Take a fresh look at your lifestyle.

లాగదార్లం

మేము లాగాదార్లం
చెట్ల మందులకు మొనగాళ్ళం
ప్రకృతి తల్లికి
ముద్దుబిడ్డలం
జామ,నిమ్మ,దానిమ్మ
సపోటా,కొబ్బరి మా కొంపలకు
కొండంత సపోట్‌

‌చామంతి, మల్లె,గులాబీ
మా గుండెకు నిబ్బరం
పర్యావరణ ప్రేమికులం
భావి ప్రకృతికి వారసులం
మేము లాగాదార్లం

మాకొచ్చిన వైద్యం
బహు చిత్రం
అక్షరం తెల్వకున్న
అన్ని మందులెరికే
ఏ సెట్టుకు ఏ తెగులు
ఏ పువ్వుకు ఏ పురుగు
సిటికెలో సెప్తం
మా ఇద్యతో బాగుసేస్తం
బతుకుకై దేశాలు దాటుతం
బతుకు గాలిదీపమని తెల్సి
బయలెళ్లే బడుగు జీవులం
మేము లాగదార్లం.

పూటకో విద్యతో
కూటీకై పరిగెత్తే వలసలం
మందుపొట్లం కట్టుడు
సీసాల్నుంచి సిరంజి గుంజుడు
అవ్వ పొత్తిళ్ళ కాన్నుంచి
అబ్బిన ఇద్యలు

భ్యారం (వ్యాపారం) ఆపై
కాసింత సుక్క
నంజుకొనికి తునకలు
కాస్త కునుకు నిత్య కృత్యం.
ఆస్తులు భూములు
తాతల్నుంచి తెల్వని తరం
ఏ పూట కాపూట
బతుకీడ్చే బాపతుగాళ్ళం
మేము లాగదార్లం.

అప్పులోల్లు ఇంటికొస్తే
ఆప్యాయంగా ఆదరిస్తాం
అనరాన మాటలంటే
అనగిమనగి ఉంటూ
ఆస్తులమ్మైన అప్పంత తీర్చేస్తం.
మేము లాగాదార్లం.

పిల్లికూర, పిట్టకూర
మా పిల్లల ఆకలిని తీర్చే
మటన్‌,‌చికెన్‌..‌లు
పెళ్లిళ్లకు ,సావులకు
ఇందులకు పందిగున్న
ఒవాయిలు( గబ్బిలాలు)
మాకు ప్రకృతిచ్చిన
ప్రసాదాలు.. పరమాన్నాలు..

మమ్మల్ని సూస్తరు
పిలుస్తారు
పనంతా సేయించు కుంటారు
కులంలా మా కులం
లిస్ట్ ‌లో అస్సలు ఉండదు
సర్టిఫికేట్‌ అడిగితే
ఇయ్యని సార్లు
ఆగిన సదువులు
ఆగమైతున్న అంతరిస్తున్న
కులంలో కొందరమే
మిగిలినం ఐనా
మేము లాగదార్లం..
నాగరాజు (మద్దెల)
6301993211.

Leave a Reply