Take a fresh look at your lifestyle.

కార్మిక చట్టాలు-స్టోర్‌ ‌రూమ్‌లో…

“కరోనా కల్లోలంతో ప్రపంచం అంతా అతలాకుతలం అవుతున్న వేళ కొన్ని రాష్ట్రాలు కార్మికుల హక్కులపై కత్తి కట్టడం ఆందోళన కలిగించిందే కాని ఆశ్చర్యం కలిగించలేదు. ప్రభుత్వాల స్వభావాలు ఇలానే ఉండటం చూస్తూనే ఉన్నాం. కాకపోతే తాజా నిర్ణయాలు అమానవీయ పరిస్థితుల్లోకి కార్మికులను నెట్టేయనున్నాయి. బడుగు జీవి ఓట్ల పునాదిపై ఏర్పడే ప్రభుత్వాలకు వారంటే ఎప్పుడూ అలుసే. దీనికి పార్టీలతో సంబంధం లేదు. డొక్కలు ఎండిన వారికి మొండి చేతులు చూపించే ప్రభుత్వాలు…కోట్లు కొల్లగొట్టే వారికి మాత్రం రెడ్‌ ‌కార్పెట్‌ ‌పరుస్తాయి.”

Rehanaఇప్పుడు కార్మికులు అనుభవిస్తున్న హక్కుల వెనుక చారిత్రక నేపథ్యం ఉంది. విప్లవ పోరాట స్ఫూర్తి ఉంది. లక్షలాది మంది పోరాట యోధుల త్యాగం ఉంది. లాక్‌డౌన్‌ ‌సాకుతో ఇప్పుడు కార్మికుల హక్కుల చరిత్ర తిరోగమనం దిశగా ప్రయా ణించనుంది. ఉత్తర ప్రదేశ్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌రాజస్థాన్‌, ‌పంజాబ్‌, ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌వంటి పలు రాష్ట్రాలు తాజాగా కార్మిక చట్టాల్లోని చాలా నిబంధనలను మూడేళ్ల వరకూ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఆ రాష్ట్రంలో 38 కార్మిక చట్టాలుంటే వాటిలో 35 రద్దు చేసేశారు. కార్మికులకు సంబంధించిన మూడు చట్టాలు మాత్రమే అమలులో ఉంటాయి, మిగతా చట్టాలు మూడేళ్ల వరకూ అమలులో ఉండవు. అమలులో ఉండే ఆ మూడు చట్టాలు- భవన నిర్మాణ కార్మిక చట్టం, వెట్టిచాకిరి వ్యతిరేక చట్టం, కార్మిక పరిహార చట్టంలో ఐదో షెడ్యూల్‌. ‌పారిశ్రామిక వివాదాల చట్టం, ఇండస్ట్రియల్‌ ‌రిలేషన్స్ ‌యాక్ట్ ‌రద్దు అయ్యాయి. అంటే కార్మికుల సంక్షేమం కోసం చేసిన చట్టాలను అమలు చేయాల్సిన అవసరం లేకుండా పారిశ్రామికవేత్తలు, యాజమాన్యాలకు ఊరటనిచ్చాయి. ఇలా నిర్ణయం తీసుకున్న వారు చెప్పే కారణాలు కూడా విడ్డూరంగానే ఉన్నాయి. ఒకటి లాక్‌డౌన్‌ ‌తర్వాత మందగించిన ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టాలంటే పెట్టుబడులను ఆహ్వానించగలగాలి. ఎక్కువ వెసులుబాటు కల్పిస్తే ఎక్కువ మంది ముందుకు వచ్చి పెట్టుబడులు పెడతారన్నది ఒక వివరణ. దీన్నే కాస్త లోతుగా పరిశీలిస్తే పెట్టుబడులు పెడతారు సరే…ఎవరి ప్రాణాలు పణంగా పెట్టి అన్న ప్రశ్న వస్తుంది.

