Take a fresh look at your lifestyle.

బల్దియాపై కేటీఆర్‌ ‌నజర్‌ !

KTR Nazar on Baldia! Review of the basic amenities of the Hyderabad cities Order to build 3000 public toilets
నగరంలోని ఎంఏయూడీ క్యాంపస్‌లో టాయిలెట్ల నమూనాల ప్రదర్శనను పరిశీలిస్తున్నఎంఏ యూడీ ముఖ్యకార్యదర్శి అరవింద్‌ ‌కుమార్‌, ‌జీహెచ్‌ఎం‌సీ కమిషనర్‌ ‌లోకేష్‌ ‌కుమార్‌
  • ‌హైదరాబాద్‌ ‌నగరవాసుల ప్రాథమిక సౌకర్యాలపై సమీక్ష
  • 3000 పబ్లిక్‌ ‌టాయిలెట్ల నిర్మాణానికి ఆదేశం

మున్సిపల్‌ ఎన్నికలలో ఘన విజయం సాధించి ఊపు మీదున్న టీఆర్‌ఎస్‌ ఇక బల్దియా ఎన్నికలపై దృష్టి సారించింది. మరో ఆరు నెలల్లో బల్దియా పాలకవర్గం గడువు ముగియనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే గెలుపు వ్యూహాలపై కసరత్తు ప్రారంభించింది. గతంలో బల్దియా ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ను గెలిపించే బాధ్యతను సీఎం కేసీఆర్‌ ఆయన తనయుడు కేటీఆర్‌పై ఉంచారు. ఇందుకు అనుగుణంగానే ఆ ఎన్నికలలో 99 డివిజన్లలో ఘన విజయం సాధించి తొలిసారిగా బల్దియాపై గులాబీ జెండాను ఎగురవేయడంలో కేటీఆర్‌ ‌కీలకపాత్ర పోషించారు. కాగా, ప్రస్తుతం బల్దియా ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తుండటంతో కేటీఆర్‌ ‌ముందుగానే సిద్ధమయ్యారు. ప్రస్తుతం పట్టణాభివృద్ధి శాఖను సైతం నిర్వహిస్తున్న కేటీఆర్‌ ‌ముందుగా నగరంలో టాయిలెట్ల నిర్మాణంపై దృష్టి సారించారు. నగరంలోని అత్యధిక శాతం ప్రజలకు అందుబాటులో ఉండేలా అతి తక్కువ సమయంలో నిర్మించాలని యోచిస్తున్నారు. ఇటీవల పట్టణాభివృద్ధి శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఒక్క హైదరాబాద్‌ ‌నగరంలోనే 3000 టాయిలెట్లను నిర్మించాలని కేటీఆర్‌ ‌మున్సిపల్‌ ‌శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ ‌కుమార్‌, ‌జీహెచ్‌ఎం‌సి కమిషనర్‌ ‌లోకేశ్‌కుమార్‌తో కలసి నగరంలో ఏ తరహా టాయిలెట్లను ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అంశంపై సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నమూనా టాయిలెట్లను పరిశీలించారు. నగరాలు, పల్లెలలో ఏర్పాటు చేయడానికి అనువుగా ఉన్న 10 పబ్లిక్‌ ‌టాయిలెట్ల నమూనాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. వీటిలో పోర్టబుల్‌ ‌టాయిలెట్లు, బస్టాప్‌ ‌టాయిలెట్లు, రైల్వే టాయిలెట్లు, పేవ్‌మెంట్‌ ‌టాయిలెట్లు, హైవే టాయిలెట్లు, అర్బన్‌ ‌టాయిలెట్లు, అంగన్వాడీ టాయిలెట్లను ఇద్దరు ఉన్నతాధికారులు పరిశీలించి నగరంలోని వివిధ ప్రాంతాలలో ఏ తరహా టాయిలెట్లను ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉపయోగంగా ఉంటుందనే అంశంపై క్షుణ్ణంగా సమీక్షించారు.

నగరంలో టాయిలెట్ల నిర్మాణానికి అనువైన స్థలాలను ఎంపిక చేసి నమూనా టాయిలెట్లను నిర్మించేందుకు ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ ‌కల్‌పిట్‌ అషార్‌ ‌సూచించిన విధంగా వీటి నిర్మాణానికి ప్రయత్నాలు చేయాలని అర్వింద్‌ ‌కుమార్‌ ‌జోనల్‌ ‌కమిషనర్లకు సూచించారు. టాయిలెట్ల నిర్మాణానికి ఎంత స్థలం అవసరం అవుతుంది ? వాటి నమూనా ఏ విధంగా ఉండాలి ? అనే అంశాలపై ఆర్కిటెక్టులు సూచనలు అందజేయాలని కోరారు. జీహెచ్‌ఎం‌సి పరిధిలోని ఇంజనీర్లు అందరినీ ఈ పనిలో నిమగ్నం చేయాలని జీహెచ్‌ఎం‌సి కమిషనర్‌ ‌లోకేశ్‌కుమార్‌కు ఆర్వింద్‌ ‌కుమార్‌ ‌సూచించారు. ఈ మార్గంలో ఉపయోగించే మౌలిక సదుపాయాలు టాయిలెట్ల సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వడమే కాకుండా ప్రజల స్థలాలను కూడా పొదుపు చేయడానికి వీలవుతుందనీ, దీనికి తోడు ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను కూడా సులభంగా పాటించడానికి వీలవుతుందని కల్‌పిట్‌ ఆషార్‌ ‌పేర్కొన్నారు. ఈ నమూనాలో శానిటేషన్‌ ‌టెక్నాలజీ, రీ సైక్లింగ్‌ ‌విధానం, నిర్మాణ పద్దతి, తక్కువ వ్యయంతో పాటు వీటిని అతి తక్కువ వ్యయంతో నిర్వహించే అవకాశం ఉందని ఆర్కిటెక్ట్ ‌వివరించారు. రాజస్థాన్‌లోని జైపూర్‌, ఉదయ్‌పూర్‌, ఆజ్మీర్‌, ‌బికనీర్‌, ‌కోటా వంటి నగరాలతో పాటు ఆ రాష్ట్రంలోని 34 ప్రదేశాలలో ఈ నమూనా టాయిలెట్లను నిర్మించామని ఆయన తెలిపారు. బస్టాపులు, బస్టేషన్లు, అర్బన్‌ ‌పార్కులు, మార్కెట్‌ ‌స్థలాలు, స్టేడియంలు, ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్సులు, దవాఖానాలు, నగరంలోని రద్దీగా ఉండే కూడళ్లలో వీటిని నిర్మించామని తెలిపారు.

Leave a Reply