Take a fresh look at your lifestyle.

‌ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలచిన ‘లాలాజీ’

‘‘అమాయక పౌరుల మీద దాడులకు దిగే ప్రభుత్వానికి నాగరిక ప్రభుత్వమని చెప్పుకునే హక్కు లేదు. అలాంటి ప్రభుత్వాలు ఎక్కువ కాలం కొనసాగలేవు కూడా’’. స్వాతంత్య్ర పోరాట చరిత్రలో పంజాబ్‌ ‌సింహమంటూ కీర్తి పొందిన లాలా లజపతిరాయ్‌ ఒక సందర్భంలో అన్నమాటలివి. ఆ మాటలు ఆయన కన్నుమూసిన రెండు దశాబ్దాలకు నిజమయ్యాయి. లాలాజీ చరిత్ర ఏనాటిదో కావచ్చు. ఆనాటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులకు, ఈనాటికి సామ్యం లేకపోవచ్చు. వ్యక్తులకు గొప్పతనం కేవలం ఆపాదించటం వలన వస్తుందా, ఆపాదించుకుంటే చరిత్రలో అది నిలుస్తుందా, సామాన్యులు మాన్యులవటం ఏ ఏ విషయాలపై ఆధారపడి ఉంటుంది, సామాన్య కుటుంబాల నుండి అసామాన్యులు ఉద్భవించటం జరిగే పనేనా అనే విషయాలకు సమాధానం లాలాజీ చరిత్ర నుండి వస్తుంది. అందుకే లాలాజీ చరిత్ర స్మరణీయం, పఠనీయం.’’

సందర్భాలను బట్టి త్యాగాలు ఎందరు చేసినా, కొందరి త్యాగాలే  దేశ చరిత్రలో నిలిచి పోవటం సత్యం. అలా నిలిచి పోయిన చారిత్రక వ్యక్తుల జాబితాలో అగ్ర నేతల సరసన ఉంటారు లాలా లజపతి రాయ్‌. ‌లాలాజీగా ముద్దుగా పిలుచుకునే లజపతి రాయ్‌ ‌జీవితం భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో ఒక మైలు రాయి. ఆనాటి ప్రజలను ఎందరినో ఆయన భావాలు, త్యాగాలు ప్రభావితం చేశాయి. లాలాజీ పిలుపుతో లక్షలాది మంది భారతీయులు స్వాతంత్య్ర ఉద్యమంలోకి దిగి, ఆ మహా యజ్ఞంలో సమిధలు అయినారు. కోట్లాది ప్రజలకు ఆరాధ్య దైవంగా లాలాజీ వీర పూజలు అందుకున్నారు.

స్వదేశీ ఉద్యమాన్ని, ఆర్య సమాజాన్ని, అతివాద రాజ కీయాలను సమన్వయ పరచిన లాలా లజపతిరాయ్‌ ‌భారత జాతీయ అగ్ర నాయకులలో ఒకరు. లాల్‌-‌బాల్‌-‌పాల్‌ ‌గా ప్రసిద్ధి చెందిన లాల్‌(‌లాలా లజపత్‌ ‌రాయ్‌), ‌బాల్‌(‌బాలగంగాధర తిలక్‌), ‌పాల్‌(‌బిపిన్‌ ‌చంద్రపాల్‌) ‌త్రయంలో ఒకరిగా భారతదేశ చరిత్రలో లజపతిరాయ్‌కి ఖ్యాతి ఉంది. లాల్‌ అం‌టే లజపతిరాయ్‌. ‌బెంగాల్‌ ‌విభజన సమయంలో ఆ మహానుభావులు ముగ్గురూ జాతిని కదిలించిన తీరును బట్టి అలా పిలవడం పరిపాటి. కానీ లజపతి రాయ్‌కి అంతకు మించిన ఘనత ఎంతో ఉంది. ఆయన బహుముఖ ప్రజ్ఞశాలి. లజపతి రాయ్‌ ఉద్యమ కారుడు. అతి వాదుల వైపు మొగ్గిన వారాయన. గొప్ప మేధావి, రచయిత, సంస్కర్త. కార్మికోద్యమ నిర్మాత.  ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు లాలా లజపతి రాయ్‌ ‌జనవరి 28, 1865న పంజాబ్‌లోని ధుడికెలో జన్మిం చారు.

లాహోర్‌లో న్యాయ విద్య అభ్యసిస్తున్నప్పుడు స్వాతంత్య్రోద్యమం వైపు దృష్టి సారించారు. అదే సమయంలో స్వామి దయానంద సరస్వతి భావాలవైపు మొగ్గు చూపారు. ‘‘ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి’’ అన్నారు లాలా లజపతి రాయ్‌. 1877‌లో ఆర్య సమాజ్‌ ‌సభ్యుడిగా ఉంటూనే ఆర్య గెజిట్‌కు సంపాదకత్వం వహించారు. ఆ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్‌లో ప్రవేశించి 1920లో కలకత్తాలో జరిగిన ప్రత్యేక సమావేశానికి అధ్యక్షుడిగా ఎన్నికైనారు. 1920 సంవత్సరంలో లాలా లజపతి రాయ్‌ ‌వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆల్‌ ఇం‌డియా ట్రేడ్‌ ‌యూనియన్‌ ఎఐటియుసి ఏర్పడింది. హిందూమహాసభ, లోక్‌ ‌సేవా మండల్‌ ‌సంస్థలు ప్రారంభించారు. 1921లో సర్వెంట్స్ ఆఫ్‌ ‌పీపిల్స్ ‌సొసైటి పేరుతో స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. జాతీయోద్యమంలో ‘‘పంజాబ్‌ ‌కేసరి’’గా పేరు పొందారు. ఆర్యసమాజ్‌, ‌యంగ్‌ ఇం‌డియా, అన్‌ ‌హ్యపి ఇండియా, ఇంగ్లండ్స్ ‌డెజ్ట్ ‌టు ఇండియా తదితర పుస్తకాలు రచించారు.

