Take a fresh look at your lifestyle.

కబ్జాలతోనే జలవిలయం… అన్ని చోట్లా అంతే

వర్ష బీభత్సంతో తెలుగు రాష్ట్రాలు గజగజ వణికిపోతున్నాయి. ఇంట్లో ఉన్న వారికి సైతం రక్షణ లేదు. వర్షపు నీరు ఇళ్ళలోనే మోకాలు లోతు ప్రవహిస్తోంది. ఇందుకు మహానగరమైన హైదరాబాద్‌ ‌మినహాయింపు కాదని నిరంతర వార్తా స్రవంతుల్లో ప్రసారమవుతున్న చిత్రాలే ప్రత్యక్ష నిదర్శనం.   వీధులన్నీ కాలవలు అయిపోవడంతో సొంత ఇంటికి ప్రజలు మోకాలు లోతు నీటిలో ఈదుకుంటూ వెళ్ళాల్సిన దుస్థితి నెలకొంది. వందేళ్ళలో ఇలాంటి బీభత్సాన్ని చూడలేదని ఒకరు, ఇటీవల కాలంలో కనీవినీ ఎరుగమని మరొకరు ఇలా ఎవరి మటుకు వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి  అత్యంత విషమంగా ఉంది కనుకనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె చంద్రశేఖరరావు, వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డిలకు ఫోన్‌ ‌చేసి వాస్తవ పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కేంద్రం అండంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. భారీ వర్షాలకు వరదలు రావడం సహజమే. గతంలో చాలా సార్లు వొచ్చాయి. ఈసారి ఎందుకింత ఉధృతంగా వొచ్చిందని సింహావలోకనం చేసుకుంటే కాల్వలు, డ్రెయిన్లపై  అక్రమ కట్టడాలు, కబ్జాలే కారణమన్న సమాధానం వొచ్చింది. భారీ వర్షాలకు నదులతో పాటు వాగులు, వంకలు, కుంటలు పొంగి చేలు, చెలకలు, ఆవాస ప్రాంతాలు మునిగి పోయాయి. మహానగరంలోని అపార్టుమెంట్ల సెల్లార్లలోకి నీరు ప్రవేశించి విద్యుత్‌ ‌షాక్‌తో మరణాలు సంభవించాయి.

అయితే, గతంతో పోలిస్తే ఈ వర్షాలు మహా పెద్దవి కావని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. 1960 ప్రాంతంలో 30 నుంచి 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన సందర్భాలు ఉన్నాయనీ, అప్పుడు ఇలాంటి కబ్జాలు లేకపోవడం వల్ల నీరు సులభంగా పోయేదనీ, గతంలో ముసురుతో వరుసగా 15 రోజుల పాటు ధారాపాతంగా వర్షాలు పడిన సందర్భాలు ఉన్నాయనీ, అప్పట్లో ఊట చెరవులు సరస్సులు, నీటి కయ్యలు నీటితో నిండి వేసవిలో జలసిరి ఇచ్చేవని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. నీటి ప్రమాదాల గురించే కాదు, కాలుష్య ప్రమాదాల గురించి పర్యావరణ వేత్తలు పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నారు. అడవుల నరికివేతనూ, బాక్సైట్‌ ‌వంటి ఖనిజాల తవ్వకాలను వ్యతిరేకించేవారిని నక్సలైట్ల మిత్రులుగా ముద్ర వేసి జైళ్ళలో పెడుతున్నారు. ఇందుకు ఉదాహరణ విప్లవకవి వరవరరావు. ఇలాంటి వారెంతో మంది పాలక వర్గాల కక్షపూరిత చర్యలకు జైళ్ళలో మగ్గుతున్నారు.

