కొందరి త్యాగాలే ఆ దేశ చరిత్రలో నిలిచిపోవటం సత్యం. అలా నిలిచిపోయిన చారిత్రక వ్యక్తుల కోవలోకి లాలా లజపతి రాయ్ వస్తారు. లాలాజీ జీవితం భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో ఒక మైలు రాయి. ఆనాటి ప్రజలను ఎందరినో వారి భావాలు, త్యాగాలు ప్రభావితం చేశాయి. వారి పిలుపు దేశ ప్రజల గుండెలలో మారుమోగి, లక్షలాది మంది భారతీయులు స్వాతంత్య్ర ఉద్యమంలోకి దిగి, ఆ మహాయజ్ఞంలో సమిధలు అయ్యారు. కోట్లాది ప్రజలకు ఆరాధ్య దేవతగా లాలాజీ వీరపూజలు అందుకున్నారు. ‘నేను మరణించవచ్చు, కాని నానుండి వెలువడే ప్రతి నెత్తురు చుక్క నుండి లక్షలాది స్వాతంత్య్ర సమరయోధులు ఉద్భవిస్తారు’ అని ప్రకటించిన లాలాజీ మాట నిజం అయింది. తన మరణానంతరం స్వాతంత్య్రోద్యమం మరింతగా విస్తృతం అవుతుందని తెలిసిన భవిష్యత్ దర్శకుని జీవితం మనకు స్పూర్తిదాయకం. లాలాజీ చరిత్ర ఏనాటిదో కావచ్చు. ఆనాటి సాంఫ్నిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులకు, ఈనాటికి పొత్తు లేకపోవచ్చు. వ్యక్తులకు గొప్పతనం కేవలం ఆపాదించటం వలన వస్తుందా, ఆపాదించుకుంటే చరిత్రలో అది నిలుస్తుందా, సామాన్యులు మాన్యులవటం ఏ ఏ విషయాలపై ఆధారపడి ఉంటుంది, సామాన్య కుటుంబాల నుండి అసామాన్యులు ఉద్భవించటం జరిగేపనేనా అనే విషయాలకు సమాధానం వీరి చరిత్ర నుండి వస్తుంది. అందుకై మనకు లాలాజీ చరిత్ర పఠనీయం.
లజపతిరాయ్ (జనవరి 28, 1865%–% నవంబర్ 17, 1928) పంజాబ్‌లోని దుఢికె అనే చోట పుట్టారు. తండ్రి రాధాకిషన్, తల్లి గులాబ్‌దేవి. రాధాకిషన్ ఉర్దూ, పర్షియన్ బోధించే పాఠశాల ఉపాధ్యాయుడు. చాలామంది బిడ్డల మీద తండ్రి ప్రభావం ఉన్నట్టే, చిన్నారి లజపతిరాయ్ మీద రాధాకిషన్ ప్రభావమే ఉండేది. అంటే ఇస్లాం ప్రభావమే. రాధాకిషన్ సర్ సయ్యద్ అహమ్మద్ ఖాన్‌కు వీరాభిమాని. అహమ్మద్ ఖాన్ భారతీయ ముస్లిం సమాజ సంస్కరణకి తోడ్పడిన వారు. అయితే ఆ సంస్కరణ ఇస్లాం పరిధిని దాటని సంస్కరణ. ముస్లింలు జాతీయ కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.ఇంగ్లిష్ జాతి భారత్‌ను వీడిపోయిందంటే భారతీయ ముస్లింలు హిందువుల పాలన కిందకి రావలసి వస్తుందంటూ ప్రచారం ఆరంభించినవారిలో ఆయన కూడా ఒకరు. ఆయన అభిప్రాయాలను, రచన లను రాధాకిషన్ అభిమానించేవారు. అందుకే మతం మారకపోయినా ఇస్లాంను ఆరాధిస్తూ ఉండేవారు. తండ్రి ప్రభావమే లజపతిరాయ్ మీద ఉంది. తల్లి గులాబ్‌దేవి మీద సిక్కు మత ప్రభావం ఉండేది. ఇలా రెండు వేర్వేరు మతాల ప్రభావాల మధ్యన హిందువుగానే ఎదిగినవారు లజపతి.
తండ్రి ఎక్కడికి బదిలీ అయితే అక్కడే లజపతిరాయ్ ప్రాథమిక విద్య సాగింది. ఇదంతా పంజాబ్, లాహోర్, నేటి హరియాణా ప్రాంతాలలో సాగింది. 1880లో ఆయన లాహోర్ లోని ప్రభుత్వం న్యాయ కళాశాలలో చేరారు. ఇక్కడే లాలా హన్స్‌రాజ్, పండిత్ గురుదత్‌లతో పరిచయం ఏర్పడింది. వీరంతా అప్పటికే ఆర్య సమాజ్‌లో క్రియాశీలకంగా ఉన్నారు. అప్పుడప్పుడే లజపతిరాయ్‌కి ఆర్య సమాజ్ మీద ఆసక్తి ఏర్పడుతోంది. కానీ ఆయన 1881లో బ్రహ్మ సమాజ్‌లో చేరారు. అందుకు కారణం తన తండ్రి ఆప్తమిత్రుడు పండిత్ శివనారాయణ్ అగ్నిహోత్రి. అటు మిత్రుల ద్వారా ఆర్య సమాజ్ ప్రభావం, ఇటు అగ్నిహోత్రి ద్వారా బ్రహ్మ సమాజ్ ప్రభావం కలసి లజపతిరాయ్ మీద ఉన్న ఇస్లాం ప్రభావాన్ని పలచబారేలా చేశాయి.
