
హెల్త్‌కేర్ రంగానికి చెందిన పిరామల్ గ్రూపు సంస్థ తెలంగాణలో 500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది. కొత్త వసతుల రూపకల్పన, వేర్‌హౌజ్ విస్తరణ కోసం ఆ నిధులను ఖర్చు చేయనున్నది. బుధవారం దావోస్‌లో పిరామల్ సంస్థ చైర్మన్ అజయ్ పిరామల్‌తో .. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. దావోస్‌లో ఉన్న తెలంగాణ పెవీలియన్ వద్ద పిరామల్ సంస్థతో మంత్రి కేటీఆర్ అనేక సంప్రదింపులు జరిపారు. అయితే రానున్న మూడేళ్లలో తెలంగాణలో 500 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు పిరామల్ సంస్థ అంగీకరించింది.
పిరామల్ సంస్థ నిర్ణయాన్ని కేటీఆర్ స్వాగతించారు. ఆ సంస్థకు కావాల్సిన అన్ని అనుమతులను మంజూరు చేస్తామన్నారు. తమ పెట్టుబడితో సుమారు 500 మందికి ఉపాధి కల్పించనున్నట్లు పిరామల్ సంస్థ పేర్కొన్నది. ఇదిలావుంటే మంత్రి కేటీఆర్‌ను దావోస్‌లో స్విట్జర్లాండ్, యూకే టీఆర్ఎస్ టీమ్స్ ప్రతినిధులు కలిశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్.. దావోస్‌కు రెండు రోజుల క్రితం వెళ్లిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఎన్నారై టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రవాస భారతీయుల విధాన రూపకల్పనకు కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో కేటీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలోని పలు అంశాలపై కూడా చర్చించినట్లు ఎన్నారై ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి అవసరమైనంత వరకు సహాయం చేస్తామని వారు హానిచ్చారు. ఇక ఎన్నారై పాలసీ త్వరలోనే అమల్లోకి వస్తుందని కేటీఆర్ చెప్పినట్లు ఎన్నారై ప్రతినిధులు తెలిపారు.