– అమిత్‌షాను ప్రశ్నించిన కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30: బిల్డర్లు, కాంట్రాక్టర్ల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్-రేవంత్ పన్ను (ఆర్‌ఆర్ పన్ను) వసూలు చేస్తోందని ఆరోపించిన ప్రధాని మోదీ ఈ ప్రభుత్వంపై ఎందుకు చర్య తీసుకోలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం ఇక్కడ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి బావమరిదికి ‘అమృత్’ కాంట్రాక్టును ఇవ్వడంపై విచారణ ఎందుకు జరగడం లేదన్నారు. కంచగచ్చిబౌలి అటవీ భూమిలో ఆర్థిక మోసంపై దర్యాప్తు చేయాలన్న కేంద్ర సాధికార కమిటీ సిఫార్సులపై ఏం చేశారని నిలదీశారు. నేషనల్ హెరాల్డ్ కేసు చార్జిషీట్‌లో పేరు ఉన్న రేవంత్ రెడ్డిని కాపాడడం కుమ్మక్కు రాజకీయమేనన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు అత్యంత ప్రమాదకరంగా మారిన కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్న బీజేపీకి ప్రజలు తగిన బుద్ది చెప్తారన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఢల్లీి కాంగ్రెస్‌కి ఏటీఎంగా నిన్న గొంతుచించుకున్న అమిత్‌షా.. తాను కేంద్ర హోంమంత్రినన్న సంగతిని మరిచిపోయిన నయా గజిని అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ అవినీతి విషయంలో బీజేపీ అగ్రనేతలంతా తేలు కుట్టిన దొంగల్లా మారిపోయారన్నారు. 18 నెలల కాంగ్రెస్ పాలనలో అవినీతికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నారు. బిల్డర్లు, కాంట్రాక్టర్ల నుండి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్‌ఆర్ పన్ను వసూలు చేస్తున్నా కేంద్రంలోని ఏ ఒక్క దర్యాప్తు సంస్థ విచారణ జరపకపోవడం ఆ రెండు పార్టీల అక్రమ సంబంధానికి అద్భుత నిదర్శనమన్నారు అన్ని సాక్ష్యాలతో తాము కేంద్ర మంత్రిని కలిసి ఫిర్యాదు చేసినా మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. మొన్నటి కంచగచ్చిబౌలి అటవీ భూముల అక్రమ అమ్మకం వ్యవహారంలో అన్ని రకాల నియమ నిబంధనలను రేవంత్‌రెడ్డి తుంగలో తొక్కినా కేంద్రం కళ్లు, చెవులు, నోరు మూసుకుందని కేటీఆర్ మండిపడ్డారు. సమగ్ర దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ సిఫార్సు చేసినా మోదీ ప్రభుత్వం కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీకి రూ.4,400 కోట్ల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్టును ఇవ్వడంలో జరిగిన అవినీతి బహిరంగంగా కనిపిస్తున్నా ఎలాంటి చర్యలు లేవన్నారు. పొంగులేటి ఇంట్లో జరిగిన ఈడీ దాడులపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పటివరకు ప్రకటన ఎందుకు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్నటి కర్ణాటక వాల్మీకి కుంభకోణంలో ఓ తెలంగాణ కాంగ్రెస్ నాయకుడి బ్యాంకు ఖాతాల్లోకి రూ.45 కోట్ల నగదు బదిలీ అయిందన్న ఆధారాలు ఉన్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఢల్లీిలో కాంగ్రెస్‌తో కుస్తీ పడుతున్నా తెలంగాణలో మాత్రం దోస్తీ చేస్తూ రేవంత్ రెడ్డిని బీజీపీ పెద్దలు వెనకేసుకొస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.