యూపీలోని యోగి ఆదిత్యనాథ్‌ ‌సర్కార్‌ ‌తీసుకున్న తాజా నిర్ణయాలు కార్మిక లోకానికి శరాఘాతమే. వాటిలో ప్రధానమైనవి.

 1. ఇక నుంచి కార్మికుల పని వేళలు ఎనిమిది గంటల నుంచి ఏకంగా 12 గంటలకు పెరిగాయి. అంటే నిన్నటి వరకు ఒక షిఫ్ట్‌గా ఉన్నది ఇప్పుడు ఒకటిన్నర షిఫ్ట్ ఒక షిఫ్ట్‌గా పరిగణిస్తారు.
 2. కార్మికులు పనిచేస్తున్న ప్రాంతాలు సరైన స్థితిలో ఉండేలా చూడటం ఇక నుంచి యజమానుల బాధ్యత కాదు. పని ప్రదేశాలు ఆరోగ్యకరంగా, శుభ్రంగా ఉండాల్సిన అవసరం లేదు. గాలి, వెలుతురు లేని చీకటి కొట్టాల్లా ఉన్నా యజమానులపై చర్యలేమి ఉండవు.
 3. ప్రాథమిక సౌకర్యాలు చూడాల్సిన అవసరం లేదు. ఏ పని ప్రాంతం అయినా తాగు నీరు, బాత్‌రూమ్‌లు, క్యాంటీన్‌ ‌వంటి ప్రాథమిక అవసరాలుంటాయి. వాటిని అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ఇక నుంచి యజమానులకు లేదు. అంటే 12 గంటల పాటు చెమట చెందించే కార్మికులు గొంతు తడుపుకోవటానికి మంచి నీళ్లు అందుబాటులో లేకపోయినా వారు ఎవరికీ ఫిర్యాదు చేయలేరు. చాలా పని ప్రదేశాల్లో బాత్‌ ‌రూమ్స్ ‌సదుపాయం విషయంలో మహిళలు పడే ఇబ్బందులు ఘోరంగా ఉంటాయి. అన్ని గంటల పాటు ఉగ్గబట్టుకుని ఉండటం, బాత్‌ ‌రూమ్‌కు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించుకునేందుకు మంచినీళ్లు తాగటాన్ని మానేయటం వంటి పనులు చాలా మంది మహిళా కార్మికులు చేస్తుంటారన్న విషయం పలు అధ్యయనాల్లో వెలుగులోకి వచ్చిన అంశాలే. వీటి వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు లోనవుతున్నారన్న విషయాలు కూడా అధ్యయనాల్లో తేలాయి. ఇప్పటి వరకు అనధికారంగా ఉండే సరైన బాత్‌రూమ్స్ ఉం‌డని విషయాలకు ఇప్పుడు సాధికారత లభించింది. మరుగుదొడ్లు లేవు అనే కారణంతో యజమానులపై చర్యలు తీసుకోవటం ఇక నుంచి జరగదు.
 4. కార్మికులను నియామకం, తొలగింపులో పూర్తి స్వేచ్ఛ యాజమాన్యాలకే ఉంటుంది. అంటే అన్యాయంగా ఉద్యోగం తీసేసి రోడ్డుపై పడేస్తే వాళ్లు వెళ్లి తమ ఆవేదన చెప్పుకోవటానికి, న్యాయం కోసం పోరాడటానికి ఒక వేదిక అంటూ ఉండదు.
 5. కార్మిక యూనియన్స్ ఉం‌డవు.
 6. కనీస వేతనాల చట్టం రద్దు అవటంతో కనీస వేతన హక్కు ఇక కార్మికులకు ఉండవు. యజమాని దయా దాక్షిణ్యాలపైనే వేతనం నిర్ణయమవుతుంది. నచ్చితే పని చేయాలి లేదంటే పస్తులుండాలి.
 7. వృద్ధాప్య పింఛను వంటి కనీస భరోసా ఉండదు.
 8. కార్మిక ఆరోగ్యానికి సంబంధించిన చట్టాలు కూడా రద్దయ్యాయి.
 9. పని సమయంలో కార్మికులు ప్రమాదానికి లోనైతే ప్రాథమిక చికిత్స అందించాల్సిన బాధ్యత ఇక నుంచి యజమానులది కాదు.
 10. క్యాంటీన్‌ ‌సదుపాయం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు.
 11. ఇక చిన్న పిల్లల కోసం క్రషర్స్ ఏర్పాటు చేయాలన్న నిబంధనను ఇప్పటికే చాలా సంస్థలు పట్టించుకోవు. ఇప్పుడు చట్టాన్నే పూర్తిగా రద్దు చేయటంతో యాజమాన్యాలకు మరింత ఊరట.

