Take a fresh look at your lifestyle.

కూచిపూడికే వన్నెతెచ్చిన శోభానాయుడు

(‌ప్రముఖ కూచిపూడి కళాకారిణి శోభానాయుడు అకాల మరణం సందర్భంగా అక్షరాంజలి)

ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్‌ ‌పద్మశ్రీ శోభానాయుడు బుధవారం ఉదయం కన్నుమూశారనే వార్త ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, ముఖ్యంగా తెలుగు కళారంగానికి తీరని లోటును మిగిల్చింది. కొన్ని రోజుల క్రితం ఇంట్లో జారిపడటంతో తలకు గాయం కారణంగా ఆర్థోన్యూరో సమస్యతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, కరోనా బారిన పడి బుధవారం తెల్లవారు జామున తుది శ్వాస విడవడం విచారకరం. 1956లో విశాఖ సమీపాన అనకాపల్లిలో కెవి నాయుడు, సరోజినీ దేవిలకు జన్మించిన శోభానాయుడు ప్రపంచ ప్రఖ్యాత కూచిపూడి కళాకారిణిగా అపార కీర్తిని ఆర్జించినారు.

ప్రఖ్యాత వెంపటి చిన సత్యం శిష్యరికంలో కూచిపూడి ఆంధ్ర నాట్యరూపాన్ని విశ్వ వేదికపై పరిచయం చేస్తూ ప్రదర్శనలు ఇచ్చారు. కుటుంబంలో ప్రతిఘటన ఎదురైనప్పటికీ, 12 ఏళ్ళ చిన్న వయస్సులోనే తల్లి సరోజినీ దేవి ప్రోత్సాహంతో రాజమండ్రిలో పియల్‌ ‌రెడ్డి వద్ద కూచిపూడి నాట్య తొలి అడుగులు నేర్చుకున్నారు. తరువాత వెంపటి చిన సత్యం వద్ద దశాబ్దానికి పైగా కూచిపూడిలో లోతైన మెళకువలు నేర్చుకొని, డ్యాన్స్- ‌డ్రామాల సమ్మిలిత శాస్త్రీయ నృత్యంతో సత్యభామ, చండాలిక, దేవదేవకి, మోహిణి, సాయి బాబా, పార్వతి మరియు పద్మావతి అమ్మవార్లను విశ్వ వేదికపై సాక్షాత్కరింపజేశారు. అత్యుత్తమ కూచిపూడి డాన్సర్‌గా తన హావభావాలతో ప్రేక్షకులను, విమర్శకులను మంత్రముగ్దులను చేసిన ఘనత మన తెలుగు ఆడపడుచు శోభానాయుడు స్వంతం. హైదరాబాద్‌లో కూచిపూడి ఆర్ట్ అకాడమీని స్థాపించి, ప్రిన్సిపల్‌గా పని చేస్తూ, యువ కళాకారులకు గత నాలుగు దశాబ్దాలుగా కూచిపూడిలో శిక్షణలను అందిస్తున్నారు. అనేక సృజనశీల డాన్స్ ‌డ్రామాలను రూపొందించి, నృత్య దర్శకత్వం వహించారు. శోభానాయుడు కొరియోగ్రాఫర్‌గా 80కి పైగా సోలో డ్యాన్సులు, 15 నృత్యనాటికలు మరియు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో 1,500లకు పైగా శిష్యులకు కూచిపూడి నాట్యంలో శిక్షణలు ఇచ్చారు. విప్రనారాయణ, కళ్యాణ శ్రీనివాసమ్‌, ‌శ్రీ కృష్ణ శరణం మమ, విజయోస్తుతే నారీ, క్షీరసాగర మథనం, సర్వం సాయిమయం, జగదానంద కారకా, గిరిజా కళ్యాణం, స్వామి వివేకానంద, నవరస నటభామిణి లాంటి నృత్య సంగీతరూపకాలతో ఖ్యాతి గడించారు. శ్రీ వెంకటేశ్వర భక్తురాలిగా ‘సాధన’ వేదిక మీద శాస్త్రీయ నాట్య శిక్షణ ఇస్తున్న శోభానాయుడు లేని లోటు బాధాకరం మరియు భర్తీ చేయలేనిది.

అమెరికా, రష్యా, యూకె, సిరియా, టర్కీ, హాంకాంగ్‌, ‌బాగ్దాద్‌, ‌కంపూచియా, బ్యాంకాక్‌ ‌లాంటి అనేక దేశాలకు ఆహ్వానించబడి, కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చి మహా కళా కారుణిగా పేరు తెచ్చుకున్నారు. భారత ప్రభుత్వం తరఫున కల్చరల్‌ ‌డెలిగేషన్‌కు నాయకత్వం వహించి వెస్ట్ ఇం‌డీస్‌, ‌మెక్సికో, వెనెజ్యులా, తునిస్‌, ‌క్యూబ మరియు పశ్చిమ ఆసియా పర్యటించి తన కూచిపూడి కళకు విశ్వ ఖ్యాతిని తెచ్చారు. కూచిపూడి నాట్యాన్ని సజీవంగా ఉంచేందుకు శోభానాయుడు చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2001లో ‘పద్మశ్రీ’ పౌర పురస్కారంతో సత్కరించింది. 1982లో మద్రాస్‌కు చెందిన కృష్ణ గానసభ వారు శోభానాయుడును ‘నృత్య చూడామణి’ బిరుదుతో సత్కరించారు. 1991లో కూచిపూడి నాట్య కళాకారిణిగా ‘సంగీత నాటక అకాడమీ ఆవార్డు’ స్వీకరించారు. 1996లో నృత్య కళా శిరోమణి, 1998లో యన్‌టి రామారావు ఆవార్డు, ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వ ‘హంస ఆవార్డు’, నర్తనశాల డాన్స్ అకాడమీ వారి ‘జీవన సాఫల్య పురస్కారం’లతో పాటు అసంఖ్యాక పురస్కారాలు ఆమెను వరించడం పెద్ద విషయమేమి కాదు. క్వీన్స్ ‌మేరీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన శోభానాయుడు తన జీవితాన్ని ఆసాంతం కూచిపూడి నాట్యానికే అంకితం చేశారు. భర్త విశ్రాంత ఐఏయస్‌ అధికారి ప్రోత్సాహంతో శోభానాయుడు ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగినా, ఒదిగిన వ్యక్తిత్వంతో నేటి యువత ముందు నిలువెత్తు ఆదర్శ మహిళగా నిలిచారు. శోభానాయుడు అందించిన స్పూర్తి, శాస్త్రీయ నాట్యం పట్ల అంకితభావం మరియు కూచిపూడి కళారూపాన్ని నిలబెట్టిన కార్యదక్షత నేటి యువతీయువకులకు ప్రేరణ కావాలని కోరుకుందాం. కూచిపూడి నాట్య భంగిమలే మౌనం దాల్చిన వేళ, శోభానాయుడుకు అక్షర నివాళి.

Leave a Reply