ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల మున్సిపాలిటీలపై కేటీఆర్, ఇంద్రకరణ్ సమీక్ష
పురపాలక సంఘాల పరిధిలోని పట్టణాల్లో రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం వంటి కనీస అవసరాలపై ప్రధానంగా దృష్టి సారించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులకు సూచించారు. ప్రణాళికాబద్ధంగా పట్టణాలను అభివృద్ధి చేసే విధంగా రూపకల్పన చేయాలని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని బుద్ధభవన్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల మున్సిపాలిటీలపై కేటీఆర్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మున్సిపాలిటీల అభివృద్ధికి ఓ నమూనాను తయారు చేసుకోవాలన్నారు. ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడమే లక్ష్యంగా పురపాలన కొనసాగాలని చెప్పారు. కొత్త పురపాలక చట్టం నిర్దేశించిన విధులకు కచ్చితంగా అమలు చేయాలని పేర్కొన్నారు. పట్టణ ప్రగతి లక్ష్యాలలో భాగంగా హరితహారం కార్యక్రమంలో విరివిగా మొక్కలు నాటాలనీ, గ్రీన్ బడ్జెట్లో 10 శాతం నిధులను పచ్చదనానికి కేటాయించి పార్కులు, నర్సరీలను అభివృద్ధి
చేయాలన్నారు.
ప్రతీ మున్సిపాలిటీలో వెజ్, నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్లను ఏర్పాటు చేయాలనీ, వైకుంఠధామాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. జంతు సంరక్షణ కేంద్రం, బయోలాజికల్, బయో మెడికల్ వ్యర్థాలుతో పాటు డెమాలిష్ వేస్టేజ్ నిర్వహణ కూడా చేపట్టాలన్నారు. అన్ని మున్సిపాలిటీలలో ప్రతీ 1000 మందికి ఒక టాయిలెట్ ఉండే విధంగా చూడాలనీ, వాటిలో 50 శాతం షీ టాయిలెట్లు ఉండాలన్నారు. ప్రతీ మున్సిపల్ కమిషనర్, చైర్మన్ ఉదయం 5.30 గంటలకే ఫీల్డ్‌లో ఉండాలనీ, పట్టణంలో సర్ప్రైజ్ విజిట్ చేయాలని ఆదేశించారు. అలాగే, చెత్త సేకరణ ప్రతీ రోజు జరగాలనీ, తడి, పొడి చెత్తను విడిగా సేకరించాలని స్పష్టం చేశారు. అవసరమున్న చోట రోడ్లను ఊడ్చే యంత్రాలను కొనుగోలు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో విప్ బాల్క సుమన్, ఎంపి వెంకటేశ్ నేత, ఎమ్మెల్యేలు జోగు రామన్న, కోనేరు కోణప్ప, దివాకరరావు, దుర్గం చిన్నయ్య, విఠల్ రెడ్డి, రేఖా నాయక్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సత్యనారాయణ, కలెక్టర్లు ముషారఫ్ అలీ, సిక్తా పట్నాయక్, భారతి హొళికేరి, సందీప్‌కుమార్ ఝా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీల చైర్మన్లు, కమిషనర్లు పాల్గొన్నారు.