Take a fresh look at your lifestyle.

కృషీవలుడు.. కృష్ణ ఆదిత్య

ఆయన నిత్య కృషీవలుడు. విధుల పరంగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం.. నిరంతర శ్రమతో వాటిని సాధించడం ఆయనకు తెలిసిన విద్యలు. ఆత్మీయ పలకరింపులతోనే సహచర ఉద్యోగుల పనుల్లో వేగం పుంజుకునేట్లు చేయడం ప్రత్యేకత. చదివింది ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో.. పని చేస్తుందేమో మారుమూల అటవీప్రాంతమైన ములుగులో..! చిన్న వయసులో పెద్ద బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనే.. ములుగు జిల్లా కలెక్టర్‌ ‌శ్రీరాంసెట్టి కృష్ణ ఆదిత్య. ప్రజాసమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత నిచ్చే ఆయనలో ఐఏఎస్‌ అధికారిననే దర్పం ఏ మాత్రం కనిపించదు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు పరుస్తూనే, మరో వైపు ఉత్తమ సేవలు అందించేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నారు. 1985 అక్టోబర్‌ 4‌న నల్గొండ పట్టణంలో శ్రీరాంసెట్టి సుజాత-శంకర్‌రావు దంపతులకు కృష్ణ ఆదిత్య జన్మించారు. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ లెక్చరర్లుగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ప్రాథమిక, హైస్కూల్‌ ‌విద్యను నల్గొండలో పూర్తి చేశారు. విజయవాడ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్‌, ‌హైదరాబాద్‌ ‌మాతృశ్రీ ఇంజినీరింగ్‌ ‌కళాశాలలో బీటెక్‌ ‌చదివారు.

తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వెలువడిన గ్రూప్‌-1 ‌ఫలితాల్లో ఆయన ఏడోర్యాంకు సాధించి డీఎస్పీ పోస్టు పొందారు. ‘అప్పా’లో ఏడాదిపాటు శిక్షణ పూర్తి చేసుకున్నారు. 2014 ఆగస్టు 15న విశాఖ పట్టణానికి చెందిన కర్రి పుష్పను ఆదర్శ వివాహం చేసుకున్నారు. ఆమె ప్రస్తుతం వరంగల్‌ ‌సెంట్రల్‌జోన్‌ ‌డీసీపీగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు ఆశ్రిత్‌, ‌కూతురు ఆద్యా ఉన్నారు. మేనమామ, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నితీ అయోగ్‌ అడిషినల్‌ ‌సెక్రెటరీ కొలనుపాక రాజేశ్వర్‌ ‌రావును స్ఫూర్తిగా తీసుకున్న కృష్ణ ఆదిత్య అమ్మమ్మ కొలనుపాక రుక్మిణి ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారంతో సివిల్స్ ‌రాసి అఖిలభారత స్థాయిలో 99వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌ ‌పొందారు. శిక్షణాంతరం 2014 సెప్టెంబర్‌ 2‌న నారాయణపేట సబ్‌ ‌కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర పాటు అక్కడ సేవలందించారు. అనంతరం మహబూబ్‌నగర్‌ ఆర్డీవోగా బదిలీపై వెళ్లి సమర్థవంతంగా పనిచేశారు. 2018లో నాలుగు నెలల పాటు, మహబూబ్‌నగర్‌ ‌జాయింట్‌ ‌కలెక్టర్‌గా సేవలందించారు. 2019 మే 18 నుంచి 2020 ఫిబ్రవరి మొదటి వారం వరకు ఆదిలాబాద్‌ ‌జిల్లా ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా విధులు నిర్వర్తించారు. అనంతరం 2020 ఫిబ్రవరి 8న ములుగు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా ప్రజలకు సేవలందిస్తున్నారు.

