కొత్త రెవెన్యూ బిల్లును అసెంబ్లీ ఆమోదించినప్పుడు రైతులే సంతోషించారని వెల్లడి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్రికల్చర్ బిల్లులు చరిత్రాత్మకమే అయితే రైతులు ఎందుకు సంబురాలు చేసుకోవడం లేదని అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఎందుకు రాజీనామా చేస్తున్నాయని కేటీఆర్ అడిగారు.
గత వారంలో కొత్త రెవెన్యూ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించినప్పుడు రైతులంతా సంతోషంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఆనందంలో మునిగిపోయారని కేటీఆర్ గుర్తు చేశారు. తాము రైతు స్నేహపూర్వక రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టామని కేటీఆర్ తెలిపారు.
రైతులకు మేలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించే దిశగా ఈ చట్టాన్ని రూపొందించారు. ధరణి పోర్టల్ ద్వారా అత్యంత పకడ్బందీగా భూముల రిజిస్టేష్రన్ పక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అవినీతికి ఆస్కారం లేకుండా, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా సీఎం కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోందన్నారు.