బ్రహ్మ సమాజ్‌లో ఉన్న మూడు వర్గాలు, వాటి వివాదాలు లజపతిని పూర్తిగా ఆర్యసమాజ్ వైపు తిరిగిపోయేటట్టు చేశాయి. కానీ తండ్రి దయానంద బోధనలను ఇష్టపడేవారు కాదు. అయినప్పటికీ ఆర్య సమాజ్ను లజపతిరాయ్ ఎన్నుకున్నారు. నిజానికి తాను ఆర్య సమాజ్ను అభిమానించినది అందులో కనిపించే మత సంస్కరణ, మత కోణాల నుంచి కాదనీ, అది ప్రబోధించిన జాతీయ దృక్పథంతోనే అనీ ఒక సందర్భంలో చెప్పుకున్నారు కూడా. 1886లో ఆయన ప్లీడర్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఆ సంవత్సరమే ఎంతో ప్రతిష్టాత్మకమైన దయానంద ఆంగ్లో వేదిక్ పాఠశాలను కూడా స్థాపించారు. లాహోర్‌లో ఆరంభమైన ఈ పాఠశాల ఉద్దేశం సాంప్రదాయక భారతీయ విద్యా వ్యాప్తి. ఆ సమయంలోనే హిస్సార్, లాహోర్లలో లజపతిరాయ్ మంచి న్యాయవాదిగా కూడా పేర్గాంచారు.
బెంగాల్ విభజనోద్యమం అంటే, గాంధీజీ రాక మునుపు కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగిన పెద్ద ప్రజా ఉద్యమం. ఇందులో బెంగాల్ నుంచి అరవింద్ ఘోష్, బిపిన్‌చంద్ర పాల్, మహరాష్ట్ర నుంచి బాలగంగాధర్ తిలక్, పంజాబ్ నుంచి లాలాజీ కీలక నేతలుగా అవతరించారు. ఇంకా రవీంద్రనాథ్ టాగోర్, చిత్తరంజన్‌దాస్, సోదరి నివేదిత వంటివారు ఎందరో ఈ ఉద్యమంలో పనిచేశారు. ఈ ఉద్యమంలో స్వదేశీ ఉద్యమం చాలా కీలకమైనది. ఇందులో ఎక్కువ పాత్ర లజపతిరాయ్‌దే. స్వదేశీ ఉద్యమంలో భాగమే జాతీయ విద్య. జాతీయ కళాశాలల ఏర్పాటు కూడా అందులో భాగమే. అలా లజపతిరాయ్ లాహోర్‌లో జాతీయ కళాశాలను ఏర్పాటు చేశారు. అందులోనే భగత్‌సింగ్ చదువుకున్నారు.
1927లో సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చింది. అందులో ఒక్క భారతీయుడైనా లేనందుకు నిరసనగా ఉద్యమం ఆరంభమైంది. ఇందులోనూ లాల్జీ కీలక పాత్ర వహించారు. సైమన్ కమిషన్‌ను బహిష్కరించాలంటూ పంజాబ్ అసెంబ్లీలో ఆయన పెట్టిన తీర్మానం కూడా కొద్ది తేడాతోనే అయినా గెలిచింది. ఇది ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. అక్టోబర్ 30, 1928న ఆ కమిషన్ లాహోర్ వచ్చింది. గాంధీజీ ఆశయం మేరకే అయినా లాల్జీ కూడా అహింసతో, మౌనంగా సైమన్ వ్యతిరేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇలా మౌనంగా ఉద్యమిస్తున్న వారిపైన కూడా లాఠీ చార్జికి ఆదేశించాడు పోలీసు సూపరింటెండెంట్ జేమ్స్ ఏ స్కాట్. తను స్వయంగా లాల్జీ మీద దాడి చేశాడు. లాల్జీ ఛాతీ మీద స్కాట్ కొట్టిన లాఠీ దెబ్బలు చాలా తీవ్రమైనవి.
ఆ దెబ్బలతోనే లాల్జీ నవంబర్ 17న చనిపోయారు. ఇందుకు చంద్రశేఖర్ ఆజాద్ నాయకత్వంలో భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్ తదితరులు ప్రతీకారం తీసుకోవాలని కోరుకున్నారు. కానీ స్కాట్‌ని చంపాలని అనుకుని జాన్ పి. సాండర్స్ అనే మరొక అధికారిని కాల్చి చంపారు. లజపతిరాయ్ ఆలోచనా విధానంలో మార్పులు ఎలా ఉన్నా ఆయన ప్రధానంగా మానవతావాది. అందుకు ఈ ఉల్లేఖనే సాక్ష్యం. ‘భారతీయ పత్రికలని శాసించే అధికారమే నాకు ఉంటే, ఈ మూడు శీర్షికలు మొదటి పేజీలో ఉండాలని చెబుతాను. పసివాళ్లకి పాలు, తినడానికి పెద్దలకు తిండి, అందరికీ విద్య.
