– రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నాం
– 23న జరిగే ట్రిబ్యునల్-2లో బలమైన వాదనలు వినిపిస్తాం
– నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13: కృష్ణా జలాల వ్యవహారంలో రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు చెందాల్సిన నీటి వాటాలో చుక్క నీరు కుడా వదులుకునే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. ఈనెల 23 నుండి 25 వరకు దిల్లీలో జరగనున్న కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ) విచారణలో తాను స్వయంగా పాల్గొనబోతున్నట్లు ఆయన వెల్లడిరచారు. ఈ విచారణలో ప్రభుత్వం అనుసరించాల్సిన అంశంపై జలసౌధలో న్యాయ నిపుణులు, నీటిపారుదలరంగ నిపుణులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ఈ అంశంపై ఒత్తిడి తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని దిల్లీకి చేరుకుని సమీక్షిస్తారని వెల్లడిరచారు. కృష్ణా జలాల్ణో రాష్ట్ర వాటాను సాధించేందుకు బలమైన వాదనలు వినిపించేందుకు పూర్తిస్థాయిలో అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశామని, వారు ఇచ్చే నివేదికల ఆధారంగా న్యాయవాదులు తెలంగాణకు చెందాల్సిన నీటి వాటాపై వాదనలు వినిపించనున్నారని పేర్కొన్నారు. కేడబ్ల్యూడీటీ ఎదుట 2025 ఫిబ్రవరి నుండి వాదనలు కొనసాగుతున్నాయని, సమైక్యాంధ్రలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయంపై ప్రస్తావించారని ఆయన తెలిపారు. శాస్త్రీయంగా నీటి కేటాయింపులు, ఏపీ చేపట్టిన అనధికార బేసిన్‌ల వివరాలు, తెలంగాణ ప్రాంతంలో సాగునీటి అవసరాలను అందులో పొందుపరిచారన్నారు. ఏపీ ప్రభుత్వం కాలువల సామర్ధ్యాలను పెంచుకుంటూ గోదావరి, పట్టిసీమ, చింతలపూడి, పులిచింతల నీటిని అక్రమంగా తరలించుకుపోతున్న అంశాలను ఇప్పటికే ట్రిబ్యునల్ ముందుంచామన్నారు. 1956 జలవివాద చట్టం-2014, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాల ఉల్లంఘనలకు పాల్పడిన విషయంపై వాదనలు వినిపించామన్నారు. 811 టీఎంసీల కృష్ణా జలాశయాలలో తెలంగాణ ప్రాంతానికి 71 శాతం కేటాయింపులు ఉండాలని డిమాండ్ చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ఇక్కడ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు 65 శాతం కేటాయింపులు ఉండాల్సిందేనన్నారు. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్లు నీటి కేటాయింపులు ఉండాలని, అందుకనుగుణంగా తాజా సమాచారాన్ని ట్రిబ్యునల్‌కు సమర్పించామని చెప్పారు. తాజాగా అధికారులు అందించే నివేదికల ప్రకారం జూన్, జూలైలలో ఇక్కడికి అవసరమైన నీటి కోసం 80 టీఎంసీల నీటిని అందుబాటులో ఉంచేలా వాదనలు వినిపించడంతోపాటు ఆపరేషన్ ఫ్రొటోకాల్ నిబంధనలననుసరించి మిగిలిన నీటిని వినియోగించుకునే స్వేచ్ఛ తెలంగాణకు ఉండాలని ట్రిబ్యునల్ ముందుంచుతామన్నారు. ఐఎస్‌ఆర్‌డబ్ల్యుడి చట్టంలోని సెక్షన్ 4(1)ఎతో పాటు పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 11వ షెడ్యూల్ పదో పేరాగ్రాఫ్ వంటి న్యాయపరమైన అంశాలపై కూడా వాదించబోతున్నట్లు మంత్రి వివరించారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా వినియోగిస్తున్న 291 టీఎంసీల నీటి ఉదంతం వెలుగులోకి వచ్చినందున ఆ నీటిని పునర్విభజన చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్, నదుల నిర్వహణ బోర్డుల ఎదుట ఏపీ ప్రభుత్వం తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులపై అడ్డుపడుతుండడంతో ఒకింత ఆలస్యం జరుగుతోందని, ప్రాజెక్టుల నిర్మాణాలపై తెలంగాణకు ఉన్న హక్కులను కుడా ట్రిబ్యునల్ ఎదుట జరిగే వాదనలలో వినిపిస్తామని చెప్పారు. తమ వాదనలకు బలం చేకూరేలా ప్రతిపాదిత ప్రాజెక్టుల నిర్మాణాల అంశాలతో కూడిన ప్రత్యేక జీవోను రాష్ట్రం విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నదన్నారు. వీటిలో కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల సామర్ధ్యం పెంపుతోపాటు హైదరాబాద్ మహానగరం తాగునీటి అవసరాల కోసం కొత్తగా నిర్మిస్తున్న రిజర్వాయర్లు, 100 టీఎంసీలను మళ్లించడానికి వీలుగా రూపకల్పన చేసిన జూరాల ఫ్లడ్ ఫ్లో కెనాల్స్ ఉన్నాయన్నారు. ఇప్పటివరకు తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తిచేయకపోవడం, గత పాలకుల ఉదాసీనతతోనే ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించుకుపోయి ప్రయోజనం పొందిందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన మరుక్షణం నుంచి తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి వాటాపై గట్టిపట్టు పడుతున్నామన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ట్రిబ్యునల్ ఇప్పటికే గుర్తించిందన్నారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇ.ఎన్.సి అంజద్ హుస్సేన్, సుప్రీంకోర్టు న్యాయవాది సిఎస్.వైద్యనాధ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