మధ్యప్రదేశ్‌..
‌మధ్యప్రదేశ్‌లోని చౌహాన్‌ ‌ప్రభుత్వం కూడా ఉత్తర ప్రదేశ్‌ ‌బాటలో నిర్ణయాలు తీసుకుంది. అన్ని రకాల కార్మిక చట్టాలను వెయ్యి రోజుల పాటు పక్కన పెట్టేస్తూ నిర్ణయం ప్రకటించింది. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు దుకాణాలు తెరుచుకుని ఉంచవచ్చు అని అనుమతి ఇచ్చారు. అంటే ఆ షాపులో పని చేసే కార్మికులు దాదాపు 18 గంటల పాటు పని చేయాల్సిన వచ్చినా నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉండదు. యాజమాన్యాలకు వాతావరణం ఇంత సానుకూలంగా ఉంటే వారు మాత్రం రెండు షిఫ్టుల్లో ఉద్యోగులను నియమించుకుని ఆర్థిక భారం అదనంగా నెత్తిన ఎందుకు వేసుకుంటాయి. మధ్యప్రదేశ్‌ ‌తీసుకున్న ఈ నిర్ణయాలు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక యూనిట్లు, కొత్తగా తెరిచే యూనిట్లకు కూడా వర్తిస్తాయి. దుర్భర స్థితిలో కార్మికులు పనిచేయాల్సి ఉన్నా లేబర్‌ ‌కోర్టులు పట్టించుకోవు. వేరే కోర్టుల్లో సవాలు చేసే అవకాశం ఉండదు. మధ్యప్రదేశ్‌ ‌చరిత్రలో భోపాల్‌ ‌గ్యాస్‌ ఉదంతం ఒక మాయని మచ్చగా మిగిలింది. 1984లో భోపాల్‌ ‌గ్యాస్‌ ‌విషాదం తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్మిక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది. దాని ప్రకారం కంపెనీలు ప్రతి ఏటా ఒక్కో కార్మికుడికి 80 రూపాయల చొప్పున జమ చేయడం తప్పనిసరి చేశారు. ఇప్పుడు ఆ నిబంధన కూడా రద్దయ్యింది. 50 మంది లోపు కార్మికులు ఉండే సంస్థలను ప్రభుత్వ తనిఖీల నుంచి మినహాయింపు ఇచ్చారు. అంటే అక్కడకు ఏ అధికారి కూడా వెళ్లి చూడటం అనేదే జరగదు. సంస్థల అనుమతి, రిజిస్ట్రేషన్‌ ‌నిబంధనలను సరళీకరించారు. స్టార్ట్ అప్స్ ఒకసారి రిజిస్ట్రేషన్‌ ‌చేస్తే చాలు. రెన్యువల్‌ ‌చేసుకోవాల్సిన అవసరం ఉండదు. హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌పంజాబ్‌, ‌గుజరాత్‌ ‌రాష్ట్రాలు కూడా పరిశ్రమల చట్టాన్ని సవరించాయి. వారానికి పనిగంటలను 48 నుంచి 72కు పెంచాయి. అయితే ఉత్తరప్రదేశ్‌, ‌మధ్యప్రదేశ్‌ ‌రాష్టాలు తీసుకున్న ఈ నిర్ణయాలపై కేంద్రం ఇంకా ఆమోదముద్ర వేయలేదు. కార్మిక చట్టాల్లో మార్పుల కోసం రాష్ట్రాలు చేసిన ఈ ప్రతిపాదనలు కేంద్రం ఆమోదం తర్వాతే అమలవుతాయి. అన్ని వర్గాల నుంచి వస్తున్న ఈ వ్యతిరేకతను కేంద్రం అయినా పరిగణలోకి తీసుకుంటుందా, వెట్టి చాకిరి పరిస్థితుల్లోకి లక్షలాది మంది కార్మికులను నిస్సహాయంగా నెట్టి వేసే పరిస్థితులు రాకుండా అడ్డుకుంటుందా లేక మాకు బడా బాబులు ముఖ్యం అనే ఆమోద ముద్ర వేస్తుందా అనేది కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది.

