సుబేదారి, మార్చి 8, (ప్రజాతంత్ర విలేకరి): కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం విశ్వవిద్యాలయానికి చేరుకున్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి కెయు విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పర్యటనను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి జెఎసి నాయకులు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా అడుగుపెట్టని రాజేశ్వర్ రెడ్డి మళ్లీ ఏ మొఖం పెట్టుకొని కాకతీయ విశ్వవిద్యాలయానికి వచ్చారని, విశ్వవిద్యాలయాలు నిర్వీర్యం అవుతుంటే పట్టించుకోని పల్లా రాజేశ్వర్ రెడ్డికి గట్టి బుద్ధి చెప్పడానికి పర్యటనను అడ్డుకున్నామని విద్యార్థి జెఎసి నాయకులు అన్నారు.
విశ్వవిద్యాలయాలలో నియామకాలు లేక బోధన పరిశోధన కుంటూ పడుతున్నప్పటికీ పట్టించుకోని పల్లె రాజేశ్వర్ రెడ్డి మళ్లీ ఎన్నికలు రాగానే విశ్వవిద్యాలయంలో అడుగుపెటాడన్నారు. గతంలో ఎన్నడు కేయూ అడుగుపెట్టని వ్యక్తికి ఓటు అడిగే హక్కు లేదని విద్యార్థి సంఘ నాయకులు అన్నారు. పల్లె రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్న విద్యార్థి జెఎసి నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఇందులో తాడపత్రి రాజేందర్, హరీష్, కొడపాక రాజేందర్, రవి, యాదగిరి తదితర విద్యార్థి జెఎసి నాయకులను అరెస్టు చేసి కేయూ పోలీస్ స్టేషన్కు తరలించారు.
విద్యార్థుల అరెస్టును ఖండించిన బిజెపి
టిఆర్ఎస్ అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కాకతీయ విశ్వవిద్యాలయం వచ్చిన సందర్భంగా విద్యార్థి నాయకులు అడ్డుకున్న సందర్భంలో పలువురు విద్యార్థులను, జర్నలిస్టుల పై టిఆర్ఎస్ నాయకులు దాడులు చేసిన విషయాన్ని బిజెపి తీవ్రంగా ఖండిస్తున్నామని బిజెపి అర్బన్ పార్టీ అధ్యక్షురాలు రావు పద్మ, అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ విజయ రామారావు లు తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకతీయ విశ్వవిద్యాలయానికి గత ఆరు సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు కూడా అడుగుపెట్టని అభ్యర్థి విశ్వవిద్యాలయంకు వచ్చిన తరుణంలో ఇక్కడ మందీ మార్బలం లేకపోవడం ఈ విషయాన్ని పత్రికల ద్వారా సమాజానికి తెలుస్తుందన్న విషయానికి పసిగట్టిన టిఆర్ఎస్ నాయకులు వెంటనే విద్యార్థులపై, జర్నలిస్టులపై దాడులకు పాల్పడ్డారని వారు పేర్కొన్నారు.