Take a fresh look at your lifestyle.

మాటల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం

  • ఇచ్చిన హామీ మేరకు కెసిఆర్‌ ఉద్యోగ ప్రకటన
  • ప్రతి నియోజకవర్గంలో కోచింగ్‌ ‌సెంటర్లు
  • కేంద్రంలోని మోడీ సర్కార్‌ ఎం‌దుకు ఉద్యోగ ప్రకటన చేయలేక పోయింది
  • నిమ్జ్‌లకు ఇచ్చిన సాయం గోరంత అసెంబ్లీలో మంత్రి కెటిఆర్‌
  • ‌బిజెపి ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై రేవంత్‌ ‌బాధపడుతున్నడని వ్యాఖ్య

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 10 : తెలంగాణలో సిఎం కెసిఆర్‌ ‌ప్రకటించినట్లుగా బిజెపి కేంద్రంలో ఎందుకు ఉద్యోగ ప్రకటన చేయలేక పోయిందని శాసనసభలో మంత్రి కెటిఆర్‌ ‌నిలదీసారు. కెసిఆర్‌ ‌కొలువుల ప్రకటనపై విమర్శలు చేస్తున్న బిజెపి నేతలు దీనికి సమాధానం చెప్పాలన్నారు. మాది మాటల ప్రభుత్వం కాదు..చేతల ప్రభుత్వం అని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. బీజేపీ నేతల మాటలు కోట్లలో ఉంటాయి..పనులేమో పకోడిలా ఉంటాయి. నరం లేని నాలుక కదా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతారని అసెంబ్లీ వేదికగా అన్నారు. ఒకేసారి 80,039 ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసిన సందర్భంగా యావత్‌ ‌తెలంగాణ యువత తరపున సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేస్తున్నానని మంత్రి కేటీఆర్‌ ‌ప్రకటించారు. శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ‌ప్రసంగించారు. ఇది కొలువుల జాతర కాదు..కొలువుల కుంభమేలా అని పేర్కొన్నారు. శాసనసభలో సభా నాయకుడిగా సీఎం అధికారికంగా ప్రకటించారు. ఉత్కంఠతో చూసిన ఉద్యోగ అభ్యర్థులు సంబురాలు చేసుకున్నారు. విద్యార్థులు, ఉద్యోగ అభ్యర్థులు చదువులో మునిగిపోయారు. ప్రధాన పార్టీలకు చెందిన ఓ ఇద్దరు నాయకులు సీఎం ప్రకటన నమ్మం అని స్టేట్‌మెంట్‌ ‌చేశారు. కేసీఆర్‌ ‌ప్రకటన నమ్ముతాం అనే వారు చదువుల్లో నిమగ్నమయ్యారు. నమ్మం అనే వారు మోదీ ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కేటీఆర్‌ ‌సూచించారు.

రెండు పారిశ్రామిక సమూహాలను కేంద్రం నిమ్జ్‌గా గుర్తించింది. ఒకటి జహీరాబాద్‌, ‌రెండో హైదరాబాద్‌ ‌ఫార్మా సిటీలను నిమ్జ్‌గా గుర్తించారు. దీనికి బ్రహ్మాండమైన మద్దతు వొచ్చి, వేల కోట్ల నిధులు వొస్తాయని, కోట్ల ఉపాధి అవకాశాలు వొస్తాయని ఆశించాం. 2016లో జహీరాబాద్‌ ‌నిమ్జ్‌కు గుర్తింపు ఇచ్చింది.. ఆరేండ్లలో కేవలం రూ. 3 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఫార్మా సిటీకి నిమ్జ్ అని పేరు పెట్టి 2017లో జీవో ఇచ్చింది. ఈ ఐదేండ్లలో రూ. 5 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా? అని అడుగుతున్నాను. ఇక కోచింగ్‌ ‌సెంటర్లు ఏర్పాటు చేసి, పిల్లలకు భోజన సదుపాయాలు కల్పిస్తామని పలువురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సభ వేదికగా తెలిపారు. ప్రభుత్వ ప్రకటన మీద విశ్వాసం ఉంటే, యువత మీద ప్రేమ ఉంటే.. ప్రతి నియోజకవర్గంలో కోచింగ్‌ ‌సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తుందన్నారు.