ఆర్ధిక సంక్షోభానికి పరిష్కారం ఇదేనా?
దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న కార్మికుల కనీస హక్కులను కాలరాస్తున్న తాజా నిర్ణయాలు ఆర్థిక కోణంలో ఎంత వరకు తెలివైన నిర్ణయం అనేది ఆలోచించాలి. లాక్‌డౌన్‌ ‌నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయి ఆర్థిక వేత్తలు చేసిన సూచనలు గమనిస్తే…ప్రజల చేతుల్లో డబ్బులు పెడితేనే ఆర్థిక వ్యవస్థ చట్రం తిరగటం ప్రారంభం అవుతుంది. అంటే ప్రజల్లోకి వచ్చిన డబ్బులు ఆర్థిక వ్యవస్థ గాడిన పడటానికి ఒక లూబ్రికెంట్‌లా పని చేస్తుంది. మరి యూపీ, ఎమ్‌పీ వంటి రాష్ట్రాలు తీసుకున్న తాజా నిర్ణయాల వల్ల డబ్బులు ప్రజల చేతుల్లో నుంచి పెట్టుబడిదారుల బీరువాల్లోకి వెళతాయి. డబ్బులు ఎక్కువైతే రెక్కలు కట్టుకుని స్విస్‌ ‌బ్యాంకుల్లోకో, మరే ఇతర దేశాల్లోకో తరలి వెళతాయి. కనీస వేతనాలు చట్టం లేదు కనుక నిన్నటి వరకు వచ్చే వేతనం కూడా ఇవాళ కార్మికులకు అందదు. అంటే వారి వినిమయ సామర్థ్యం తగ్గుతుంది. బడా పెట్టుబడి దారుల డబ్బులు బ్లాక్‌ ‌మనీ రూపంలో చట్టాల నీడ పడకుండా ఉంటే…బడుగు బలహీన వర్గాల వేతనాలు రోజు వారి ఖర్చుల రూపంలో తిరిగి ఆర్ధిక వ్యవస్థలోకే వస్తాయి. కాస్తో కూస్తో పొదుపు చేసుకునే అవకాశం లేకుండా పోతుంది. సెంటర్‌ ‌ఫర్‌ ‌మానిటరింగ్‌ ఇం‌డియన్‌ ఎకానమీ ప్రకారం ప్రస్తుతం మన దేశంలో సుమారు 25శాతం నిరుద్యోగం ఉంది. అంటే వర్క్ ‌ఫోర్స్ ఎక్కువగా ఉంది. మానవ వనరులు తక్కువ ధరకే లభ్యం అవుతున్న సందర్భంలో వారిని ఉపయోగించుకునే విధంగా ఆర్థిక వ్యవస్థను, మార్కెట్‌ను తయారు చేసే వ్యూహాలు రూపొందించాలి. అంతే గాని కార్మికుల జీవన ప్రమాణాలు అడగంటే విధంగా, శతాబ్దాల కింది నాటి వెట్టి చాకిరి పరిస్థితులు తిరిగి జీవం పోసుకునే నిర్ణయాలు అమల్లోకి తెస్తే కూర్చున్న కొమ్మను నరుక్కోవటమే అవుతుంది.

Leave a Reply