1928లో సైమన్‌ ‌కమీషన్‌ ‌భారత్‌ ‌వచ్చినప్పుడు అందులో భారతీయులెవరూ సభ్యులుగా లేనందున సైమన్‌ ‌కమిషన్‌కు వ్యతిరేకంగా బాయ్‌కాట్‌ ఉద్యమాలు జరిగాయి. అక్టోబరు 30, 1928లో సైమన్‌ ‌కమిషన్‌ ‌లాహోర్‌ ‌వచ్చినప్పుడు లాలా లజపతిరాయ్‌ ‌సైమన్‌ ‌కమిషన్‌ ‌వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించి సైమన్‌ ‌గో బ్యాక్‌ అని నినదించారు. పోలీస్‌ ‌సూపరింటెండెంట్‌ ‌జేమ్స్ ఏ ‌స్కాట్‌ ఆదేశాలతో జరిగిన లాఠీ చార్జీలో లజపతిరాయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆ గాయాలతోనే నవంబరు 17, 1928న లజపతిరాయ్‌ ‌ప్రాణాలు కోల్పోయారు. బ్రిటిష్‌ ‌పోలీసు ఉన్నతాధికారి విచక్షణ రహితంగా కొట్టిన లాఠీ దెబ్బలతో కన్నుమూసిన లాలా లజపతిరాయ్‌ ఆ ‌క్షణంలో ‘ఇవాళ నా గుండెల మీద పడిన లాఠీ దెబ్బలు బ్రిటిష్‌ ‌సామ్రాజ్య శవపేటికకి చివరిగా కొట్టిన మేకులవుతాయి.’ అని శాపం కూడా ఇచ్చారు.

భారత స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్‌ ‌పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ధీరులలో ఒకరుగా చిరస్థాయిగా నిలిచి పోయారు లాలాజీ.  లాలాజీకి భారతీయులు పంజాబ్‌ ‌కేసరి అనే బిరుదును నొసంగారు. ఆయన పంజాబ్‌ ‌నేషనల్‌ ‌బ్యాంకు మరియు లక్ష్మి ఇన్సూరెన్స్ ‌కంపెనీల స్థాపకులు. ‘‘నేను మరణించ వచ్చు, కాని నానుండి వెలువడే ప్రతి నెత్తురు చుక్క నుండి లక్షలాది స్వాతంత్య్ర సమర యోధులు ఉద్భవిస్తారు’’ అని ప్రకటించిన లాలాజీ మాట నిజం అయింది. ఆయన మరణానంతరం స్వాతంత్య్రోద్యమం మరింతగా విస్తృతం అవుతుందని తెలిసిన భవిష్యత్‌ ‌దార్శనికుని జీవితం భారతీయులకు స్పూర్తిదాయకం.

‘‘అమాయక పౌరుల మీద దాడులకు దిగే ప్రభుత్వానికి నాగరిక ప్రభుత్వమని చెప్పుకునే హక్కు లేదు. అలాంటి ప్రభుత్వాలు ఎక్కువ కాలం కొనసాగలేవు కూడా’’. స్వాతంత్య్ర పోరాట చరిత్రలో పంజాబ్‌ ‌సింహమంటూ కీర్తి పొందిన లాలా లజపతిరాయ్‌ ఒక సందర్భంలో అన్నమాటలివి. ఆ మాటలు ఆయన కన్నుమూసిన రెండు దశాబ్దాలకు నిజమయ్యాయి. లాలాజీ చరిత్ర ఏనాటిదో కావచ్చు. ఆనాటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులకు, ఈనాటికి సామ్యం లేకపోవచ్చు. వ్యక్తులకు గొప్పతనం కేవలం ఆపాదించటం వలన వస్తుందా, ఆపాదించుకుంటే చరిత్రలో అది నిలుస్తుందా, సామాన్యులు మాన్యులవటం ఏ ఏ విషయాలపై ఆధారపడి ఉంటుంది, సామాన్య కుటుంబాల నుండి అసామాన్యులు ఉద్భవించటం జరిగే పనేనా అనే విషయాలకు సమాధానం లాలాజీ చరిత్ర నుండి వస్తుంది. అందుకే లాలాజీ చరిత్ర స్మరణీయం, పఠనీయం.

రామ కిష్టయ్య సంగన భట్ల…
  9440595494

Leave a Reply