పేదల ఆశాజ్యోతిగా పేరెన్నికగన్న కృష్ణ ఆదిత్య ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ఆదర్శ అధికారిగా గుర్తింపు పొందారు. ఫైల్‌ ‌మేనేజ్‌మెంట్‌ను పక్కాగా అమలు చేస్తున్న ఆయన జిల్లా ప్రధాన కార్యాలయాన్ని ఈ-ఆఫీస్‌గా మార్చారు. ఫైల్‌ ‌ట్రాక్‌ ‌సిస్టమ్‌ను అమలు చేస్తూనే ప్రభుత్వ కార్యాలయాలను ఆధునీకరించారు. 2019 ఫిబ్రవరి 17న కొట్లాడి సాధించుకున్న ‘ములుగు’ జిల్లాను ప్రగతి పథంలో నిలిపేందుకు ఆరాట పడుతున్నారు. గోదావరి నదీజలాల సమర్థ వినియోగం, దేవాదుల ఎత్తిపోతల పథకానికి నీటి లభ్యత పెంచే ఉద్దేశంతో చేపట్టిన తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజీ పనులను పూర్తి చేయిస్తున్నారు. జిల్లా కేంద్రంలో జాతీయ రహదారిని విస్తరించి, సెంట్రల్‌ ‌లైటింగ్‌ ఏర్పాట్లు చేశారు. 2020 ఫిబ్రవరిలో జరిగిన మేడారం మహాజాతర విజయవంతంలో పాలుపంచుకున్నారు. జాతర అనంతరం పారిశుధ్యం పనులను ఐదురోజుల్లోనే పూర్తి చేసి ప్రశంసలు పొందారు. పాకాల, రామప్ప, బొగత జలపాతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నారు. ఎకో టూరిజం అభివృద్ధితోపాటు, రామప్ప దేవాలయానికి ‘యునెస్కో’ గుర్తింపు వచ్చేలా కృషి చేస్తున్నారు. జిల్లాలో శిథిలావస్థలో ఉన్న దేవాలయాలను ఆధునీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యా, వైద్య రంగాల్లో మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఏజెన్సీలో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచిన ఆయన 340 యూనిట్ల ‘మినీ డయిరీ’ ని సాధించారు.

భారీ వర్షాల మూలంగా నీటమునిగిన ప్రాంతాల్లో కలెక్టర్‌ ‌కృష్ణ ఆదిత్య విస్తృతంగా పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు. ఏజెన్సీ గ్రామాలను సందర్శించి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించారు. జిల్లాలో వరద ఉధృతిని స్వయంగా పరిశీలించి తగు చర్యలు తీసుకున్నారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, పంటలు, డ్రైయినేజీలు, ఇళ్లు, వాగులు, ముంపు ప్రాంతాలను పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. జలదిగ్భందంలో చిక్కుకున్న వారికి ప్రాణనష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ముంపునకు గురైన బాధితులు, అనారోగ్య సమస్యలతో బాధ పడే వారిని, గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జిల్లా వ్యాప్తంగా 28 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితులకు భోజనం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించారు. అలాగే వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటల వివరాలను కలెక్టర్‌ ‌ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గోదావరి వరదబాధితులు అధైర్యపడకుండా వారిని ఆదుకుంటారనే భరోసా కల్పించారు. ముంపు నివారణకు శాశ్వత పరిష్కారంతోపాటు, బాధితులందరికీ పరిహారం అందేలా కలెక్టర్‌ ‌కృషి చేస్తున్నారు. ఓవైపు కరోనా విలయతాండవం.. మరో వైపు వరదలు బీభత్సం సృష్టించినప్పటికీ జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్‌ ‌కృష్ణ ఆదిత్య అప్రమత్తం చేసి ప్రజలచేత ‘శభాష్‌’ అనిపించుకున్నారు.

