Take a fresh look at your lifestyle.

కాళేశ్వరం నీళ్లు ఫామ్‌ ‌హౌజ్‌కు తరలించేందుకు లక్ష కోట్లు

  • ఉమ్మడి పాలమూరుకు నీరెందుకు ఇవ్వడం లేదు
  • కెసిఆర్‌ ‌హామీలు విస్మరించారు
  • పాదయాత్రలో బండి సంజయ్‌
  • ‌యాత్రలో ఉద్రిక్తత.. అడ్డుకునే ప్రయత్నం చేసిన టిఆర్‌ఎస్‌

‌జోగులాంబ గద్వాల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 18 : ‌కాళేశ్వరం నీళ్లను ఫాంహౌస్‌కు తరలించేందుకు కేసీఆర్‌ ‌లక్ష కోట్లు ఖర్చు పెట్టారని గద్వాల జిల్లాలో పాదయాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌సిఎం కెసిఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు నీళ్లు ఎందుకు ఇవ్వటం లేదో కేసీఆర్‌ ‌చెప్పాలని, రైతులను కేసీఆర్‌ ‌మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సోమవారం అలంపూర్‌ ‌నియోజకవర్గంలోని వేముల గ్రామంలో బండి సంజయ్‌ ‌మాట్లాడుతూ…నకలీ విత్తనాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోవటం లేదన్నారు. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌ ఇచ్చిన హామీలేవీ ఇంతవరకూ నెరవేర్చలేక పోయారని రాష్ట్రంలో తెరాస పాలనపై ఆయన ధ్వజమెత్తారు.

నీళ్లు, నియామకాల విషయంలో కేసీఆర్‌ ‌మాట తప్పారన్న బండి సంజయ్‌…‌కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. పాదయాత్ర వేముల నుంచి బట్ల దిన్నె, షాబాద్‌ ‌మీదుగా ఉదండపూర్‌ ‌వరకు సాగనుంది. కేసీఆర్‌ ఎన్నికల్లో గెలిస్తే గద్వాల జిల్లాకు నీళ్లిస్తామన్నారు. ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారని, ఉమ్మడి పాలమూరు జిల్లాను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, అన్నీ హామీలే కానీ అమలులో మాత్రం శూన్యమని ఆయన దుయ్యబట్టారు. లీటర్‌ ‌పెట్రోల్‌కు రూ.30 కమిషన్‌ ‌తీసుకుంటూ కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని, ప్రజలంతా ఈ మోసాన్ని గమనించాలని బండి సంజయ్‌ అన్నారు.  పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్‌ ‌విస్మరించారని డీకే అరుణ అన్నారు. ఆర్డీఎస్‌ ‌ద్వారా జిల్లాకు నీళ్లు ఇవ్వాలన్నారు.

బండి సంజయ్‌ ‌యాత్రలో ఉద్రిక్తత.. అడ్డుకునే ప్రయత్నం చేసిన టిఆర్‌ఎస్‌
‌జిల్లాలో బండి సంజయ్‌ ‌ప్రజా సంగ్రామ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆయన ఇటిక్యాల మండలం వేములలో ప్రసంగించిన అనంతరం పాదయాత్ర కొనసాగుతుండగా కొంతమంది తెరాస కార్యకర్తలు పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోటా పోటీగా బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు నినాదాలు చేసుకున్నారు. సంజయ్‌ ‌గో బ్యాక్‌ అం‌టూ టీఆర్‌ఎస్‌ ‌నేతలు నినాదాలు చేశారు. ప్రతిగా కెసిఆర్‌ ‌డౌన్‌ ‌డౌన్‌ అం‌టూ బిజెపి కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అప్రమత్తమైన పోలీసులు తెరాస కార్యకర్తలను చెదరగొట్టారు. వారిని వేరే ప్రదేశానికి తరలించారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న తెరాస కార్యకర్తల వైపు భాజపా శ్రేణులు దూసుకెళ్లాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో… సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా భాజపా కార్యకర్తలు నినాదాలు చేశారు. అప్రమత్తమైన భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కలగజేసుకొని పార్టీ కార్యకర్తలకు నచ్చజెప్పడంతో పాదయాత్ర తిరిగి కొనసాగింది. అయితే సంజయ్‌ ‌యాత్రను అడ్డుకోవటంపై బీజేపీ నేతలు మండిపడ్డారు.

Leave a Reply