెల్లడైంది. జోషీమఠ్‌లో పరిస్థితిని జాతీయ విపత్తుగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ఉత్తరాఖండ్‌లో ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన జోషిమఠ్‌లో భూమి కుంగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో భూమి కోతకు గురికావడం, పగుళ్లతో భయానక పరిస్థితి నెలకొంది. దీంతో జోషిమఠ్‌ ‌కుంగిపోయే, కొండ చరియలు విరిగిపడే ప్రాంతంగా అధికారులు ఇప్పటికే గుర్తించారు. కాగా, జోషిమఠ్‌ ‌మాత్రమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ప్రమాదంలో ఉన్నాయని డెహ్రాడూన్‌కు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌రిమోట్‌ ‌సెన్సింగ్‌ ‌సంస్థ అధ్యయనంలో తేలింది.

జోషిమఠ్‌ ‌దాని పరిసర ప్రాంతాల్లోని భూమి ఏటా 2.5 ఇంచుల మేర కుంచించుకుపోతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. పట్టణంలో మొత్తంగా దాదాపు 4,500 భవనాలు ఉండగా ఇప్పటివరకు 678 భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. భూమి దిగబడటంతో జోషిమఠ్‌లో భవనాలు బీటలు వారుతున్నట్లు తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న భవనాలకు అధికారులు సీల్‌ ‌వేశారు. ఇప్పటికే 4000వేల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎముకలు కొరికే చలికాలంలో జోషిమఠ్‌ ‌వాసులు వారి ఇండ్ల నుంచి బయటకు వచ్చి తాత్కాలిక ఆశ్రమాలకు వెళ్లారు. మరోవైపు పగుళ్లు ఏర్పడిన ఇండ్లలో నివసిస్తున్న వారు వాటిని వదిలేసి వేరే ఇండ్లలో అద్దెకు ఉండాలని, ఇందుకు గాను 6 నెలల పాటు నెలకు రూ.4,000 చొప్పున అద్దె  చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

Leave a Reply