భారీ వర్షాలే కాదు, ఓ మోస్తరు వర్షాలు కురిసినా రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. పట్టణాల్లో అయితే, గుంతలు, హైదరాబాద్‌ ‌వంటి నగరాల్లో మ్యాన హోల్స్ ‌నిండి నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. అడుగు తీసి అడుగు వేయడానికి వీలు లేని పరిస్థితులున్నాయి. ఈ కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే, వాహన చోదకులు, పాదచారులు వర్షాలు పడుతున్న సమయంలో బయటికి రావడానికి సాహసించడం లేదు.
ఆంధ్రాలో 900 చెరువులు, 432 చిన్న కాలువలు, తెలంగాణాలో 300 చెరువులు, 312 చిన్న కాలువలు కనుమరుగు అయినట్టు అంచనా.  ఇటీవల వరంగల్‌లో భారీ వర్షాలు సృష్టించిన బీభత్సానికి కబ్జాలే కారణమని తేలింది. ఆంధ్రాలో కూడా వేగంగా అభివృద్ది చెందుతున్న వరంగల్‌ ‌వంటి నగరాలు, పెద్ద పట్టణాలు ఈ మాదిరిగా కబ్జాలకు గురి కావడం వల్ల చిన్న పాటి వర్షానికే ముంపునకు గురి అవుతున్నాయి. కేరళ అనుభవం ఇంకా మన కళ్ళ ముందు మెదులుతోంది. పర్యాటక సీమగా ప్రసిద్ధి చెందిన కేరళలో రెండేళ్ళ క్రితం 14 జిల్లాల్లో వర్షబీభత్సం, వరదలకు  164 మంది మృత్యువాత పడ్డారు.

వాలు నీటి ప్రవాహం ఉండే జాగాల్లో విచ్చలవిడిగా కట్టడాల కారణంగానే జల ప్రళయం సంభవించినట్టు విచారణలో తేలింది. కిందటి సంవత్సరం కూడా కేరళను భారీ వర్షాలు భయపెట్టాయి. కబ్జాలనేవి ఒక రాష్ట్రానికో, ప్రాంతానికో పరిమితం అయినవి కావు. దేశ వాణిజ్య రాజధాని అయిన  ముంబాయి నగరం తరచూ వర్షబీభత్సానికీ, ముంపునకూ గురి కావడం చూస్తూనే ఉన్నాం. నగరాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని సంబుర పడుతున్న తరుణంలో దీనికి మరో పార్శ్వమైన కబ్జాల గురించి ఎవరూ పట్టించుకోకపోవడం, రాజకీయ నాయకుల అండదండలు ఉండటం వంటి కారణాలతో కబ్జాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వెంచర్లకు అనుమతి ఇస్తున్నారు. నగరపాలక, పురపాలక సంస్థల్లో టౌన్‌ ‌ప్లానింగ్‌ ‌విభాగం అలంకార ప్రాయంగానే ఉంటోంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, అస్మదీయుల కబ్జాలకు అండగా నిలుస్తున్నందువల్లనే ఈ పరిస్థితి దాపురిస్తోంది. విశ్వనగరంగా మనం చెప్పుకుంటున్న జంటనగరాల పరిస్థితి ఇప్పుడు ఎంత దయనీయంగా ఉందో టీవీ ప్రసారాలు తిలకిస్తున్న వారందరికీ వేరే చెప్పనవసరం లేదు. చెరువులు, నీటి చెలమలు, కాలువలపై ఇళ్ళ నిర్మాణాలు చేసే వారిని తన, పర భేదం లేకుండా కఠినంగా శిక్షించగలిగినప్పుడే ఇలాంటి విపత్తుల నుంచి ప్రజలకు రక్షణ కలుగుతుంది. కబ్జా చేసిన వారు దర్జాగా తమ ఇళ్ళలో ఉంటున్నారు. ఏ పాపమెరుగని సామాన్య, పేద ప్రజలే వర్ష, వరద బీభత్సాలకు నష్టపోతున్నారు. రాజకీయ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడానికి బదులు కబ్జాలకు  కారకులెవరో ఆత్మవిమర్శ చేసుకుంటే తిలాపాపం తలాపిడికెడు అన్న సంగతి స్పష్టం అవుతుంది.

Leave a Reply