విశ్వమంతా విలయతాండవం చేస్తున్న కరోనా కట్టడికి కలెక్టర్‌ ‌కృష్ణ ఆదిత్య నాయకత్వంలో ములుగు జిల్లా యంత్రాంగం నిర్విరామంగా కృషి చేస్తున్నది. వైరస్‌ ‌నియంత్రణ కోసం ఆయన ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులను మెరుగుపరిచారు. వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు, శానిట్నె జర్లు, ఔషదాలు సమ కూర్చారు. కరోనా తోపాటు వైరల్‌ ‌ఫీవర్లకు ట్రీట్‌మెంట్‌ ‌చేసేలా చర్యలు తీసుకున్నారు. అలాగే సీజనల్‌ ‌వ్యాధులను సకాలంలో అరికట్టారు. హరితహారం కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు చేతినిండా పని కల్పించారు. ప్రతీ గ్రామ పంచాయతీలో ఉపాధిహామీ పనులను పూర్తి చేయించారు. కష్టకాలంలో ఉన్న పేదలను ఆదుకుంటున్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేశారు. మిషన్‌ ‌కాకతీయ, మిషన్‌ ‌భగీరథ పథకాలను పూర్తి చేయించారు. రైతుబంధు పథకాన్ని అన్నదాతలకు అందించారు.

రైతులు పండించిన వ్యవసాయ పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం పెరిగినందున డిమాండుకు తగినట్లు ఎరువులు, క్రిమి సంహారక మందులు అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ నిబంధనల మేరకే విత్తనాలు విక్రయించే విధంగా చర్యలు తీసుకున్నారు. నకిలి విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే పీడీయాక్ట్ ‌నమోదు చేయిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులకు భరోసా కల్పిస్తున్నారు. హై రిస్క్ ఉన్నవారిని గుర్తించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. ‘అమ్మఒడి’ పథకం కింద వారికి కేసీఆర్‌ ‌కిట్లు అందజేస్తున్నారు. నిరుపేదలకు అండగా నిలుస్తూ.. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ‌చెక్కులను అందిస్తున్నారు. అర్హులందరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకున్నారు. గ్రామాల్లో టాయిలెట్లు నిర్మించుకోని కుటుంబాలకు ప్రభుత్వ పథకాలను నిలిపేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు సంకటంగా మారిన ప్లాస్టిక్‌ ‌నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. జిల్లా ప్రగతికి పక్కా ప్రణాళికలు రూపొందిస్తూనే, అట్టడుగు వర్గాలకు సమన్యాయం చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ‘ములుగు వెలుగు, మారైతే మారాజు, ప్లాస్టిక్‌ ‌నియంత్రణ, అటెండెన్స్ ‌యాప్‌’ ‌కార్యక్రమాలను అమలు చేస్తూ జిల్లా సమగ్రాభివృద్ధికి కలెక్టర్‌ ‌పాటుపడుతున్నారు. తెలంగాణ సాధించడం ఒక ఎత్తైతే, అభివృద్ధి చేసుకోవడం మరో ఎత్తు అంటారాయన. నాటిన మొక్కలను సంరక్షించడం అందరి బాధ్యతని, వాటిని పెంచి భవిష్యత్‌ ‌తరాలకు ఆదర్శంగా నిలవాలని కలెక్టర్‌ ‌కృష్ణ ఆదిత్య సూచిస్తున్నారు.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కల సంరక్షణపై దృష్టి సారించాలంటారాయన. ప్రస్తుత క్లిష్టపరిస్థితుల్లో అధికారులు, పౌరసమాజం కలిసి పనిచేయాలంటారు కలెక్టర్‌ ‌కృష్ణ ఆదిత్య. సమష్ఠి కృషితోనే కరోనా వైరస్‌ను కట్టడి చేయవచ్చునంటారు. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు స్వీయ నియంత్రణతోపాటు, భౌతిక దూరం పాటించాలి. కరోనా బారిన పడకుండా మాస్కులు ధరిస్తూనే, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలంటారు కృష్ణ ఆదిత్య.

gaddam kesava murthy
గడ్డం కేశవమూర్తి
సీనియర్‌ ‌జర్నలిస్ట్, ‌రచయిత, వరంగల్‌, ‌రాష్ట్ర విశిష్ఠ పురస్కార గ్రహీత, సెల్‌ : 8008794162

Leave a Reply