భట్టి విక్రమార్క, శ్రీధర్‌ ‌బాబు కూడా ఈ విషయంలో చొరవ చూపాలని కేటీఆర్‌ ‌సూచించారు. టీ శాట్‌ ‌ద్వారా పోటీ పరీక్షలకు కోచింగ్‌ ఇస్తున్నాం. మాటలతో ఎద్దెవా చేయడం మంచిది కాదు. ప్రభుత్వ రంగంలో లక్ష ఉద్యోగాలు వొస్తాయని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. గత టర్మ్‌లో లక్షా 32 వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేశాం. నిన్నటి ప్రకటనతో ఆ సంఖ్య 2 లక్షల 47 వేలకు చేరువైంది. నినాదాలు ఇవ్వకుండా.. అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా ముందుకు వెళ్తున్నామని కేటీఆర్‌ ‌చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా కేటీఆర్‌ ‌ప్రసంగించారు. మేం కేవలం నినాదాలు ఇవ్వలేదు. ఫిట్‌ ఇం‌డియా, స్టార్టప్‌ ఇం‌డియా, డిజిటల్‌ ఇం‌డియా, మేకిన్‌ ఇం‌డియా అనేక అందమైన నినాదాలు బీజేపీ ఇస్తది. కానీ దాని వెనుకాల పాలసీలు ఉండవు. కొరోనా సమయంలో పరిశ్రమలు మూతపడ్డాయి. ఆత్మనిర్భర్‌ ‌కింద రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పింది.

దీంతో దేశంలోని పరిశ్రమలకు లాభం జరుగుతుందని అనుకున్నాం. ఆ ప్యాకేజీ ఎక్కడ పోయిందో తెలవదు. అవి నోటి మాటలే. నాకు తెలిసీ ఒక్కరంటే ఒక్కరూ కూడా లాభం పొందలేదు. బీజేపీవి పచ్చి బోగస్‌ ‌మాటలు అని కేటీఆర్‌ ‌మండిపడ్డారు. భారతదేశంలోని కొత్త రాష్ట్రమైన తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతుంది. ఆర్బీఐ విడుదల చేసిన నివేదికలోనే ఈ విషయం వెల్లడైందన్నారు. భౌగోళికంగా 11వ పెద్ద రాష్ట్రం. జనాభా పరంగా 12వ అతిపెద్ద రాష్ట్రం. కానీ భారతదేశ ఆర్థిక రంగానికి 4వ అతిపెద్ద చోదక శక్తిగా ఉందని ఆర్బీఐ నివేదికలో తేలిందన్నారు. ఇది కేసీఆర్‌ ‌ప్రభుత్వ ఘనతనే అని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2 లక్షల 78 వేలు(130 శాతం) పెరిగిందని కేంద్ర గణాంకాలు చెప్తున్నాయి. జీఎస్‌డీపీ రూ. 11 లక్షల 54 వేల కోట్లు.. ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఏదైనా ఉందా? అని కేటీఆర్‌ అడిగారు. కానీ ఇది కొందరికి నచ్చడం లేదు. తెలంగాణ పచ్చబడుతుంటే.. కండ్లు ఎర్రబడుతున్నాయి. రాజకీయంగా పుట్టగతులుండవని భయపడుతున్నారని కేటీఆర్‌ ‌మండిపడ్డారు.

బిజెపి ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై రేవంత్‌ ‌బాధపడుతున్నడు
తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌చురకలు వేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని కేటీఆర్‌ ‌విమర్శలు గుప్పించారు. శాసనసభలో కేటీఆర్‌ ‌మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు వైజాగ్‌ ‌స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌కోసం నెత్తి నోరు బాదుకుంటున్నారు. అదే క్రమంలో సింగరేణిని ప్రయివేటు పరం చేసేందుకు బీజేపీ యత్నిస్తుంది. ఆ పరిస్థితి మనకు రావొద్దంటే మనం అప్రమత్తంగా ఉండాలి. పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ ఎం‌పీలు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అక్కడ గొంతు విప్పాలి. మమ్మల్ని ఇక్కడ తిట్టుడు కాదు.. అక్కడ మాట్లాడండి..

అక్కడ బీజేపీని నిలదీయండని కేటీఆర్‌ ‌సూచించారు. తమాషా ఏందంటే మొన్న బీజేపీ సభ్యులు పోడియంలోకి వస్తే వారిని సస్పెండ్‌ ‌చేశారు. తెల్లారి చూస్తే బీజేపీ అధ్యక్షుడి కంటే కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎక్కువగా బాధపడుతున్నాడు. బీజేపీ సభ్యులను ఇక్కడ్నుంచి పంపించినందుకు బాగా బాధపడుతున్నాడు. వారు అవిభక్త కవలల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. ఇది చాలా దారుణం. వీళ్ల ఒప్పందం ఏంటో అర్థం కావడం లేదన్నారు. ఒకరిని మించి మరొకరు బాధ పడుతున్నారు. హుజూరాబాద్‌ అసెంబ్లీ, నిజామాబాద్‌, ‌కరీంనగర్‌ ‌పార్లమెంట్‌ ఎన్నికల్లో కలిసి పని చేసినట్టు.. ఇప్పుడు కూడా బయట కలిసి పని చేస్తున్నట్లు చాలా చాలా అనుమానాలు ఉన్నాయన్నారు. వీళ్ల ఒప్పందంపై బయటైతే చాలా పుకార్లు ఉన్నాయని వ్యంగాస్త్రాలు సంధించారు.

Leave a Reply